Monday, July 8, 2024

అన్నల రాజ్యం-4: ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లింది ఇలా..!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ)

మా ఛత్తీస్గఢ్ పర్యటన ఎంతో ఉద్వేగభరితంగా ఆరు రోజులు సాగింది. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనుల మధ్య ఇరుకు గదుల్లో ఫోన్లతో మాట్లాడుతూ టీవీలతో సావాసం చేస్తూ ఫేస్బుక్కుల్లో పలకరిస్తూ తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో రేపటి గురించిన ఆందోళనతో బతికే మాకు ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల జనతన సర్కారు చెక్పోస్టు దాటగానే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపించింది.

అక్కడ సమష్టి తత్వం సర్వవ్యాపితం. బతుకైనా, చావైనా, పండుగైనా, పోరాటమైనా అన్నీ కలిసే. లగ్జరీలు, సౌకర్యాలు తెలియవు. శతాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే కనీసావసరాలను సమకూర్చుకుంటున్నారు. పచ్చని అడవులు. స్వచ్ఛమైన సెలయేళ్లు.. వెచ్చని వాతావరణం. నిష్కల్మషమైన మనుషులు. అక్కడక్కడా తటస్థపడే నెమళ్లు.. కుందేళ్లు.. జింకలు.. నిజానికి మా ఎడిటర్ గారు నన్ను ఛత్తీస్గఢ్ వెళతావా అని అడిగినప్పుడు మొదట తటపటాయించాను. లక్షలాది ప్రభుత్వ బలగాలు మావోయిస్టు గెరిల్లాలతో తలపడుతున్న యుద్ధక్షేత్రంలోకి వెళ్లడం అనవసర రిస్కేమోననిపించింది.

ప్రముఖ జర్నలిస్టులే స్ఫూర్తి..

అయితే ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన మధ్యభారత విప్లవోద్యమం, అక్కడ కొలువైన జనతన సర్కార్ల గురించి తెలంగాణ సమాజానికి తెలియజేయడం సామాజిక బాధ్యతగా భావించాను. జాన్ మిర్థాల్, అరుంధతీరాయ్ వంటి ప్రముఖులే కాకుండా గౌతం నవలఖా, రాహుల్ పండితా వంటి జర్నలిస్టులు కూడా బస్తరు వెళ్లడం స్ఫూర్తినిచ్చింది. మా ఎడిటర్ గారు, సీఈఓ గారు ఇచ్చిన భరోసాతో చివరకు ఛత్తీస్గఢ్ టూర్ కు ఓకే చెప్పాను.

జస్ట్ మిస్..

ఫిబ్రవరి 20 రాత్రి నేను, మరో నలుగురు మీడియా మిత్రులు హైదరాబాదులో బయలుదేరాం. మరునాడు ఉదయానికల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దున ఉన్న ఓ మండల కేంద్రానికి చేరుకున్నాం. మమ్మల్ని తీసుకెళ్లడానికి రావాల్సిన గ్రామస్తులు ఏ కారణం చేతో రాలేదు. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నాతో వచ్చిన ఇతర మిత్రులు వాహనాన్ని నేరుగా బార్డర్ చివరి గ్రామానికి పోనిద్దామన్నారు. అలా వెళుతున్న క్రమంలో పెట్రోలింగ్ చేస్తున్న ఓ గ్రేహౌండ్స్ బ్యాచ్ నుంచి జస్ట్ మిస్సయ్యాం. చివరి గ్రామం చేరుకున్నాం.

అక్కడ ఆరా తీస్తే అన్నల జాడ తెలిసింది. మమ్మల్ని రిసీవ్ చేసుకోవాల్సినవాళ్లు కూడా కలిశారు. అందరం కలిసి కాలినడకన గంటన్నర వెళ్లాం. ఓ పల్లె వచ్చింది. అక్కడ అప్పటికే మా కోసం భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోగా మావోయిస్టు పార్టీ పంపిన ఓ వార్తాహరుడు వచ్చి మా షెడ్యూల్ చెప్పాడు. మరో నాలుగు గంటల ప్రయాణం తర్వాత తొలిమజిలీ చేరుకుంటారని, అక్కడ మీకు స్థానిక జనతన సర్కారు ఆతిథ్యమిస్తుందన్నాడు.

మిలీషియా చెక్ పోస్టులు..

ఇద్దరు స్థానికులు వెంట రాగా మేము బయలుదేరాం. తర్వాతి గ్రామంలో పంటల పండుగ జరుగుతుంటే కాసేపు ఆగాం. స్త్రీ పురుషులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా చేస్తున్న సంప్రదాయ నృత్యాలను తిలకించాం. దారిలో గ్రామగ్రామాన పొలిమేరల్లో మమ్మల్ని మిలీషియా సభ్యులు ఆపడం, ఎవరని ఆరా తీయడం, మా వెంట ఉన్నవాళ్లు ఏవో విషయాలు చెప్పగానే లాల్ సలాం అంటూ సంతోషంగా మాతో చేతులు కలుపడం కొనసాగింది. ఎవరైనా కొత్త ముఖాలు వస్తే వాళ్లు ఈ మిలీషియా కళ్లుగప్పి లోపలి గ్రామాలకు వెళ్లడం సాధ్యం కాని విషయమని మాకు అర్థమైంది. రాత్రి ఏడు గంటలకల్లా మేము గమ్యం చేరాం. స్థానిక సర్కారు అధ్యక్షుడు ఇతర ప్రతినిధులు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. ప్రయాణ క్షేమ సమాచారాలడిగారు.

తర్వాత రెండు రోజులూ మేము ఈ గ్రామంలోనే ఉండి జనతన సర్కారుకు సంబంధించిన పనితీరును పరిశీలించాం. స్థానికంగా వాళ్లు ఉమ్మడిగా నిర్మించుకుంటున్న చెరువు దగ్గరకు వెళ్లాం. సమష్టి వ్యవసాయ క్షేత్రంలో పండించిన వేరుశనగ పంటను పరిశీలించాం. జనతన సర్కారు నెలకొల్పిన బడిని, హాస్పిటల్ను చూశాం. పొద్దునే తాగిన అలిసెంతలతో కూడిన బియ్యపు జావ నుంచి టమాటలు, వంకాయల వరకు సమష్టిగా స్థానికంగా పండించినవేనని తెలిసి ఆశ్చర్యపోయాం.

అందరూ భూమిపుత్రులే..

ఇక్కడే మాకు పామేడ్ ఏరియా కమిటీ కార్యదర్శి సోని కలిసింది. ఆయుధాలేమీ లేకుండా స్థానికుల్లో కలిసిపోయి ఉన్న ఆమెను కేవలం తెలుగులో మాట్లాడడాన్ని బట్టి గుర్తు పట్టాం. మీరు ఏపీనా అని అడిగితే ఔనంది. అక్కడి వాళ్లు చాలా మందే ఉన్నారా అంటే లేరంది. మీకు గోండి భాష రాదు కనుక సాయపడడానికి నన్ను పంపించారంది. దక్షిణ బస్తర్ డివిజన్ మొత్తానికి తానొక్కతే బయటిదాన్నని, మిగతా వాళ్లంతా స్థానిక భూమిపుత్రులేనని వివరించింది. ఒక రోజంతా ఆమెతో మాట్లాడి పలు అంశాలను అడిగి తెలుసుకున్నాం. ఇలా నిరాయుధంగా ఉంటే భయం వేయదా అని అడిగితే ఆయుధం ఇచ్చే రక్షణ పాక్షికమని, ప్రజల మద్దతే మమ్మల్ని బతికిస్తున్నదని తెలిపింది. తమకు తెలియకుండా పోలీసులు కాని, ఇన్ఫార్మర్లు కాని లోపలికి రాలేరని ధీమాగా చెప్పింది.

బాంబు పేలుళ్ల వార్త అక్కడే..

మేమున్న ఇంటికి పదుల సంఖ్యలో జనాలు రావడం, మాతో, సోనితో మాట్లాడిపోవడం నిరంతరం కొనసాగింది. సరిగ్గా ఉదయం 6.45, సాయంత్రం 6.15 కాగానే సోని తన రేడియో తెచ్చి మాకిచ్చేది. వార్తలు వినమని చెప్పేది. అలా మేం హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్ల గురించి తెలుసుకోగలిగాం. హైదరాబాద్లో ఉంటే ఈ ఘటనపై హల్చల్ చేయడంలో మునిగిపోయివుండేవాడివని మా వెంట ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా మిత్రున్ని ఆటపట్టించాం. బయటి ప్రపంచం గురించి తెలుసుకునేందుకు తమకున్న ఏకైక ఆధారం రేడియో ఒక్కటేనని సోని చెప్పింది.

మేము అక్కడి నుంచి వెళ్లిపోయే రోజు ఉదయం మాకు జనతన సర్కారు నాటుకోడి కూరతో భోజనం పెట్టింది. ఆ సాయంత్రం పీడియా, తుమ్నారు ప్రాంతానికి బయలుదేరాం. ఈసారి అదృష్టం మమ్మల్ని వరించింది. జనతన సర్కారు మా కోసం మూడు మోటార్సైకిళ్లను సంపాదించింది. ఆ వాహనాల ఓనర్లతో కలిసి ఒక్కో బండిపై ముగ్గురం చొప్పున ఎక్కాం. ఇవే బండ్లపై తిరుగు ప్రయాణమూ చేశాం.

గుట్టలపై బైక్ డ్రైవింగ్..

ఆ గ్రామస్తులకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రాకపోవడంతో మాలో ముగ్గురం ఆ పని చేశాం. వెనకాల ఇద్దరు కూర్చోగా అడవిలోని కాలిబాటల గుండా, కొండలు గుట్టలనెక్కిస్తూ వాగులు వంకలు దాటుతూ ముందుకు సాగడం మరిచిపోలేని అనుభూతి. ఉద్యోగం పోతే ఏ సర్కస్ కంపెనీలోనైనా ఈజీగా ఉద్యోగం వస్తుందని ఎవరో జోక్ చేశారు కూడా.

పీడియా కంటే ముందు అనుకోకుండా మాకు జేగురుగొండ ఏరియా కమిటీ కార్యదర్శి పాపారావు కలిసాడు. ఆయన వెంట లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్డీఎస్) ఉండడంతో పీఎల్టీఏ ఫొటోలు లేవనే నిరాశతో ఉన్న మాకు ప్రాణం లేచివచ్చింది. ఫొటోలు లేకపోతే వార్తలు ఆకట్టుకోవని చెబితే పాపారావు సమ్మతించాడు. కాకపోతే వెనుకనుంచే తీసుకోవాలని షరతు పెట్టాడు. వివరంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరి పీడియా గ్రామం చేరాం. జనవరి 21న వేయి మంది ప్రభుత్వ బలగాలు దాడిచేసి తగులబెట్టినట్లుగా చెబుతున్న కొన్ని ఇళ్లను, జనతన సర్కారు ఆశ్రమ పాఠశాలను పరిశీలించాం.

స్కూలు బూడిద అయింది..

బూడిద తప్ప అక్కడ ఏమీ మిగిలిలేదు. మా వంక దీనంగా చూస్తున్న ఆదివాసీ మహిళలను, పిల్లలను చూస్తుంటే హృదయం ద్రవించింది. మనుషులంతా ఒక్కటే అయినప్పుడు కొందరు సకల సంపదలు అనుభవించడం, మరికొందరు ఇలా జంతువుల వలే బతుకులు వెల్లదీయడం ఏమిటన్న ప్రశ్న మమ్మల్ని బాధించింది.

పక్కనే మోర్టార్ షెల్ పేలుళ్లు..

ఇక్కడే మేము డేంజర్లో పడ్డాం. సుమారు వేయి మంది బలగాలు వివిధ క్యాంపుల నుంచి బయలుదేరి కోర్సి అనే ఊరికి వచ్చి మకాం చేసినట్లు సమాచారం అందింది. ఆ ప్రదేశం మేమున్న చోటికి కేవలం 2 కి.మీ.ల దూరంలోనే ఉండడంతో బాగా టెన్షన్ పడ్డాం. ఆ రాత్రి ఊరిలో కాకుండా పక్కన ఉన్న గుట్టపై నిద్రించాం. మరునాడు ఉదయం పీడియా జనతన సర్కారుకు సంబంధించిన గ్రామసభ నిర్వహిస్తుంటే దూరంగా మోర్టార్ షెల్స్ పేలిన శబ్దాలు వినిపించాయి. అయినా అక్కడ గుమికూడిన వాళ్లెవరూ గాబరా పడలేదు. మావోయిస్టు పీఎల్జీఏ కంపెనీ ఒకటి ప్రభుత్వ బలగాలను నిలువరించి పోరాడుతోందన్న సమాచారం అందడంతో జనం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించారు. సభలో ప్రభుత్వ బలగాలు తమను పెడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. కొందరైతే ఆవేశంతో భారత సైన్యానికి ఇక్కడేం పని.. వెనక్కి వెళ్లాలని నినదించారు.

దారిలో ఎదురైన మావోయిస్టు జగన్..

ఆ సాయంత్రం బయలుదేరి రోజంతా ప్రయాణించాం. మధ్యలో అనుకోకుండా ఎన్టీఎస్‌జడ్సీ అధికార ప్రతినిధి జగన్ తటస్థపడ్డారు. మా డిమాండ్ మేరకు రెండు గంటల పాటు మాతో మాట్లాడారు. ఆయన కలిసిన ఉత్సాహంలో మేము మా టెన్షన్ను మరిచిపోయాం. ఇంత కష్టపడి వచ్చినందుకు ఓ నాయకుడు దొరికాడనుకున్నాం. ఆ తర్వాత రాత్రి 11 గంటలకల్లా మరో గ్రామం చేరి అక్కడ విశ్రాంతి తీసుకున్నాం.

మంగళవారం నాడు తిరిగి బయలుదేరి రాత్రికల్లా బయటి ప్రపంచంలోకి ప్రవేశించాం. మా ఫోన్లలో నెట్వర్క్ రాగానే అందరమూ చిందులేశాం. మూడు రోజులన్నీ జర్నీ ఆరు రోజులకు పెరిగి ఏమైందోనని ఏడుపొక్కటే తక్కువైన మా కుటుంబాలకు మొదటి కాల్ చేశాం. రెండవ కాల్ నేను మా ఎడిటర్ గారికి చేశా. మరికొందరితో మాట్లాడి మా తిరుగుప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాం.. 27 ఉదయాన ఇంటికి చేరుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాం.

(మార్చ్ 2, 2013) నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Latest News