Wednesday, July 3, 2024

అన్నల రాజ్యం-6: మావోయిస్టు ప్రాంతాలపై త్వరలో భారీ దాడి?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ)

బస్తర్‌లో రాజ్యమేలుతున్న జనతన సర్కార్లను, మావోయిస్టు గెరిల్లాల ప్రాబల్యాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచ్చలవిడిగా హింసకు పాల్పడడం, హెలికాఫ్టర్లపై సైతం తెగబడడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తే తప్ప దేశాభివృద్ధి సాధ్యం కాదని, మధ్యభారతంలో వివిధ బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలు అమలు చేయడం కుదరదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదేపదే ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. దండకారణ్యం, ఆంధ్రా-ఒరిస్సా, జార్ఖండ్-బెంగాల్, జార్ఖండ్ – బీహార్ సరిహద్దు ప్రాంతాల నుంచి మావోయిస్టులను ఏరివేయడంపై దృష్టి కేంద్రీకరించింది.

ఈ ప్రాంతాల్లో మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదటి, రెండో దశలు అనుకున్న ఫలితాలను సాధించకపోవడంతో మరోమారు ఏం చేయాలో నిర్ణయించుకునే పనిలో పడింది. ఆర్మీ, పారామిలిటరీకి చెందిన ఉన్నతాధికారులతో పాటు నక్సల్ ప్రాబల్య రాష్ట్రాల డీజీపీలతో పలుమార్లు సమావేశమవుతోంది. వైఫల్యాలకు కారణాలను సమీక్షిస్తోంది. ఏది ఏమైనా వెనక్కి తగ్గకూడదని, మరిన్ని వనరులను కూడదీసుకుని ఈ వేసవిలో గ్రీన్ హంట్ మూడవ దశను ఆరంభించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఇందుకు అవసరమైన ప్లానులు, ఎత్తుగడలు ఇప్పటికే సిద్ధమయ్యాయని, మరిన్ని బలగాల మోహరింపు ప్రక్రియ కూడా కొనసాగుతోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈసారి విఫలమైన పక్షంలో 2014 వేసవి నాటికి ఆర్మీ ఆపరేషన్ చేపట్టాలనే అవగాహనకు కూడా కేంద్ర కేబినెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అబూజ్మడ్ కొండల వద్ద ఇప్పటికే సైనిక శిక్షణ కేంద్రం పేరిట స్థావరాన్ని నెలకొల్పి బ్రిగేడ్ స్థాయిలో బలగాలను ఉంచడం, ఆర్మీ చీఫ్ సహా పలువురు సైన్యాధికారులు బస్తర్ పర్యటించి వెళ్లడం, జగ్గల్పూర్ లో ఆర్మీ సబీరియా హెడ్ క్వార్టర్స్ (15 వేల జవాన్లు) నెలకొల్పడానికి నిర్ణయించడం ఈ ప్లానులో భాగమేనని కొందరు వాదిస్తున్నారు.

లక్ష్యం సాధించని గ్రీన్‌హంట్ మొదటి దశ:

అధికారులతో పాటు కేబినెట్ సమ్మతించకపోవడంతో సుమారు 55 బెటాలియన్ల పారామిలిటరీ దళాలను దించి, వారికి దన్నుగా వాయుసేన హెలికాప్టర్లను మాత్రం మోహరించారు. ఒక్క బస్తర్లోనే 20వేల పారామిలిటరీ, మరో 20 వేల స్థానిక బలగాలను సమీకరించారు. అయితే, బలగాల వ్యూహాన్ని ముందే పసిగట్టిన మావోయిస్టులు భారీ ప్రతిఘటనకు పూనుకున్నారు. అనేక దాడుల్లో డజన్ల కొలదీ ప్రభుత్వ బలగాలను అంతమొందించారు. తాడిమెట్ల దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన ఒక కంపెనీని పూర్తిగా నిర్మూలించగలిగారు.

తమ వద్ద ఉన్న ఎల్ఎంజీలు, రైఫిళ్ల సాయంతోనే హెలికాప్టర్లపైనా కాల్పులు జరిపి శత్రువుకు నష్టం కలిగిస్తున్నారు. స్థానికంగా సమాచారమిచ్చే ఇన్ఫార్మర్ల వ్యవస్థ లేకపోవడం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సల్వాజుడుం బలగాలను రద్దు చేసి కోయ కమాండోలుగా మార్చడం, స్థానికుల మద్దతు మావోయిస్టులకే ఉండడం తదితర కారణాల మూలంగా ప్రభుత్వ బలగాలు చొరవ కోల్పోయి గ్రీన్హంట్ మొదటి దశ నీరుగారిపోయింది.

కొనసాగుతున్న రెండవ దశ:

మొదటి దశ వైఫల్యాలను చర్చించి సమీక్షించిన కేంద్ర హోంశాఖ 2011 చివరలో గ్రీన్ హంట్ రెండవ దశను ప్రారంభించింది. ఇందులో భాగంగా మరిన్ని పారామిలిటరీ బలగాలను కేంద్రీకరించి పోలీసు క్యాంపుల సంఖ్యను రాసిలోనూ వాసిలోనూ బాగా పెంచారు. బస్తర్లోని దంతేవాడ, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల్లోని అన్ని క్యాంపులను బలోపేతం చేశారు. జగ్దల్పూర్ కేంద్రంగా మానవరహిత విమానాల, హెలికాప్టర్ల సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. వేయికి మించిన బలగాలతో లోతట్టు ప్రాంతాలకు చొచ్చుకెళ్లి ఉద్యమకారుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్లను చేపట్టి అబూజ్మాడ్ కొండల పైకి వెళ్లగలిగారు. దక్షిణ, పశ్చిమ, తూర్పు బస్తర్లలో సైతం అనేక పోలీసు అభియాన్లను నిర్వహించారు. 19 మంది ఆదివాసులు ప్రాణాలు కోల్పోయిన సర్కిన్ూడ ఘటన ఈ దాడుల్లో భాగంగానే జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది జనతన సర్కారు సభ్యులను, మావోయిస్టు మిలిటెంట్లను అరెస్టు చేశారు.

గ్రామాలను ఖాళీ చేయించడమే లక్ష్యం..

వివిధ రకాల చర్యల ద్వారా ఆదివాసీలను గ్రామాల నుంచి ఖాళీ చేయించడం ప్రస్తుత రెండవ దశలో జరుగుతోందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఊళ్ల పైబడి ఇళ్లను తగులబెట్టడం, ఆస్తుల విధ్వంసం, మావోయిస్టు మద్దతుదారుల వేధింపులు, మోర్టార్లతో బాంబులు వేయడం లాంటివన్నీ ఈ ఎత్తుగడల్లో భాగమేనని వారంటున్నారు. ఏదో రకంగా గ్రామాల నుంచి ఆదివాసులను పెద్ద గ్రామాలు, పట్టణాల్లోని ప్రత్యేక శిబిరాలకు తరలించగలిగితే మావోయిస్టుల పనిపట్టడం చాలా సులువని ప్రభుత్వ బలగాలు భావిస్తున్నాయని వారు చెబుతున్నారు.

మా పర్యటనలో మేము గమనించిన విషయాలు కూడా ఈ వాదననే బలపరుస్తున్నాయి. మమ్మల్ని అడవిలో ఉండకుండా చేస్తున్నారని ఆదివాసీలు వాపోయారు. మాతో మాట్లాడిన ఓ మావోయిస్టు నేత సైతం ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆదివాసులను టెర్రరైజ్ చేయడం, టెర్రయిన్ పరిశీలన, స్థానికంగా ఇన్ఫార్లర్ల నెట్వర్క్ ను పెంచుకోవడం ఈ దాడుల లక్ష్యాలని చెప్పారు.

ఈ ఎండాకాలం కీలకం:

మార్చి నుంచి చెట్ల ఆకులు రాలి అడవి పలచబడుతుంది కనుక ఈ ఎండాకాలం అటు ప్రభుత్వ బలగాలకు, ఇటు మావోయిస్టులకు చాలా కీలకం కాబోతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క బస్తర్ లోనే లక్షకు మించిన పారామిలిటరీ బలగాలను దించి, స్థానిక బలగాలను కూడా కలుపుకుంటే శిక్షణలోనూ, ఆయుధసంపత్తిలోనూ, సరఫరాల్లోనూ ప్రత్యర్థి కంటే ఎంతో వెనకబడివున్న మావోయిస్టులకు కష్టకాలమేనని వారు పేర్కొంటున్నారు. ఎక్కడంటే అక్కడ నీళ్లు అందుబాటులో లేకపోవడం మావోయిస్టులకు ప్రమాదకరంగా పరిణమించనుందని, వారిని నిలబెట్టి ఏకైక అంశం ప్రజల మద్దతేనని వివరిస్తున్నారు.

(మార్స్ 4, 2013) నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Latest News