Monday, July 8, 2024

అబూజ్‌మాడ్‌పై దాడి-2: సైన్యాన్ని దించుతారా..?

(డి మార్కండేయ)

దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో దుర్భేద్యమైన బెర్రయిన్‌ను కలిగివున్న అబూజ్మడ్ ప్రాంతంపై దాడి చేయడమంటే మాటలు కాదు. ఏ దారి ఎటు వెళుతుందో, ఏ పల్లె ఎక్కడుందో, ఎక్కడ ఏ వాగు అడ్డం తగులుతుందో, ఏ వ్యక్తి ఏ ఊరికి చెందినవాడో, ఏ మూలన ఏ ప్రమాదం పొంచివుందో స్థానిక ఆదివాసులకు తప్ప బయటి వారికి అసలే తెలియని ప్రాంతమిది.. ఎక్కడికి చేరాలన్నా కాలినడక తప్ప మరో మార్గం లేదు. సముద్రమట్టానికి సుమారు 2వేల అడుగులు, పరిసర ప్రాంతాలతో పోల్చితే వేయి నుంచి 15 వందల అడుగుల ఎత్తు పైన గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని సర్వే చేయడమూ ఇప్పటివరకూ జరగలేదు. ఇలాంటి చోట కేవలం శాటిలైట్ మ్యాపుల సహాయంతో, కొద్దిమంది ఇన్ఫార్మర్లతో మిలిటరీ ఆపరేషన్ నిర్వహించడం అంత సులభం కాదు.

మరోవైపు, మావోయిస్టు గెరిల్లాలకు ఈ ప్రాంతం కొట్టిన పిండి. పాతికేళ్ల నుంచీ కార్యకలాపాలు సాగిస్తున్న రీత్యా వారి నాయకత్వానికి, కేడర్కు ఇక్కడ తెలియంది లేదు. ప్రతి పల్లెతో, ప్రతి ఇల్లుతో, అడవిలోని ప్రతి చోటుతో వారికి అనుబంధం ఉంది. స్థానికులతో సత్సంబంధాలుండడం వారికి అనుకూలించే మరో అంశం. ఈ పరిస్థితుల్లో మాడ్ ఆక్రమణకు పూనుకోవడమంటే సింహం నోట్లో తలదూర్చడమే అవుతుందన్నది నిర్వివాదాంశం.

తొలివిడత సీఆర్పీఎఫ్ బలగాలతో..

అయితే, సరిగ్గా ఇవే విషయాలను మిలిటరీ రంగ నిపుణులు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా గుర్తించారని విశ్వసనీయంగా తెలిసింది. అందుకు తగ్గట్లుగానే కేంద్ర హోం శాఖ అబూజ్మడ్ పై దాడి చేయడానికి ప్లాను రూపొందించిందని సమాచారం. మొదట్లో భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలను దింపి రాష్ట్ర పోలీసు బలగాల సహాయంతో తొలి విడత ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మలివిడత ఆపరేషన్లో అవసరమైతే సైన్యాన్ని రంగప్రవేశం చేయించి లక్ష్యం సాధించాలని, మొత్తానికి బస్తర్ అడవులనుంచి మావోయిస్టులను తరిమివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు మావోయిస్టు పార్టీ సర్క్యులర్ ప్రకారం చూసినా, ఇటు ఇంటెలిజెన్స్ నిపుణుల అభిప్రాయం తీసుకున్నా దాడికి సంబంధించిన బ్లూప్రింట్ ఇలా ఉంటుందని అంచనా.

  • సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ బలగాలు సంయుక్తంగా మాడ్ ప్రాంతంపై ఆపరేషన్లు ప్రారంభిసాయి. మ్యాపులు, గైడ్ల సహాయంతో అడవుల్లోకి, గిరిజన పల్లెలోకి ప్రవేశిస్తారు. మావోయిస్టుల ప్రతిఘటనను సైనికంగా ఎదుర్కొంటారు. హెలికాప్టర్లను ఉపయోగించుకుని గెరిల్లాల కదలికలను అదుపు చేస్తారు. వారిని ఆత్మరక్షణలో పడవేస్తారు. తమ వద్ద హెలికాప్టర్లను కూల్చే శక్తి కలిగిన ఎల్ఎంజీ, రాకెట్ లాంఛర్ వంటి ఆయుధాలున్నాయని గతంలో మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో గెరిల్లాల ప్రతిఘటనను బట్టి సీఆర్పీ బలగాలు కూడా ఈ దశలో భారీ ఆయుధాలను వినియోగిస్తాయి.
  • ఆదివాసీ ప్రజానీకాన్ని గ్రామాల నుంచి ఖాళీ చేయించి గుట్టల కింద, అడవి బయట ఏర్పాటు చేసే ప్రభుత్వ పునరావాస శిబిరాల్లో ఉంచుతారు. (సల్వాజుడుం ఆధ్వర్యంలో ఇప్పటికే దంతేవాడ, బీజాపూర్ జిల్లాలో ఇలాంటి పునరావాస క్యాంపులనేకం నడుస్తున్నాయి. ఒక్కో క్యాంపులో 3-5వేల మంది ప్రజలు నివసిస్తున్నారు.) ఇందుకు ఆదివాసీ నేత మహేంద్ర కర్మతో సహా సల్వాజుడుం కార్యకర్తల, ఎస్పీవోల సేవలను వినియోగించుకుంటారు. ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా, పునరావాస శిబిరాలకు తరలిరావాల్సిందిగా స్థానిక మాడియా గోండులకు పిలుపుని స్తారు. మొత్తం అబూజ్మాడ్ ప్రాంతమంతా (నాలుగువేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో) కలిసి ముఫ్పైవేలకు మించిన జనాభా ఉండదు కనుక ఇది ఆచరణ సాధ్యమేనని పోలీసు వర్గాల భావన.
  • అటు తర్వాత అడవుల్లో అణువణువూ గాలిస్తారు. మావోయిస్టు స్థావ రాలను, శిక్షణ శిబిరాలను ధ్వంసం చేస్తారు. ఈ దశలో అవసరమైన పక్షంలో ఇలాంటి టెర్రయిన్‌లో చర్యలు నిర్వహించే అనుభవమున్న సైనిక బలగాల సహాయాన్ని తీసుకుంటారు.
  • తర్వాతి దశలో ఆపరేషన్‌ను అబూజ్మడ్ మూడు వైపులా విస్తరించి వున్ననక్సల్ ప్రభావిత ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో కేంద్ర హోం శాఖ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)

Latest News