Wednesday, July 3, 2024

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున్న సమితి తొలిసారిగా ఆయా దేశాల్లో ప్రజలు ఏ మేర కు సంతోషంగా ఉన్నారనే కోణంలో సర్వేలు నిర్వహించింది. అభివృద్ధితో నిమిత్తం లేకుండా ఆయా దేశాల పౌరులు ఏ మేరకు ఆనందంగా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. 2006 నుంచి 2011 మధ్యకాలంలో జరిగిన ఈ సర్వే ఫలితాలపై ఆధారపడి వివిధ దేశాలకు ఈ సంతోష సూచికలో స్థానాలను కేటాయించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ సూచికలో కూడా మన దేశం బాగా వెనుకబడిం ది. 156 దేశాలున్న జాబితాలో 94వ స్థానాన్ని పొంది దుఖంలో ఉన్న దేశమనిపించుకుంది. పొరుగుదేశాలైన మియన్మార్ 74వ స్థానంలో, పాకిస్తాన్ 85వ స్థానంలో నిలిచి మనకంటే మెరుగైన పరిస్థితిలో ఉండడం గమనార్హం. ప్రపంచంలోకెల్లా అత్యంత సంతోషంగా ఉన్న దేశంగా డెన్మార్క్ మొదటి స్థానాన్ని పొందగా రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో నార్వే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో నెదర్లాం డ్స్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికాకు 11వ స్థానం దక్కగా బ్రిటన్ 18వ స్థానాన్ని, ఫ్రాన్స్ 23వ స్థానాన్ని, జర్మనీ 30వ స్థానాన్ని, రష్యా 76వ స్థానాన్ని ఆక్రమించాయి.

సంతోషంగా లేని దేశాలకు వస్తే సూచికలో చివరి స్థానాన్ని ఆక్రమించిన ఆఫ్రికాకు చెందిన టోగో ప్రపంచంలోనే అత్యంత దుఖదాయక దేశంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను చీకటి ఖండానికే చెందిన బెనిన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సియాపూరాలియోన్, బురుండి, కొమరోస్, హైతి, టాంజానియా, కాంగో ఆక్రమించాయి. ఆసియా దేశా ల్లో ఇజ్రాయెల్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారని ఈ సర్వే తేల్చింది. సూచికలో ఈ దేశం 14వ స్థానాన్ని పొందింది. 17వ స్థానంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 26వ స్థానంతో సౌదీఅరేబియా, 29వ స్థానంతో కువైట్ టాప్ థర్టీలో చోటు సంపాదించాయి. 138వ స్థానంతో కంబోడియా, 131వ స్థానంతో అఫ్ఘనిస్తాన్, 132వ స్థానంతో శ్రీలంక ఆసియాలో అత్యంత దుఖదాయక దేశాలుగా నిలిచాయి.

సూచికను నిశితంగా పరిశీలిస్తే కొన్ని కఠిన వాస్తవాలు అర్థమవుతాయి. అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా యూరపు దేశాల ప్రజలు సాధారణంగా ఎక్కువ సంతోషంతో ఉన్నారు. సూచికలోని టాప్ ట్వంటీ దేశాల్లో పదహారు ఇవే కావడం ఇందుకు నిదర్శనం. ఈ దేశాలన్నీ ధనిక దేశాలు. శతాబ్దా ల కిందటే పారిక్షిశామిక వికాసం జరిగి ఆసియా, ఆఫ్రి కా ఖండంలోని అనేక వెనుకబడిన దేశాలను వలసలుగా మార్చుకుని వందల ఏళ్లు పాలించిన దేశాలు. అక్కడి చౌక శ్రమశక్తిని ఇంధనంగా మార్చుకుని ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకున్న దేశాలు. వలసవూపజల తిరుగుబాట్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం స్వదేశీ ప్రజలను ఐక్యంగా, సంతోషంగా, తమ వెనుకాల ఉంచుకోవడం ఆ దేశాల పాలకులకు అనివార్యమైంది. అందుకే దోచుకున్న సంపదలో కొంతభాగాన్ని పౌరులకు కేటాయించారు. సమస్త సౌకర్యాలను, సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య భద్రతలను కల్పించారు. వలసల్లో నియంతృత్వాన్ని అమలుచేసినా తమ ప్రజలకు మాత్రం స్వేచ్ఛా స్వాతంవూత్యాలను, పూర్త్తిస్థాయి ప్రజాస్వామిక హక్కులనూ ఇచ్చారు. తర్వాతికాలంలో వలసలు పేరుకు స్వాతం త్య్రం పొందినా ఇప్పటికీ ఆయా దేశాల పాలకులను, పాలనను వీరే శాసిస్తున్నారు. అక్కడున్న భారీ పెట్టుబడులు ఎడతెగని లాభాల ప్రవాహాన్ని సృష్టిస్తున్నాయి. ఈ లాభాలతోనే తమ ప్రజలను కొంతమేరకు సంతోషంగా ఉంచగలుగుతున్నారు.

సంతోషంగా ఉన్న మరోరకం దేశాలు చమురు నిక్షేపాలను దండిగా కలిగివున్న మధ్యవూపాచ్యపు దేశాలు. యుఏఇ, కువైట్, సౌదీఅరేబియా, కటార్ లాంటి దేశాలు రాచరికపు అమీర్‌ల పాలనలో ఉన్నా ధనబలంతో తమ పౌరులను సంతోషంగా ఉంచగలుగుతున్నాయి. వలస కార్మికులు, ఇతర దేశస్తులతో పోల్చితే అక్కడి పౌరులకు స్వేచ్ఛాస్వాతంవూత్యాలు కూడా ఎక్కువే కనుక సర్వేలో తాము సంతోషంగా ఉన్నామనే చెప్పివుంటారు. ఇక సంతోషంగా లేని దేశాల విషయానికి వస్తే ఇవన్నీ వెనుకబడిన ఆఫ్రికా, అభివృద్ధి చెందుతున్న ఆసియా ఖండాలకు చెందిన దేశాలు. శతాబ్దాలుగా వలస పాలనలో మగ్గి, దశాబ్దాలుగా అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న ఈ దేశాల ప్రజలు కడుదీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక కాంగో.. ఒక బురుండి.. ఒక హైతి.. ఇలా ఏ దేశ చరిత్ర చూసినా సామ్రాజ్యవాదుల యుద్ధక్షికీడలకు వేదికగా మారిన వైనమే మనకు కనిపిస్తుంది. అగ్రరాజ్యానికి, ప్రపంచబ్యాంకుకు తాబేదార్లు గా మారిన పాలకులు ప్రజల సంక్షేమం కంటే తమ క్షేమానికి పెద్దపీట వేసిన ఫలిత మే అక్కడ నెలకొన్న పేదరికం. ఈ దేశాలన్నింటిలో మెండుగా ఉన్న ఖనిజవనరుల ను బహుళజాతి కంపెనీలకు అమ్ముకుంటూ అధికారంలో ఉన్న వర్గాలు, దళారులు కోట్లకు పడగపూత్తుతుంటే ప్రజలు మాత్రం దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారు..

మన దేశానికి వస్తే జాబితాలో 94వ స్థానం లభించడం ఒక చారివూతక విషాదమేనని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వర్ధిల్లుతున్న దేశంలో ప్రజలకు సుఖశాంతులు కరువవడం పాలకులకే సిగ్గుచేటు. వలస పాలన నుంచి విముక్తి పొంది 65 ఏళ్లు గడిచింది. మనను మనమే పాలించుకుంటున్నాం. వైశాల్యంలో మన దేశానిది ఏడవ స్థానం. జనాభాలో రెండవ స్థానం. ప్రపంచ ఖనిజనిక్షేపాల్లో నాలుగవ వంతు మన దేశంలోనే ఉన్నాయి. మాంగనీస్ నిల్వల్లో రెండవ స్థానం.. ఇనుము నిల్వల్లో మూడవ స్థానం.. బొగ్గు నిల్వల్లో నాలుగవ స్థానం. ప్రపంచ మైకా నిల్వల్లో నాలుగింట మూడు వంతులు మనవే. సహజవాయువు, చమురు నిల్వలకూ ఇక్కడ కొదవ లేదు. పుష్కలంగా నీళ్లున్నాయి. సంవత్సరమంతా పారే గంగ, యమున, గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర వంటి జీవ నదులున్నాయి. సారవంతమైన 19 కోట్ల హెక్టార్ల సాగుభూములున్నాయి. వ్యవసాయోత్పత్తుల్లో మనది రెండవ స్థానం. కష్టించి పనిచేసే ప్రజలున్నారు. చైనా తర్వాత ఎక్కువ సంఖ్యలో సుమారు 49 కోట్ల శ్రమజీవుల బలగమున్న దేశం మనది.

ఇన్ని విశిష్ఠతలు, అనుకూల అంశాలున్నా దేశంలో నివసిస్తున్న 90శాతం ప్రజలు అపార దుఖంతో ఉన్నారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారమే ఇక్కడ 41.6 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. రోజుకు కనీసం రూ.20 కూడా ఖర్చు పెట్టలేని వారు జనాభాలో 77శాతం ఉన్నారని ఓ ప్రభుత్వసంస్థ అంచనా వేసింది. ఇందులో 30 శాతం వరకూ కడుపేదరికం అనుభవిస్తూ తినడానికి సరైన తిండి కూడా లేని పరిస్థితుల్లో బతుకుతున్నారు. 2011 ఆకలి సూచికలో మన దేశం 45వ స్థానం ఆక్రమించింది. ప్రతి వేయి మందిలో 24 మంది ఆకలితో, పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. ఇక్కడి ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు రక్తహీనతతో, ఐదేళ్ల లోపు పిల్లల్లో 42 శాతం మంది భారహీనతతో సతమతమవుతున్నారు. ఇక ప్రతి వేయి మంది శిశువుల్లో 48 మంది ఇంకా కళ్లు తెరువకముందే ఈ లోకాన్ని వీడి వెళ్తున్నారు.
ఆత్మహత్యలకూ ఇక్కడ కొదవ లేదు. ఆర్థిక బాధలు, భరించలేని రోగాలు, అధికారుల వేధింపులు, పోలీసుల చిత్రహింసలు చివరకు పౌరుల కనీస ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చని ప్రభుత్వ విధానాలు యేటా లక్షల మంది బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. 1997 నుంచి ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా రైతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు.

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య అంటూ మీడియాలో వార్త రాని రోజుండదు. లాకప్‌డెత్‌లు జరుగుతూనేవుంటాయి. పార్లమెంటులో ఇచ్చిన హామీని నిలబెట్టుకొమ్మని పాలకులను అర్థిస్తూ 800 మందికి పైగా తెలంగాణ యువతీ యువకులు ప్రాణాలు తీసుకోవడం చరివూతలో ఎప్పుడూ, ఎక్కడా జరిగుండదు. ఇక కనీస సౌకర్యాల విషయానికి వస్తే దేశ జనాభాలో 53 శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. 41.6శాతానికి స్నానపు గదులు లేవు. 32.8 శాతం ఇళ్లకు కరెంటు లేదు. యాభై శాతం గ్రామాలకు రోడ్లు లేవు. రేడియో, టీవీ, సైకిల్, మోపెడ్, ఫోన్, బ్యాంక్ అకౌంట్ వంటి సౌకర్యాలులేని కుటుంబాలు దేశంలో 34.5 శాతం ఉన్నా యి. మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల జీవన విధ్వంసం విచ్చలవిడిగా కొనసాగుతోంది. స్టీలు ఫ్యాక్టరీలంటారు.. పవర్ ప్లాంట్లంటారు.. సెజ్‌లంటారు.. వేల ఎకరాలు లాక్కుంటారు.. సాయుధ బలగాల దన్ను తో బహుళజాతి కంపెనీలు తిష్ట వేస్తాయి. భారీగా లాభా లు దండుకుంటాయి.. ఇలాంటి అభివృద్ధి మాకొద్దన్న స్థానికులకు ఉద్యోగాల కు బదులు లాఠీదెబ్బలు, ఇళ్లకు బదులు జైళ్లు లభిస్తాయి. ఇన్ని బాధల మధ్య జీవిస్తున్న భారతీయులు తాము సంతోషంగా ఉన్నామని ఎలా చెప్పగలరు?

ఇప్పటికైనా మన పాలకులు కళ్లు తెరవాలి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకర ణ పేరిట ‘స్వదేశీ’ వనరులను విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టకుండా ‘స్వయం సంపూర్ణ’బాటలో పయనిస్తూ దేశాన్ని పారిక్షిశామికీకరించాలి. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయాన్ని ఆధునీకరించాలి. అభివృద్ధిలో ప్రజలకు విస్తృత భాగస్వామ్యం కల్పించాలి. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకోవాలి. ప్రాజెక్టుల్లో, పథకాల్లో కుంభకోణాలు జరుగకుండా నివారించాలి. అవినీతిపరులను కఠినంగా శిక్షించే చట్టాలను ఆమోదించాలి. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ డబ్బును పేదరిక నిర్మూలనకు వినియోగించాలి. యువత ఉద్యోగ భద్రతకు ప్రభుత్వమే హామీ పడాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి. వైద్యవిద్యకు భారీ నిధులు కేటాయించి పల్లెపప్లూనా ప్రభుత్వ వైద్యుడు, ప్రాథమిక విద్యాకేంద్రం ఉండేలా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రజాస్వామిక డిమాండ్లపై ఉద్యమిస్తున్న ప్రజల ఆకాంక్షలను గుర్తించి, వాటిని నెరవేర్చడానికి కృషి చేయాలి. అప్పుడే ప్రజలు సంతోషంగా ఉండగలరు.

 

-డి. మార్కండేయ

 

Latest News