Friday, July 5, 2024

అబూజ్‌మాడ్ గోండులు- జీవితం.. పోరాటం..

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దాడి సన్నాహాలు, మావోయిస్టుల ప్రతిదాడుల నేపథ్యంలో అబూజ్‌మాడ్ కొండలు మరోసారి వార్త ల్లోకెక్కాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బసర్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ కొండలు మావోయిస్టులకు అడ్డాగా మారాయని, ఇక్కడి దట్టమైన అడవుల్లో శిక్షణ పొందుతూ బలగాలను సమీకరించుకుని పరిసర ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు నాయకత్వం కూడా ఇక్కడే ఆశ్రయం పొందుతూ దేశ వ్యాప్తంగా కార్యకలాపాలను సమన్వయిస్తోందని వారు చెబుతున్నారు. ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పిఎల్‌జీఏ) స్థాపన తర్వాత మాడ్ ప్రాంతాన్ని గెరిల్లా స్థావరంగా పార్టీ నాయకత్వం ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

పోలీసుల ఆరోపణలను మావోయిస్టులు పైకి ఒప్పుకోకపోయినా మాడ్ వారికి అత్యంత కీలకమైన ప్రాంతమని చెప్పక తప్పదు. ఇటీవల ఆ పార్టీ పొలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ లో ఈ విషయం స్పష్టంగానే ఉంది. అబూజ్‌మాడ్ పై జరగబోయే దాడిని తిప్పికొట్టాలని, ఒక వైపు శత్రు బలగాలను దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఆత్మరక్షణ ఎత్తుగడలను చేపట్టాలని, కొత్త ప్రాంతాలకు విస్తరించాలని ఆ పార్టీ నాయకత్వం శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాల కుట్ర నేపథ్యంలో ప్రాచీన గిరిజన తెగల్లో ఒకటైన అబూజ్‌మాడ్ గోండుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, వారి సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించడానికి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని సూచించింది.

అబూజ్‌మాడ్ కొండలు ఎక్కడున్నాయి?

ఇంతకీ ఈ అబూజ్‌మాడ్ కొండలు ఎక్కడున్నాయి? పత్రికలు రాసినట్లుగా సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ తన పనిని ఎందుకు చేయులేకపోయింది? ఈ కొండల్లో నివసించే ఆదివాసులు ఎవరు? వారి జీవనవిధానం, సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయి? మావోయిస్టులు ఇక్కడ పాగా ఎలా వేయగలిగారు? ఇత్యాది అంశాలన్నీ సహజంగానే మనలో ఆసక్తి రేపుతాయి.

తొమ్మిదేళ్ల కిందట కొత్తగా ఏర్పడిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ అతి ముఖ్యమైన ప్రాంతం. దట్టమైన అడవులతో పాటు పుష్కలంగా ఖనిజ వనరులున్న ఈ ప్రాంతం ఒకప్పుడు ఒకే జిల్లాగా ఉన్నా తర్వాతి కాలంలో ఐదు జిల్లాలుగా విభజింపబడింది. ఈ ఐదు జిల్లాల్లో ఒకటైన నారాయణ్‌పూర్‌తో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రాగఢ్ ప్రాంతంలో విస్తరించి వున్నాయి అబూ జ్‌మాడ్ కొండలు. ఉత్తరం నుంచి దక్షిణానికి సుమారు 80 కి.మీ., పడమటి నుంచి తూర్పునకు సుమారు 50 కి.మీ. మేరకు వ్యాపించిన మాడ్ కొండ ప్రాంతం విస్తీర్ణం నాలుగు వేల చదరపు కి.మీ.లు. జనాభా సుమారు ముప్పై వేలు.

రెండు జిల్లాల్లోకి విస్తరణ..

అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఇక్కడున్న చిన్నా పెద్ద పల్లె లు 237. ఇందులో 30 వరకు గడిచిరోలి జిల్లాలోనూ, మిగతావి నారాయణ్ పూర్ జిల్లాలోనూ భాగంగా ఉన్నాయి. గమనించాల్సిన విషయమేమిటంటే ఒకే ఒక ఇల్లున్న జనావాసం కూడా ఇక్కడ గ్రామం కిందికి వస్తుంది. ఎక్కువలో ఎక్కువ వంద ఇండ్లుంటే అది చాలా పెద్ద గ్రామమని భావిస్తారు. ఇలాంటి పెద్ద గ్రామాలు కూడా ఈ ప్రాంతంలో ఐదుకి మించి లేవు.

అబూజ్ మాడ్ కొండలపై నివసించే ఆదిమ తెగ పేరు మాడియా గోండులు. మాడియా లేదా మారియాలుగా వీరిని వ్యవహరిస్తారు. మర్రి అంటే గోండు భాషలో చెట్టు అని అర్థం. అనగా అడవుల్లోనే వీళ్లు నివసించేవారు కనుక వీరిని మారియా గోండులుగా పిలుపు నారంభించారని చరిత్రకారుల అభిప్రాయం. నిజం చెప్పాలంటే అటు బస్తర్‌లోనూ, ఇటు గడిచిరోలి జిల్లాలోనూ విస్త రించిన మాడియా గోండులందరి మూలనివాసం అబూజ్ మాడ్ కొండలే నని తెలుస్తోంది. కాలక్రమంలో కొన్ని కుటుంబాలు కొండలు దిగివచ్చి మైదాన అటవీ ప్రాంతాల్లో స్థిర పడ్డాయని చరిత్ర కారులు పేర్కొంటున్నారు.

మార్కెట్ కు దూరంగా..

మాడ్ గిరిజనుల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు విభిన్నమైనవి. వైవిధ్యంతో కూడుకున్నవి. ప్రకృతితో విడ దీయరాని సంబంధం కలిగినట్టివి. పోడు వ్యవసాయం, జంతువుల, చేపల పేట, ఆకులు అలములు, పండ్లు ఫలాల సేకరణ వీరి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం. ఇటీవలికాలం వరకూ వీళ్లు కేవలం ఉప్పు, బాణాలకు ఉపయోగించే ఇనుప భాగాలు, బట్టల కోసం మాత్రమే గుట్టలు దిగి నారాయణపూర్ లేదా సోన్‌పూర్ అంగళ్లకు వెళ్లేవారు. కొండ వాలులో చెట్లను నరికి, తగులబెట్టి వానలు పడగానే కోహ్‌లా అనే ధాన్యపు గింజలను (మన వరిపొలాల్లో పెరిగే ఒడిపిలిలా ఉంటుంది) చల్లుతారు. అటుపైన ఎలాంటి మానవ శ్రమ అవసరం లేకుండానే చేతికి వచ్చిన పంటను దంచి అన్నంలో పండుకుంటారు.

దున్నడం తెలియదు..

నాగలి, దున్నడం వీరికసలు తెలియదు. కూరగా పచ్చి లేదా ఎండిన మాంసం, చేపలు, అడవిలో విచ్చలవిడిగా దొరికే గోంగూర, బొప్పాయి, ఇతర ఆకుకూరలను పండుకుంటారు. నూనె వాడకం అసలు ఉండదు. (కొందరు మాత్రం చేదుగా ఉండే ఇప్పనూనెను వాడతారు) మాడ్ వాసుల నివాసాలు ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ సమీపంలోనే అన్ని కాలాల్లో ప్రవహించే చిన్న చిన్న సెలయేళ్లు ఉంటాయి కనుక నీటికి సమస్య ఉండదు. అడవిలో దొరికే వెదురు బొంగు, ఇతర కలపతో మాడియాలు ఇళ్లు నిర్మించుకుంటారు. పై కప్పుగా నదీతీరాల్లో పెరిగే ఒకరకం గడ్డిని వినియోగిస్తారు. ఇళ్లు సాధార ణంగా చిన్నవిగా ఉండి ఒకే జంట నివసించడానికి వీలుగా ఉంటాయి.

పెళ్లయిన ప్రతి జంటకూ ముందుగా ఓ గుడిసె నిర్మించి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. పెళ్లి కాని యువతీ యువకులు నిద్రించడానికి ఉద్దేశించిన గోటుల్ ఈ తెగలోని మరో ప్రత్యేకత. ప్రతి పల్లెలోనూ ఓ గోటుల్ (నిద్రాశాల) ఉంటుంది. పాలు మరిచిన పిల్లల నుంచి మొదలుకొని యుక్త వయసు అమ్మాయిలు, అబ్బాయిల వరకు ఈ గోటుల్లో సభ్యులుగా ఉంటారు. సభ్యుల్లో సీనియర్ గోటుల్ కు పెద్దగా వ్యవహరిస్తూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాడు. విష యాలను జూనియర్లకు అర్ధం చేయిస్తూ వుంటాడు. పగలంతా తల్లి దండ్రులతో పాటు ఉండే పిల్లలు సాయం సమయం కాగానే గోటుల్ వద్దకు చేరతారు. ఆటపాటల్లో నిమగ్నమవుతారు. గానా బజానాతో డ్యాన్సులు మొద లవుతాయి. చివరకు అలసిపోయి ఏ రాత్రికో నిద్రిస్తారు.

లైంగిక సంబంధాలు నిషిద్ధం కాదు..

ఈ ఆట పాటల క్రమంలో యువతీ యువకుల మధ్య ప్రేమ ఏర్పడడం, సన్నిహితం కావడం సహజంగానే జరుగుతుంది. అలా ఇష్టపడ్డవారి మధ్య లైంగిక సంబంధాలు వీరి సమాజంలో నిషిద్ధం కాదు. తర్వాతి కాలంలో ఇలాంటి జంటలు పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతాయి. పెళ్లయిన మరుక్షణం వీరు గోటుల్ సభ్యత్వం కోల్పోతారు. గుట్టల కింద నివసిస్తున్న మాడియా గోండుల్లోనూ గోటుల్ పద్ధతి ఉన్నా, రాత్రి పూట అక్కడ ఆటపాటల తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లి నిద్రించడంగా పరి ణామం చెందింది.

మాడ్ వాసుల వస్త్రధారణ విషయానికి వస్తే, పురుషులు లంగోటా లేదా బుడ్డగోచి పెట్టుకుంటారు. మహిళలు మాత్రం ముతక వస్త్రాన్ని నడుముకు చుట్టుకుంటారు. సాధారణంగా ఏ వయస్సు వారైనా పైన ఛాతిని కప్పుకోవడానికి ఎలాంటి దుస్తులను ఉపయోగించరు. అయితే, బయటివారు తటస్థించి నప్పుడు మాత్రం పైన గుడ్డ కప్పుకుంటారు. మొత్తంగా చూస్తే, అబూజ్ మాడ్ వాసుల జీవనం దినదినం ప్రకృతితో పోరాటమయమని చెప్పవచ్చు. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ, ప్రాథమిక సౌకర్యాల లోపంతో ఏ చిన్న రోగం వచ్చినా మరణమే శరణ్యమవుతుంది. ఆస్పత్రులు లేవు. స్కూళ్లు లేవు. రోడ్లు లేవు. వాహనాలు లేవు. అన్నింటి కంటే ముఖ్యంగా మార్కెట్ లేదు. దోపిడీ లేదు. స్థానిక వనరులపై కన్నేసిన పరాయిలు లేరు..

ఇక్కడి వనరులపై అందరి కన్ను..

అయితే, స్వాతంత్య్రానంతర కాలంలో పాలకుల కన్ను అబూజ్ మాడ్ వనరులపై పడింది. అభివృద్ధి పేరిట పరిసర ప్రాంతాల్లో ఇనుప గనుల తవ్వకం మొదలైంది. వెదురు, టేకు తదితర అటవీ సంపద కోసం ఫారెస్టు విభాగం సిబ్బంది రావడం సాధారణమైంది. అప్పుడప్పుడు భారీ సంఖ్యలో రావడం, గిరిజనులు సేకరించుకున్న ఇప్పపువ్వు తదితర అటవీ ఉత్పత్తులను లాక్కెళ్లడం కొనసాగింది. మరోవైపు, మాడియాల బతుకు చిత్రంలో మాత్రం మార్పు రాలేదు.

కాగా, 1984–85 ప్రాంతంలో అబూజ్ మాడ్ కొండల పైకి మావోయిస్టులు (అప్పటి పీపుల్స వార్ నక్సలైట్లు) అడుగు పెట్టారు. అప్పటివరకు ప్రకృతితో పోరాడుతున్న మాడ్ వాసులతో చెలిమి చేశారు. వారితో ఆడారు. పాడారు. వారి జీవితంలో భాగంగా మారిపోయారు. ఆదివాసుల జీవితాలను మార్చడం కోసమే తాము వచ్చామని ఆచరణలో నిరూపించయత్నించారు. మహిళలు ధరించడం కోసం బ్లౌజులు పంపిణీ చేయడం నుంచి మొదలుకొని దున్నడం ఇలా ఉంటుందని చూపించడం వరకు అన్నీ నేర్పించడానికి పాటుపడ్డారు.

తామే స్వయంగా కూరగాయల మొక్కలు పెంచారు. పొలాలు సాగు చేశారు. పిల్లలకు, పెద్దలకు చదువు నేర్పించడానికి ఊరూరా స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నాలన్నీ విజయవంతమయ్యాయని చెప్పలేం కాని ఈ క్రమంలో నక్సలైట్లు మాత్రం స్థానికుల పాలిట దేవుళ్లయ్యారు. వారికోసం ఏదైనా చేయడానికి మాడియా గోండులు సంసిద్ధులయ్యారు. తమ పిల్లలను సాయుధ దళాల్లోకి పంపించడం మొదలు పెట్టారు.

మావోయిస్టులకు స్థావరంగా..

ఈ పరిస్థితిని, స్థానిక క్లిష్టమైన టెర్రయిన్ను అనుకూలంగా భావించిన మావోయిస్టులు క్రమంగా అబూజ్ మాడ్‌ను తమ స్థావరంగా మార్చుకున్నారు. పోలీసువర్గాలు ఆరోపించిన విధంగా శిక్షణ, విశ్రాంతి, సమీకరణ తదితర కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారు. కొండల పైకి పోలీసు బలగాలు ఎప్పుడు వెళ్లడానికి ప్రయత్నించినా మాటుగాచి మట్టుబెట్టారు. అభివృద్ధి పేరిట కొండల పైన ప్రభుత్వం పాఠశాలల, ఆస్ప త్రుల నిర్మాణాన్ని వ్యతిరేకించారు. వ్యవసాయ శిక్షణ పేరిట స్థానిక ఆదివాసీ యువకులను నారాయణ్ పూర్ తీసుకెళ్లడాన్ని అడ్డుకున్నారు. కొండల్లో ఏ పరాయివ్యక్తి తటస్థపడినా పోలీసు ఇన్ఫార్మర్గా భావించి శిక్షించారు.

ఫలితంగా ప్రభుత్వానికీ మావోయిస్టులకూ మధ్య ఘర్షణ తీవ్రమై ప్రస్తుత స్థాయికి చేరింది. అటు సర్కారు వ్యూహాలు, ఇటు మావోయిస్టుల ప్రతి వ్యూహాల మధ్య మాడ్ గోండుల ఉనికి ప్రశ్నార్థకమైంది. నక్సల్స్ ను అబూజ్ మాడ్ కొండల నుంచి తరిమివేయడానికి స్థానిక గిరిజనులను గ్రామాల నుంచి ఖాళీ చేయించి బయట మైదాన ప్రాంతాల్లో ఏర్పరచిన పునరావాస శిబి రాల్లో ఉంచడానికి ప్రయత్నించడం ద్వారా ప్రాచీన తెగల్లో ఒక టైన మాడియా గోండుల సంస్కృతి సంప్రదాయాలను కాలరాయడానికి ప్రభుత్వం పూనుకుంటోంది. తమ వ్యూహాత్మక అవసరాల కోసం మాడ్ కొండలను స్థావరంగా మార్చుకున్న మావోయిస్టులు కూడా మరోరకంగా మాడ్ వాసుల ఉనికికి భంగం వాటిల్లజేస్తున్నారని చెప్పకతప్పదు. ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరాటంలో చివరకు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.

– డి. మార్కండేయ

(ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News