Wednesday, July 3, 2024

పౌరుల ఇంటర్‌నెట్‌పై కన్నేసిన ప్రభుత్వం..

పౌరుల ఇంటర్ నెట్ కార్యకలాపాలపై సర్కారు కన్నుపడింది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే నెపంతో ఆది త్వరలో మెయిళ్లపై, బ్లాగులపై, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై, నెట్ ద్వారా జరిపే సంభాషణలపై అస్త్రం సంధించబోతోంది. ఈ మాధ్యమం ద్వారా వెళ్లే టెక్స్ట్ మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలను ఇకనుంచి నిఘా సంస్థలు కనిపెట్టి ఉంచుతాయి. నేత్ర పేరుతో అమలయ్యే ఈ ప్రాజెక్టును ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో, కేబినెట్ సెక్రెటేరియట్లు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఓకే చెప్పాయి. ఇటీవల వివిధ కేంద్రమంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగిన అత్యున్నత సమావేశం వచ్చే జనవరి నుంచి ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించింది.

టెలికాం, హోం, రక్షణ, పీఎంఓ సహా పలు శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో ఇందుకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేత్ర ద్వారా సేకరించిన సమాచారం దుర్వినియోగం కాకుండా, దేశపౌరుల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఉండేందుకు పలు చర్యలను సూచించారు. ఐటీకి, రా(రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) కు, కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ కు 300 జీబీ చొప్పున స్టోరేజీ స్పేసు, ఇతర సంస్థలకు మరో 100 జీబీల స్పేస్ ను కేటాయించారు. సమాచారాన్ని వడగట్టడానికి ఆవసరమయ్యే కీలక పదజాలాన్ని తయారుచేసే బాధ్యతను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అప్పగించారు.

ఏమిటీ నేత్ర ?

నేత్రగా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తి పేరు నెట్వర్క్ ట్రాఫిక్ ఎనాలిసిస్ భారతదేశంలో జరుగుతున్న ఇంటర్ నెట్ కార్యకలాపాలపై ఓ కన్ను వేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే డీఆర్ ఓ (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)కు చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబొటిక్స్ విభాగం రూపొందించింది. బెంగుళూరు కేంద్రంగా డాక్టర్ అతీతన్ నేతృత్వంలోని 40 మంది నిపుణుల బృందం మూడేళ్ల పాటు శ్రమించి నేత్రను తయారుచేసింది. ఎన్టీఆర్ ఓ (నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) కూడా విశ్వరూప్ పేరుతో ఇలాంటిదే మరో నిఘా వ్యవస్థను రూపొందించగా, గత సంవత్సరం ఈ రెండింటినీ రక్షణ శాఖ అధికారులు పరీక్షించి చూసి నేత్రకే ఓటేశారు.

ఎలా పనిచేస్తుంది?

నెటిజన్లు పంపే మెయిళ్లను, ట్వీట్లను, ఫేస్ బుక్ కామెంట్లను, స్టేటస్ అప్డేట్లను, బ్లాగుల్లో ఉండే సమాచారాన్ని, స్కైప్ వంటి పద్ధతుల్లో జరిపే సంభాషణలను నేత్ర నిలువ చేస్తుంది. అయితే నెట్ ట్రాఫిక్ ద్వారా వెళ్లే డాటా వేలాది టెరాబైట్లలోనే ఉంటుంది కనుక కొన్ని పదాల ఆధారంగా వడగడుతుంది. బాంబు, పేలుడు, ప్లాను, ఆక్రమణ, హత్య, దాడి, మావోయిస్టు, సామ్రాజ్యవాదం, జిహాద్ వంటి పదాలను ఈ వ్యవస్థలో డిఫాల్ట్ గా జతచేస్తారు. అవసరమైనప్పుడు అదనంగా కొత్తపదాలను ఈ వ్యవస్థలో చేర్చే సదుపాయం ఉంటుంది. ఉదహరణకి ఓ వ్యక్తి మెయిల్ ద్వారా మరో వ్యక్తికి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన మెయిల్ పంపుతున్నాడనుకుందాం. ఆ మెయిల్లో పై పదజాలంలోని ఏ ఒక్క పదం ఉన్నా మొత్తం సమాచారాన్ని రికార్డు చేస్తుంది. మెయిల్ ‘ఏ ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ నుంచి వచ్చిందో గుర్తిస్తుంది. ఈ ఐపీ నెంబర్ ఆధారంగా నిఘా సంస్థలు సంబంధిత వ్యక్తిని కనిపెట్టవచ్చు చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చు.

ఐసీఎమ్మెస్ లో భాగమా!.

28/11 ముంబై దాడుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం గత సంవత్సరం ఐసీఎమ్మెస్ (ఇండియన్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్) ఏర్పాటును ప్రకటించింది. వివిధ పరిశోధన సంస్థలకు ఫోన్లను, ఇంటర్నెట్ ను ట్యాప్ చేసే వ్యవస్థను రూపొందించే బాధ్యతను అప్పగించాయి. ఇందులో భాగంగానే డీఆర్డీఓ నేత్రను తయారుచేసింది. మొబైల్ ఫోన్ కాల్స్ ను నిరంతరం ట్యాప్ చేయడానికి సంబంధించిన పరిశోధనలు కూడా కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఈ లోపు నేత్ర అందుబాటులోకి వచ్చింది కనుక వెంటనే ఈ వ్యవస్థను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పరిమితులున్నాయి..

అమలు కష్టమే..

అయితే ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు నేత్ర ప్రాజెక్టును అమలు చేయగానే నెట్ ద్వారా జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం కష్టసాధ్యమేనని చెప్పవచ్చు. ఉదహరణకు నిఘా సంస్థలు రూపొందించే పదజాలం వాడకుండా జాగ్రత్తపడితే అలాంటి మెయిళ్లను, మెస్సేజ్ లను నేత్ర గుర్తించదు. అలా అని మొత్తం సమాచారంపై కన్నేసి ఉంచడం కూడా అసలే సాధ్యం కాదు ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా నిమిషానికి 840 టెర్రాబైట్ల డాటా (20 కోట్ల మెయిళ్లు, లక్ష ట్వీట్లు) ప్రసారమవుతుంది. అమెరికా, బ్రిటన్, చైనా, ఇరాన్ దేశాలు ఇప్పటికే ఇలాంటి నిఘా వ్యవస్థలను అమలుచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయాయి.

  •  డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)

Latest News