Monday, July 8, 2024

ఆధార్ ప్రక్రియ అంతా గందరగోళమే..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంబ్లీ గ్రామంలో ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం.. దేశ జనాభాలో కేవలం పది శాతం మందికి కార్డుల జారీ తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది. పార్లమెంటులో కనీస చర్చ లేకుండా 30వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారని కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా పలువురు మేధావులు ప్రారంభంలోనే ప్రశ్నించారు.

గత నవంబర్లో హోం మంత్రి చిదంబరం సైతం ఈ విషయమై ప్రధానికి లేఖ రాయడం వివాదాస్పదమైంది. కేబినెట్ అనుమతి కూడా లేకుండా ఇంతటి భారీ ప్రాజెక్టును కొనసాగిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవైపు జనాభా లెక్కల్లో భాగంగా పౌరులందరి సమగ్ర వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థల ఆధ్యర్యంలో ఆధార్ ఎన్రోల్మెంటు ప్రక్రియను కొనసాగించడం వల్ల ఒకే పనిని రెండు సార్లు చేసినట్టవుతోందని, ఇది వృథా ఖర్చే తప్ప ఫలితం శూన్యమని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఆధార్ లో లోపాలు..

ఆధార్ ప్రాజెక్టుకు చట్టబద్దతనివ్వడానికి ఉద్దేశించిన నేష నల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్లు-2010 డ్రాఫ్టు పై సంవత్సరంపాటు అధ్యయనం చేసిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపలేదు. ఆధార్ కోసం ఉపయోగించే టెక్నాలజీ నమ్మదగినదిగా లేదని, యూరప్ లో పలు దేశాలు ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజావ్యతిరేకత మూలంగా రద్దు చేశాయని అభిప్రాయపడింది.

ప్రస్తుత రూపంలో ‘ఆధార్’ వద్దని, అందులో అనేక లోపాలున్నాయని, ఈ బిల్లును ఉపసంహరించుకుని దాని స్థానంలో మరో కొత్త బిల్లు తేవాలని కమిటీ చైర్మన్, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విచిత్రమేమిటంటే కమిటీలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులూ ఆధార్ను దశా దిశా లేని ప్రాజెక్టుగా వర్ణించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఆధార్పై సందేహాలు వెలిబుచ్చింది.

యూపీఏ రూపకల్పన..

దేశంలో నివసించే వారందరికీ జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేయాలన్న ఆలోచన ఈనాటిది కాదు. 1998లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వాజపేయి సర్కారు తొలి అడుగులు వేసింది. దానికి కొనగాగింపుగా ప్రస్తుత ‘ఆధార్’ ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం 2009 ఫిబ్రవరిలో రూపకల్పన చేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ని ఏర్పరచింది. ఇన్ఫోసిస్ మాజీ కో చైర్మన్ నందన్ నీలేకనిని చైర్మన్గా, జార్ఖండ్కు చెందిన సీని యర్ ఐఏఎస్ అధికారి రాం సేవక్ శర్మను డైరెక్టర్ జనరల్గా నియమించింది. 2009-10 కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలను కేటాయించగా, తదుపరి బడ్జెట్లో ఈ మొత్తం 960 కోట్లకు చేరింది. 2011-12 బడ్జెట్లో సైతం 1470 కోట్లను కేటాయించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా 120 కోట్ల మందికి 12 డిజిట్ల సంఖ్యను కేటాయిస్తారు. ప్రతి వ్యక్తి కి సంబంధిం చిన ప్రాథమిక వివరాలను, ఫొటోను, పది వేళ్ల ముద్ర లను, ఐరిసు సేకరించి డాటా బేస్లో భద్రపరుస్తారు. రేషన్ కార్డు, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు తది తర డజనుకుపైగా గుర్తింపు కార్డుల స్థానాన్ని ఆధార్ ఒక్కటే భర్తీ చేస్తుంది. ఒక వ్యక్తి ఆధార్ నెంబర్ను దేశం లో ఎక్కడైనా ఆన్లైన్లో ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి చెందిన సమస్త సమాచారం స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది.

అన్నింటికీ ఆధార్..

ఆధార్ మూలంగా లాభాలు అనేకమని సంస్థ చైర్మన్ నిలేకని చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, పాస్పోర్టు పొందాలన్నా, ఓటు వేయాలన్నా చివరకు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కావాలన్నా ఆధార్ కార్డు ఆధారంగా ఉపయోగపడుతుందని ఆయన వివరించా రు. సబ్సిడీలు ఎత్తివేసి క్యాష్ ట్రాన్స్ఫర్ పథకానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్న తరుణంలో పేదలకు లబ్ది సాధనంగా ఉంటుందని, వలస కూలీలకు గుర్తింపు బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు.

ఉగ్రవాదులు, నేరస్తులకు అడ్డుకట్ట వేయవచ్చునని, దేశంలోని ఏ ప్రాంతంలో నేరానికి పాల్పడ్డా క్షణంలో నిందితులను గుర్తించవచ్చునని తెలిపారు. టెంబ్లీ గ్రామానికి చెందిన రజన సోనావనెకు మొదటి కార్డు ఇచ్చింది మొదలు ఇప్పటి వరకు (జనవరి 17 నాటికి దేశవ్యాప్తంగా పె 11 కోట్ల 62 లక్షల మందికి ఆధార్ గుర్తింపు అభించింది. 2012 మార్చ్ కల్లా ఈ సంఖ్య 20 కోట్లకు చేరుకోవాలని, 2014కల్లా 60 కోట్లకు చేరాలని యూఐడీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

సమచార సేకరణ వివాదాస్పదం..

కాగా, ఆధార్ కోసం చేపట్టిన సమాచార సేకరణ ప్రక్రియ వివాదాస్పదమైంది. డాటా ఎంట్రీ పనులను యూఐడీఏఐ ఆయా రాష్ట్రాల ప్రాతిపదికన వివిధ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. ఈ ఏజెన్సీలు ఆయా నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఎన్రోల్మెంట్ కేంద్రాలను తెరిచి పౌరుల వివరాలను సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో పలు రకాల అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. దరఖాస్తులు నింపడానికి, వివరాలు ఎంట్రీ చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఎన్రోల్మెంట్ చేసుకుని ఆరు నెలలు గడిచినా కార్డులు అందడం లేదని విమర్శలున్నాయి.

అవసరంలేని సమాచారాన్ని కూడా అడుగుతున్నారని, ఇది పౌరుల ప్రైవసీకి భంగకరమని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానికి రాసిన ఉత్తరంలో హోం మంత్రి చిదంబరం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వోద్యోగుల ప్రమేయం లేకుండా చేసే సమాచార సేకరణ నమ్మదగినదిగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరుల గురించిన సమాచారం ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో పడితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చునని, ఆ డాటాను వారు ఇతరులకు అమ్ముకునే అవకాశముందని ఆందోళన వెలిబుచ్చారు.

ప్రజాధనం వృథా..

వివాదాస్పదంగా మారిన మరో అంశం ఒకే పని రెండు సంస్థలు చేపట్టడం. జనాభా లెక్కల్లో భాగంగా ఒకవైపు భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో సెన్సస్ విభాగం వేలి ముద్రలు, ఐరిస్ సహా పౌరులందరి సమగ్ర వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైవుండగా, ఆధార్ ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రైవేట్ ఎన్రోల్మెంట్ ఆధ్య ఏజెన్సీలు కూడా అదే పని చేస్తున్నాయి. ఇందుకోసం సెన్సస్ విభాగం వేయి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, యూఐడీఏఐ కేవలం 12 కోట్ల ఎన్రోల్మెంట్ల కు ఇప్పటికే సుమారు రెండు వేల కోట్లు వెచ్చించింది. ఒకే పనిని నిర్వహించడానికి ఇలా రెండు సంస్థలు విలువైన ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

ప్రభుత్వోద్యోగుల పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా జనాభా లెక్కల కార్యక్రమం కొనసాగుతున్నదని హోం శాఖ చెబుతుండగా, ఆధార్ కోసమంటూ ప్రైవేట్ ఏజెన్సీలచే వివరాలు సేకరించడంలోని ఔచిత్యాన్ని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. సెన్సస్ విభాగం సేకరించిన డాటాను ఉపయోగించుకుని ఆధార్ కార్డులను జారీ చేయవచ్చునని సూచిస్తున్నారు.

హోం శాఖ వ్యతిరేకత..

2009లో యూఐడీఏఐని ఏర్పాటుచేసిన సందర్భంలో కేంద్ర కేబినెట్ కేవలం పది కోట్ల మంది ఎన్రోల్మెంటుకు మాత్రమే ఆ సంస్థకు అనుమతినిచ్చింది. మిగతా 100 కోట్ల మంది సమాచారాన్ని సెన్సస్ విభాగం రూపొందించే జాతీయ జనాభా రిజిస్టరు(ఎసీఆర్) నుంచి తీసుకోవాలని తలపెట్టింది. అయితే, మరో పది కోట్ల మంది ఎన్రోల్మెంటుకు అనుమతి ఇవ్వాలంటూ 2010 డిసెంబర్లో యూఐడీఏఐ ఆర్థిక శాఖను కోరడం, ఆ శాఖ అందుకు సమ్మతించి అదనంగా నిధులు మంజూరు చేయడంతో వివాదానికి తెర లేచింది. కేబినెట్ అనుమతి లేకుండా ఆర్థికశాఖ ఇందుకు అనుమతించడాన్ని హోం శాఖ వ్యతిరేకించింది. ఈ నేపథ్యలోనే చిదంబరం ప్రధానికి లేఖ రాశారని, వీలైనంత త్వరగా ఈ విషయంలో నెలకొన్న అస్పష్టతను తొలగించాల్సిందిగా అందులో కోరారు.

మరోవైపు ఈ అంశం ఇప్పుడు కేంద్రంలోని వివిధ శాఖలకు పరువు ప్రతిష్టల సమస్యగా మారింది. ప్రధాని మన్మోహన్ ముద్దుల ప్రాజెక్టుగా ముందుకు వచ్చిన ఆధార్ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి ప్రణబముఖర్జీ గట్టి మద్దతు ఇస్తున్నారు. మొన్నటి వరకూ ఈ ప్రాజెక్టుపై సందేహాలు వెలిబుచ్చిన ప్లానింగ్ కమిషన్ డిప్యూ చైర్మన్ మాంటేక్సింగ్ ఆహరాలియా ఇటీవల రాహుల్గాంధీ ఆధార్కు అనుకూలంగా మాట్లాడడంతో మాట మార్చారు. మొత్తం 120 కోట్ల మంది ఎన్రోల్మెంటును యూఐడీఏఐ చేపట్టవల్సిందేనని, సెన్సస్ విభాగం సేకరించే సమాచారం క్రాస్ చెక్ కోసం ఉపయోగపడుతుందని వీరు వాదిస్తున్నారు.

తేల్చనున్న కేబినెట్..

మరోవైపు, హోం మంత్రి చిదంబరం, భారత రిజిస్ట్రార్ జనరల్, ఇతర ఉన్నతాధికారులు, కాంగ్రేసేతర పార్టీలకు చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆధార్ ఎన్రోల్ మెంట్ పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు. యూఐడీఏఐ ఆధ్వర్యంలో జరిగే ఎన్రోల్మెంట్ను ఆపేసి కార్డుల జారీకి మాత్రం సంస్థ పరిమితం కావాలని అంటున్నారు. ఏ విషయమూ రేపు బుధవారం జరిగే కేంద్ర కేబి నెట్ సమావేశంలో తేలనున్నది.

ఆధార్ ప్రాజెక్టు వెనకాల సామ్రాజ్యవాదుల కుట్ర దాగివుందని వామపక్ష మేధావులు ఆరోపిస్తున్నారు. మూడవ ప్రపంచదేశాల ప్రజల చిట్టాను చేతుల్లో ఉంచుకోవడం ద్వారా భవిష్యత్తులో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా కనుసన్నల్లోనే మన్మోహన్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని వారంటున్నారు. ఆధార్ పేరుతో సేకరిం చిన పౌరుల సమాచారాన్ని, వేలిముద్రలను నాట్‌గ్రిడ్ (నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్)కు అనుసంధానించి సీఐఏ వంటి ప్రపంచ గూఢచార సంస్థలకు అందించడం (పెద్దన్న) కోసమేనంటున్నారు.

ఈ ఆరోపణల మాటెలా ఉన్నా వేల కోట్ల ప్రజాధనాన్ని పాలకులు దుర్వినియోగం చేయడం అభ్యంతరకరం. గుర్తింపు కార్డు లేకనే ఈ దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న కోట్లాది మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదనడం మోకాలికి బట్టతలకు ముడిపెట్టడమే. చిత్తశుద్ధి ఉంటే యూఐడీఏఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్రోల్మెంట్ ప్రక్రియను ఆపి, సెన్సస్ విభాగం సేకరించే సమాచారం ఆధారంగా ఆధార్ కార్డులను జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఈ దిశలో నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్లుకు తగిన మార్పులు చేయాలి. ప్రజాధనం ప్రజలకే ఉపయోగపడేలా చూడాలి.

– డి. మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News