Monday, July 8, 2024

అబూజ్‌మాడ్‌పై త్వరలో సైనిక దాడి..?

(డి మార్కండేయ)

మావోయిస్టులు గెరిల్లా స్థావరంగా ప్రకటించుకున్న అబూజ్మడ్ ప్రాంతంపై త్వరలో భారీ ఎత్తున సైనిక దాడి జరగనుందని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న కేంద్ర బలగాలకు తోడు మరిన్ని బలగాలను పంపించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు యూపీఏ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటివరకూ ఎలాంటి సర్వే జరగని ఈ అబూజ్మడ్ కొండల ప్రాంతాన్ని యుద్ధప్రాతిపదికన శాటిలైట్ల సహాయంతో ఫొటోలు తీసి, టోపోగ్రాఫికల్ మ్యాపులు తయారుచేసే పనిలో ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్టీఆర్ఓ) నిమగ్నమై ఉన్నాయని కేంద్ర హోంశాఖ వర్గాల భోగట్టా. ఈ ఆపరేషన్ మూలంగా తిరోగమించే మావోయిస్టు గెరిల్లా బలగాలను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా సరిహద్దుల్లో బలగాలను మోహరించేందుకు కూడా రంగం సిద్ధ మైందని సమాచారం.

మరోవైపు, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పొలిట్‌బ్యూరో పొంచివున్న పెను ప్రమాదాన్ని ముందే పసిగట్టింది. జూలైలోనే ఈ దాడి మొదలు కావచ్చని అంచనా వేసింది. జూన్ 12న విడుదల చేసిన సర్క్యులర్లో సాధారణ ఎన్నికల అనంతర పరిస్థితిని అంచనావేస్తూ అబూజ్మడ్ ప్రాంతంపై త్వరలోనే కేంద్ర, రాష్ట్ర బలగాలు విరుచుకు పడనున్నాయని హెచ్చరించింది. అమెరికా కనుసన్నల్లో మన్మోహన్-రమణ్ సింగ్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆఫెన్సివ్ నుంచి శ్రేణులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.

మావోయిస్టు హెడ్ క్వార్టర్స్ అబూజ్‌మాడ్..

మహారాష్ట్ర- ఛత్తీస్గఢ్ సరిహద్దులో సుమారు నాలుగు వేల చ. కి.మీ. సరిధిలో విస్తరించివున్న అబూజ్మడ్ (అబూజ్మడ్ అంటే ఎవరికీ తెలియని ప్రాంతం అని అర్థం) దట్టమైన అడవులతో కూడిన కొండ ప్రాంతం. మాడియా గోండులు నివసించే ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకూ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయలేదని చెబుతుంటారు. 1985లోనే నక్సలైట్లు ఈ ప్రాంతంలోకి ప్రవేశించినా ఇటీవలికాలంలో మాడ్ కొండల్లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ మావోయిస్టుల కార్యకలాపాలు అధికమయ్యాయి. ఈ ప్రాం తాన్ని హెడ్ క్వార్టర్స్ గా ఉపయోగించుకుంటూ వారు బస్తర్లోని దంతేవాడ, బీజాపూర్, నారాయణ పూర్, కాంకేర్ జిల్లాల్లోనూ, మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలోనూ చెలరేగిపోతున్నారని పోలీసు వర్గాల ఆరోపణ.

ఈ ప్రాంతం వెనుకబాటును, ప్రజల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మావోయిస్టులు ఇక్కడ తిష్ట వేశారని, నాయకత్వానికి షెల్టర్ జోన్‌గా, కేడర్‌కు శిక్షణ కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మాడ్ ప్రాంతం మొత్తం మావోయిస్టు పార్టీకే ప్రధాన సైనిక, రాజకీయ కేంద్రంగా మారిందని, ఇక్కడి నుంచి మావోయిస్టులను తరిమేస్తే ఆంధ్ర, దండకారణ్యం, ఏఓబి, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో నక్సల్ దళాలను సులభంగా నిర్మూలించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేంద్ర పారామిలిటరీ బలగాల ఆధ్వర్యంలో అబూజ్మడ్‌పై దాడికి రంగం సిద్ధమైంది.

ముందే పసిగట్టిన మావోయిస్టు పొలిట్ బ్యూరో…

సాధారణ ఎన్నికల తదనంతర పరిస్థితులను చర్చించడానికి జూన్ మొద టివారంలో మావో యిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమైంది. పెరిగిన సీట్ల బలంతో రెండవసారి అధికారంలోకి వచ్చిన మన్మోహన్ సర్కారు విప్లవోద్యమంపై మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున విరుచుకు పడనున్నదని అంచనా వేసింది. ఉగ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టి ఆర్థిక వ్యవస్థను దారిన పెట్టడమే తన ప్రభుత్వ ప్రాధాన్యాంశాలని ప్రధాని ప్రకటించడం, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హోం మంత్రి హెచ్చరించడం ఈ విషయాన్ని రుజువుచేస్తున్నదని పేర్కొంది. కనుక, కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే ఫాసిస్టు దాడిని ప్రతిఘటించడానికి పార్టీ శ్రేణులు, పిఎల్జీఏ గెరిల్లాలు, స్థానిక మిలీషియా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.

పెట్టుబడిదారుల కుట్ర..

ఈ సందర్భంగా అబూజ్మాడ్ గెరిల్లా ప్రాంతం (గెరిల్లా బేస్) పై జరగబోయే దాడిని గురించి సమావేశం ప్రత్యేకించి ప్రస్తావించింది. మాడ్ పై దాడి వెనుక అమెరికా సామ్రాజ్యవాదుల, టాటా, జిందాల్, మిట్టాల్, ఎస్సార్ తదితర పెట్టుబడిదారుల కుట్ర దాగివుందని పొలిట్‌బ్యూరో ఆరోపించింది. ఖనిజసంపదకు నిలయమైన బస్తర్ ప్రాంతాన్ని, మాడ్ కొండలను వీరికి కట్టబెట్టడానికే మన్మోహన్-రమణ్ సింగ్‌ల కూటమి పోలీసు చర్యకు ఉపక్రమించిందని పేర్కొంది. మావోయిస్టు కార్యకలాపాలకు మాడ్ కేంద్రంగా మారిందన్నది కేవలం సాకు మాత్రమేనని తెలిపింది. మాడ్‌పై భారీ ఆక్రమణకు కేంద్ర హోం శాఖ సవివరమైన ప్లాను సిద్ధం చేసిందని, కేంద్ర బలగాలను, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బలగాలను సమన్వయించడానికి గానూ సీనియర్ అధికారిని నియమించారని వివరించింది.

గవర్నర్ కీలకపాత్ర..

గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేసి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఈ ఆపరేషన్లో కీలకపాత్ర వహిస్తున్నారని ఆరోపించింది. సమావేశం జరుగుతున్న సమయంలోనే సైనిక చర్య విషయమై ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరిగాయని తెలిపింది. సుమారు 55 బెటాలియన్ల సీఆర్పీ తదితర కేంద్ర బలగాలు అవసరమవుతాయని ప్రతిపాదించారని పొలిట్ బ్యూరో వివరించింది. అబూజ్మాడ్ కొండలను శాటిలైట్ల సహాయంతో ఫొటోలు తీయించి, ఫీల్డులో బలగాలకు ఉపయోగపడే విధంగా టోపోమ్యాపులను ఇస్రోతో తయారుచేయిస్తున్నారని తెలిపింది.

గెరిల్లాలు తప్పించుకుపోకుండా నిరోధించేందుకు ఇప్పటి నుంచే ఛత్తీస్గడ్‌కు ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేస్తున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి మరోనెల పట్టవచ్చునని, బలగాల రవాణా, మోహరింపు తదితర అంశాలను లెక్కలోకి తీసుకుంటే దాడి బహుశా జూలై మూడవ లేదా నాలుగవ వారంలో జరగవచ్చునని హెచ్చరించింది.

(ఆంధ్యజ్యోతి సౌజన్యంతో..)

Latest News