Wednesday, July 3, 2024

ఎన్నికల తర్వాతే మావోయిస్టులతో అమీ తుమీ!

( డి మార్కండేయ)

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతల హత్య నేపథ్యంలో ప్రతీకారం కోసం ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నప్పటికీ మావోయిస్టులపై వెంటనే భారీగా తెగబడడానికి యూపీఏ సర్కారు వెనుకడుగు వేస్తు న్నది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే సైన్యాన్ని సైతం దింపి వారి భరతం పట్టాలని నిర్ణయించింది. అప్పటికి ఎండాకాలం వస్తుందని, అదే అనువైన సమయమని, ఈ లోపు యుద్ధసన్నాహాలు పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆజ్ఞలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాత ఎత్తుగడలనే కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు సూచించింది. మావోయిస్టు ప్రాంతాల్లో యథాప్రకారం కూంబింగులు నిర్వహించాలని, డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుని ప్రత్యేక బలగాల సాయంతో గెరిల్లా తరహా దాడులను ఉధృతం చేయాలని, ఎన్నికల సమయం కనుక నేతల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని బలగాలను ఆదేశించింది.

 

పీసీసీ అధ్యక్షుడు, మాజీ ప్రతిపక్ష నాయకుడు సహా పలువురు పార్టీ నేతలను మావోయిస్టులు పొట్టనబెట్టుకున్న తర్వాత ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ శ్రేణులు హతాశులైన విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. పడిపోయిన తమ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని నిలబెట్టడానికి సైన్యాన్ని దించి లేదా మరిన్ని పారామిలిటరీ బలగాలను మోహరించి మావోయిస్టుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను విముక్తం చేసే దిశగా యూపీఏ అగ్రనాయకత్వం మొదట ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే, మరో ఐదారు నెలల్లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనుండడం, ఆ వెంటనే 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు రానుండడం వారిని వెనుకడుగు వేసేలా చేసిందని విశ్వసనీయవర్గాల సమాచారం. భారీస్థాయిలో చర్యలకు దిగితే మావోయిస్టులతో పాటు వందల సంఖ్యలో సాధారణ ఆదివాసీ ప్రజలు సైతం బలి కాక తప్పదని, అలాంటి పరిస్థితుల్లో జరిగే ఎన్నికలు యూపీఏకు నష్టదాయకమని, దేశవ్యాప్తంగా కోట్లాదిగా ఉన్న ఆదివాసీల ఓటుబ్యాంకు కాంగ్రెస్‌కు దూరమవుతుందని వారు భావించినట్లు తెలుస్తోంది.

 

ఈ పరిస్థితులు అంతిమంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే ఉపయోగపడతాయని, అలా కాకుండా ప్రస్తుత ఎత్తుగడలనే కొనసాగిస్తూ రమణ్‌సింగ్ ప్రభుత్వ వైఫల్యం మూలంగానే దర్బా మారణకాండ జరిగిందంటూ ప్రజల్లోకి వెళితే బీజేపీని దెబ్బతీయడంతో పాటు సానుభూతి పవనాల మూలంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్న అంచనాకు వారు వచ్చినట్లు చెబుతున్నారు. అలా అని మావోయిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే ఎండాకాలం వారి పని పట్టాలని సోనియా, మన్మోహన్లు కృతనిశ్చయంతో ఉన్నట్లు హోంశాఖ వర్గాల సమాచారం.

 

అందుకు ఏడాది సమయం ఉంది కనుక ఈ లోపు పూర్తిస్థాయి సైనికచర్యకు అవసరమైన అన్ని సన్నాహాలనూ యుద్ధప్రాతిపదికన కొనసాగించాలని ఆయా మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు తారుమారై యూపీఏకు బదులుగా ఒకవేళ ఎన్డీయే అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించక తప్పదని వారు భావించినట్లు సమాచారం.

 

జోరుగా యుద్ధసన్నాహాలు..

 

సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత మావోయిస్టు ఆధీనప్రాంతాల్లో భారీ సైనికచర్యను నిర్వహించడానికి ఇప్పటికే కేంద్రప్రభుత్వం దీర్ఘకాలిక సన్నాహాలను ఆరంభించింది. లక్ష వరకు పారామిలిటరీ బలగాలను, వాయుసేన హెలికాప్టర్లను, డ్రోన్లను రంగంలోకి దించినప్పటికీ మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో విఫలమవుతున్న నేపథ్యంలో గత సంవత్సరమే యూపీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఎండాకాలంలోనే సైన్యాన్ని దించుతారని జోరుగా ప్రచారం సాగినప్పటికీ చివరకు అలా జరగలేదు. అయితే సన్నాహాలను మాత్రం వేగంగానే కొనసాగిస్తున్నారు.

 

నక్సల్ ప్రాబల్యప్రాంతాలుగా గుర్తించిన 34 జిల్లాల్లో సుమారు 11వేల కి.మీ.ల మేర రోడ్లను నిర్మించడానికి రూ.16 వేల కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో 5,477 కి.మీ.ల రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మావోయిస్టుల ఆధీనంలో ఉన్న బస్తర్లోకి బలగాలు వెళ్లడానికి వీలుగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులపై వంతెనల నిర్మాణం కూడా జరుగుతున్నది. ఒక్క గోదావరి పైనే నాలుగు వంతెనలు నిర్మించడానికి నిధులు కేటాయించారు. వీటిలో కాళే శ్వరం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న వంతెన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కమ్యూనికేషన్స్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ ప్రాంతాల్లో రూ. 3వేల కోట్లతో 2200 సెల్ టవర్లను కూడా నిర్మించ తలపెట్టారు. ఈ సన్నాహాలన్నీ వచ్చే ఎండాకాలం నాటికి పూర్తవుతాయి కనుక వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టే ప్రభుత్వం పని సులువవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

 

‘ప్రత్యేక’ దాడులు తీవ్రతరం..

 

చెలరేగిపోతున్న మావోయిస్టు బలగాలను కట్టడి చేయడానికి ఏపీ గ్రేహౌండ్స్, మహారాష్ట్ర సీ-60 కమాండోలు, సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళాలను విస్తృ తంగా వినియోగించాలని మంగళవారం కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రాయ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, రాష్ట్ర డీజీపీ రాంనివాస్ హాజరైన ఈ సమావేశంలో మావోయిస్టుల నిర్మూలనకై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ఇంటెలిజెన్స్ ను మరింత బలోపేతం చేయాలని, సమాచారం అందినప్పుడు ప్రత్యేక బలగాలు వెళ్లి మెరుపు దాడులు చేయాలని, ఛత్తీస్‌గఢ్‌-ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా-మహారాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తతను పెంచాలని, కూంబింగులు నిర్వహించాలని ఆదేశించారు. గత సంవత్సరం అబూజ్ మాడ్లో నిర్వహించిన ఆపరేషన్ హాకా, విజయ్ తరహాలో మరిన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

 

అయితే, మావోయిస్టుల ప్రతిదాడుల్లో భారీగా నష్టపోకుండా ఆత్మరక్షణకు కూడా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ చర్యలకు తోడుగా డ్రోన్ (మానవరహిత విమానాలు)లను విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం జగ్దల్పూర్‌లో ఉన్న ఆరు డ్రోన్లతో పాటు హైదరాబాద్‌లోని డీఆర్డీఓ స్థావరంలో ఉన్న 12 డ్రోన్‌లను వెంటనే భిలాయికి గాని జగ్గల్పూర్‌కు గాని తరలించాలని వాయుసేనకు సూచించారు. జగ్గల్పూర్‌లో ఉన్న డ్రోన్‌లు దట్టమైన అడవుల్లో మావోయిస్టుల కదలికలను కనిపెట్టలేకపోవడం వల్లనే దర్బాఘాట్‌లో మావోయిస్టులు దాడిచేయగలిగారని, హైదరాబాద్ లో ఉన్న అత్యాధునిక మానవరహిత విమానాలను మోహరించగలిగితే వారి ఆటలు సాగవని హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

 

ప్రస్తుతం ఈ విమానాలు హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్నందున రేంజి పరిమితుల మూలంగా కేవలం సుక్మా పరిసరాల వరకే వచ్చి వెళ్లగలుగుతున్నాయని ఆయన వివరించారు. వాటిని కనుక జగ్దల్పూర్‌లో ఆయన వివరించారు. వాటిని కనుక జగ్దల్పూర్‌లో మోహరించగలిగితే ఫలితాలు అద్భుతంగా వుంటాయన్నారు.

 

ఎన్డీఏ వచ్చినా ఇదే విధానం..!

 

మావోయిస్టుల అణచివేత విషయంలో అనుసరించే విధానంపై యూపీఏకీ ఎన్డీఏకీ భిన్నాభిప్రాయం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడం ఖాయమని వారంటున్నారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలే ఇందుకు సాక్ష్యమని గుర్తు చేస్తున్నారు.

 

 

(డి మార్కండేయ)

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)

Latest News