Monday, July 8, 2024

అబూజ్‌మాడ్‌పై దాడి-3: మావోయిస్టుల ఎత్తుగడలు ఇవేనా?

(డి మార్కండేయ)

అబూజ్మడ్ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్ట బెట్టేందుకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం దాడికి సన్నాహాలు చేస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో ఆరోపించింది. మాడ్ కొండలు మావోయిస్టులకు సైనిక, రాజకీయ శిక్షణ కేంద్రంగా మారాయన్నది కేవలం సాకు మాత్రమేనని తెలిపింది. వామపక్ష తీవ్రవాదుల నిర్మూలన పేరుతో ప్రాచీన గిరిజన తెగలలో ఒకటైన మాడియా గోండుల జీవన విధానాన్నీ, సంస్కృతీ సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయబూనుకుంటున్నారని ఆరోపించింది. ఈ కుట్రను బహిర్గత పరచాల్సిందిగా తన శ్రేణులకు పిలుపునిచ్చింది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసీ సంఘాలను ఈ సమస్యపై కూడగట్టాలని హితవు పలికింది. తమ జాతిపై పరాయి పాలకులు చేస్తున్నదండయాత్రను ప్రతిఘటిం డానికి స్థానిక మీడియా యువతీ యువకులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చింది. ఈసారి శత్రువు చేయబోయే దాడి చాలా తీవ్రమైనదిగా ఉంటుందని, దీర్ఘకాలం కొన సాగవచ్చునని హెచ్చరించింది. శత్రుదాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పొలిట్‌బ్యూరో ఈ కింది చర్యలను సూచించింది.

మావోయిస్టుల ఎత్తుగడలు ఇవే..

  • అబూజ్మడ్ పై శత్రువు తలపెట్టిన దాడి గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను, ఆదివాసీ సంఘాలను, కలిసివచ్చే ఇతర అన్ని సంస్థలను కూడగట్టాలి. గోండ్వానా ప్రాంత సహజ వనరులను దోచుకోవడానికి తెగబడుతున్న సామ్రాజ్యవాదుల, భారత బడా పెట్టుబడిదారుల విధానాలపై, ఆదిమ తెగల్లో ఒకటైన మాడియా గోండుల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు అంతరించి పోయే ప్రమాదంపై ఉద్యమం చేపట్టాలి.
  • దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మూలంగా శత్రువుకు బలగాల మోహరింపులో కొంత వెసులుబాటు ఉన్నా ఇప్పటికీ పరిమితులు కూడా అనేకం ఉన్నాయి. విప్లవోద్యమం కొనసాగుతున్న అన్ని రాష్ట్రాలకూ కేంద్ర బలగాలను పంపించే పరిస్థితిలో కేంద్రం లేదన్నది స్పష్టం. అందుకే అబూజ్మడ్ గెరిల్లా ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే మిగతా ఛత్తీస్గఢ్లోనూ, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లోని ఉద్యమ ప్రాంతాల్లోనూ మనం ప్రతిఘటనను పెంచాలి. తక్షణం సంబంధిత కమిటీలు, మిలిటరీ కమాండ్లు దాడుల కెంపెయిన్ (టిసిఒసి-టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ కెంపెయిన్)కు ప్లాన్ చేయాలి. తద్వారా శత్రుబలగాల దృష్టిని మళ్లించాలి.
  • కొత్త ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరింపజేయాలి. మనం బలంగా ఉన్న పలు రాష్ట్రాల్లోనూ ఉద్యమం అసలు లేని ప్రాంతాలున్నాయి. ఇలాంటి చోట్లకు వర్గపోరాటాన్ని విస్తరించాలి.
  • శత్రు బలగాల దాడి జరిగిన చోట గట్టిగా ప్రతిఘటించాలి. గెరిల్లా పద్ధతుల్లో మెరుపుదాడులు చేయాలి. ఆత్మరక్షణకు ప్రాధాన్యమిస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా పిఎల్జీఏ దళాలు శత్రువును దెబ్బతీయాలి. శత్రువు పైచేయి సాధించిన చోట్ల నష్టాలను నివారిస్తూ తిరోగమించాలి. – విప్లవోద్యమ ప్రాంతాలన్నింట్లో ప్రజా ప్రతిఘటనను పెంచాలి.
  • వివిధ సమస్యలపై అన్నివర్గాల ప్రజల్లో పోరాటాలను రగిలిస్తూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలి. తద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల నుంచి మన పార్టీ వేరు కాకుండా జాగ్రత్త పడాలి.

టైగర్ ఓటమి నుంచి నేర్చు కుందాం…

శ్రీలంకలో జాతి పోరాటం చేస్తున్న ఎల్టీటీఈ ఇటీవల తుడిచి పెట్టుకుపోయిన ఉదంతాన్ని ఉటంకించిన మావోయిస్టు నాయకత్వం టైగర్ల ఓటమి నుంచి మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సివుందని పేర్కొంది. శత్రు బలగాల ఎత్తుగడల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను పసిగట్టడంలో టైగర్లు విఫలమయ్యార్లని, తమ బలాన్ని అతిగానూ, శత్రు బలాన్ని తక్కువగానూ అంచనా వేశారని చెబుతూ మనం ఈ పొరపాట్లు చేయకూడదని శ్రేణులకు వివరించింది. శత్రు బలగాల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర మిలిటరీ కమిషన్లను కోరింది.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)

Latest News