Wednesday, July 3, 2024

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం)తో కొనసాగిన యుద్ధంలో రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వ బలగాలు నిర్ణయాత్మక విజయం సాధించాయి. టైగర్ల అగ్రనేత వేలుపిళై ప్రభాకరన్తో సహా కీలక నేతలు, కమాండర్లు ఆ పోరులో నేలకొరిగారు. మిగిలిన వారు యుద్ధఖైదీలుగా చిక్కి శ్రీలంకలోని వివిధ జైళ్లలో విచారణ నెదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం సింహళ సైన్యాలతో పోరాడి చివరకు ఓడిపోయి నైతిక స్థయిర్యం కోల్పోయిన దీనస్థితిలో తమిళ ప్రజలున్నారు.

ఈ పరిస్థితుల్లో హుందాగా వ్యవహరించాల్సిన శ్రీలంక పాలకవర్గాలు తమిళ ప్రాంతాలను సైనిక బలగాలతో నింపి ప్రజలను భీతావహులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ సంస్థా సాయుధంగానో, శాంతియుతంగానో తమిళజాతిపై కొనసాగుతున్న వివక్షపై పోరాడలేని స్థితిని తేవడానికి శతవిధాలా యత్నిస్తున్నారు. ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో సర్వాధికారాలు మిలిటరీ అధికారులకే కట్టబెట్టారు.

తమిళులు మెజారిటీగా ఉండే ఈ ప్రాంతాలన్నీ యుద్ధప్రాతిపదికన సింహళీయుల వలసలుగా మార్చేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్ల పేరుతో, హైసెక్యూరిటీ జోన్లు, అభివృద్ధి ప్రాజెక్టులు, చారిత్రక, పవిత్ర స్థలాల పరిరక్షణ పేరుతో ఈ రెండు రాష్ట్రాల విస్తీర్ణంలో 37 శాతం భూభాగాన్ని ఇప్పటికే ప్రభుత్వ బలగాలు, సింహళ వలసవాదులు వశం చేసుకున్నారు.

వనరులపై సింహళీయుల కన్ను..

ఇక్కడి వనదులపై కన్నేసిన సింహళ పెట్టుబడిదారులు ఇదే అదునుగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. దక్షిణాది నుంచి ఇక్కడికి భారీ ఎత్తున వలసలు సాగుతున్నాయి. టైగర్లకు మద్దతుదార్లని, సానుభూతిపరులని వేలాదిమందిని రకరకాల వేధింపులకు గురిచేస్తున్నారు. బతికుంటే బలుసాకు తినవచ్చనే రీతిలో ఇతర దేశాలకు పారిపోయే స్థితిని కల్పిస్తున్నారు. తమిళ ఈలంలో తమిళులను మైనారిటీలుగా మార్చడమే వారి ప్రధాన వ్యూహంగా వ్యవహరిస్తున్నారు.

సంస్థలు, పార్టీల నేతృత్వంలో పోరాడిన శ్రీలంక తమిళులు చివరకు ఎల్టీటీ ఈ నాయకత్వంలో సాయుధపోరుకు సిద్ధపడ్డారు. మెజారిటీ ప్రాంతాలను సింహళ సైన్యాల నుంచి విముక్తం చేసి స్వయం పాలనను ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 26 ఏళ్ల పాటు యుద్ధం-శాంతి-యుద్ధం పద్ధతుల్లో బతికారు. చివరకు 2009 మేలో జరిగిన అంతిమ పోరులో ఓడిపోయారు.

ఈ యుద్ధంలో 28 వేల మంది తమిళ గెరిల్లాలు, 24 వేల మంది శ్రీలంక సైనికులు, పోలీసులు, 1155 మంది భారత సైనికులతోపాటు కనీసం 40-50 వేల మందికి పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2009 జనవరి నుంచి మే మధ్య సాగిన అంతిమ సమరంలోనే ఐదువేల మంది టైగర్లతో పాటు సుమారు 40వేల మంది తమిళ ప్రజలు ఊచకోతకు గురైనట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా.

అనధికార సైనికపాలన..

ఓడిపోయిన ప్రజల పట్ల కనీస యుద్ధనీతిని, మానవతను కూడా ప్రదర్శించకుండా శ్రీలంక ప్రభుత్వం ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఘోర దమనకాండకు పూనుకుంటున్నది. యుద్ధం ముగిసి రెండున్నరేళ్లు దాటినా అనధికారికంగా సైనిక పాలనే కొనసాగిస్తున్నది. అంతర్జాతీయ వేదికలపైన ఎల్టీటీఈ టెర్రరిజాన్ని మాత్రమే అంతం చేశామని, తమిళులు తమ దేశంలో అంతర్భాగమనీ, ఈలం యుద్ధంలో పౌరుల ఊచకోతలు జరగలేదనీ, త్వరలోనే సమస్యను రాజకీయంగా పరిష్కరిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రభుత్వ పెద్దలు.. స్వదేశంలో మాత్రం దమన నీతినే అమలుచేస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తమను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ సింహళీయులే రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో వివక్షకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో, వివిధ ఇందుకోసం పట్టణాభివృద్ధి శాఖను గోతభయ ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ పరిధిలోకి తెచ్చారు. తమిళుల అధీనంలో ఉన్న ప్రైవేటు భూములను కూడా దఖలు పరుచుకునే అధికారమిచ్చే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్డినెనెన్స్ -2011 బిల్లు రూపొందించారు. ఇప్పుడక్కడ సైన్యం, పట్టణాభివృద్ధి అధికారులు కలిసి తిరుగుతూ వ్యూహాలు రచిస్తున్నారు.

జాఫ్నా జిల్లా విస్తీర్ణంలో 30 శాతం భూభాగాన్ని మిలిటరీ హైసెక్యూరిటీ జోన్ గా ప్రకటించింది. కంఠేశన్ తురై, కిలాలి, మాతక్కల్, మందైత్రీవు, కెయిట్స్ తదితర అనేక దీవులు ఇందులో భాగంగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయాయి. భట్టికలోవా జిల్లాలో కూడా 15-20 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వశం చేసుకోజూస్తున్నది. జిల్లా సరిహద్దు గ్రామం మంగ కలఆరులోని 2500 ఎకరాల భూమిని సింహళ, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. ఈ ఊరి పేరును సైతం మంగళగామగా సైన్యం మార్చేసింది.

కబ్జాలకు మొదటిమెట్టు..

అలాగే పలాలి డివిజన్ దేవులాలకులం గ్రామానికి చెందిన పచ్చని పంటపొలాలను సైనికుల సహాయంతో సింహళీయులు ఆక్రమించారు. సహజవనరులు అధికంగా ఉన్న మరో ఆరు గ్రామాలను ముస్లింలు అధికంగా నివసించే అంపరాయ్ జిల్లాలో విలీనం చేస్తున్నారు. కబ్జాలకు ఇది మొదటిమెట్టని వేరే చెప్పనక్కరలేదు. ఈ గ్రామాల్లో ఒకటైన కెవులియమడులోని 114 తమిళ కుటుంబాలకు చెందిన భూములను 108 సింహళ కుటుంబాలు కబ్జా చేశాయి. మన్నార్ జిల్లా చెల్వియారి ప్రాంతంలో కంటోన్మెంట్ నిర్మాణం పేరుతో వేల ఎకరాల భూమిని కాజేశారు.

బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పేరుతో ట్రింకోమలి జిల్లాలోని చంపూరు ఏరియాలో 10 వేల ఎకరాలను హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. ఫలితంగా 10వేల మంది తమిళులు నిరాశ్రయులయ్యారు. ఇదే జిల్లాలోని తిరియాయ్ అనే తమిళ గ్రామంలోని బుద్ధ విహార్ పరిరక్షణ మిషతో 3వేల ఎకరాలను కాజేశారు. అభివృద్ధి పథకాల పేరుతో వన్ని అడవుల్లో అధికభాగాన్ని సైన్యం ఆక్రమించుకునివుంది. తమిళ ప్రజల పై ఆగని వేధింపులు మరోగాథ. యుద్ధం ముగిసినా, పూర్తిస్థాయిలో టైగర్ల భౌతిక నిర్మూలన జరిగినా ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో ప్రభుత్వ బలగాల దమనకాండ ఆగలేదు.

తమిళులకు వేధింపులు..

ఒకప్పుడు ఎల్టీటీఈలో పని చేశారనో, ఆ సంస్థకు వివిధ రకాలుగా మద్దతు ఇచ్చారనో, ఇక్కడి విషయాలను విదేశాల్లో ఉన్న టైగర్ల సానుభూతిపరులకు చేరవేస్తున్నారనో, సైన్యానికి సహకరించడం లేదనో పోలీసులు, సైనికులు తమిళులను వేధిస్తున్నారు. తమిళుల రోజువారీ జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు. అరెస్టులు, జైలు నిర్బంధాలు కొనసాగుతూనేవున్నాయి. తమిళ పౌరుల ఊచకోతకు సాక్షులుగా ఉన్నారనే మిషతో ఇటీవల వివిధ జిల్లాల్లో ఇంటెలిజెన్స్ సంస్థలు అనేక మందిని నిర్బంధించాయి.

జాఫ్నా, భట్టికలోవా, అంపరాయ్, ట్రింకోమలి, మన్నార్ తదితర జిల్లాల్లో పోలీసులు ఇల్లిల్లు తిరిగి వ్యక్తుల సమాచారం సేకరించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు, ధరల నియంత్రణ పేరుతో, తూనికలు-కొలతలు, క్వాలిటీ కంట్రోల్ పేరుతో, విద్యుత్ మీటర్ల తనిఖీ పేరుతో అధికారులు తమిళులను నంజుకుతింటున్నారు. 49సీసీ మోపెడ్లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించినా, తమిళుల నుంచి పోలీసులు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు.

ఇక, పగలు రాత్రనకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లల్లో చొరబడి సామగ్రి లూటీ చేయడం సాధారణమై పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఈ వేధింపులన్నింటి సందేశం ఒకటే. ఇక్కడుండదలుచుకుంటే బానిసలుగా బతకండి లేదంటే వేరే దేశం వెళ్లిపోండి అని. తమిళులకు ఓ జాతిగా ఇక్కడ చోటులేదు.

సింహళ పాలకులకు టైగర్ ఫోబియా..

దీనంతటికి కారణం ముందే చెప్పినట్లు సింహళ పాలకులకు పట్టుకున్న టైగర్ ఫోబియా. అయితే, ఇంత చేస్తున్నా మొన్న నవంబర్ 27న హీరోస్ డే (అమరుల దినం) సందర్భంగా చారిత్రక జాఫ్నా విశ్వవిద్యాలయంలో హాస్టల్ భవనంపై భారీ కాగడా వెలిగించారు. భట్టికలోవాలో ప్రభాకరన్ పుట్టిన రోజును ప్రజలు కేకులు, స్వీట్లతో ఘనంగా జరుపుకున్నారు.

ఉత్తర, తూర్పు ప్రాంతమంతటిలో ఊరేగింపులను, సమావేశాలను, దేవాలయాల్లో పూజలను, చర్చిల్లో ప్రార్థనలను సైన్యం నిషేధించినా ప్రజలు ధిక్కరించారు. అమరుల స్మృతిలో ఇంటింటా దీపాలు వెలిగించారు. గల్లీల్లో కాగడాలు మండించారు. గుళ్లలో గంటలు మోగించారు. బ్రిటన్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో కూడా తమిళులు హీరోస్ డేను జరుపుకున్నారు.

లక్ష మంది తమిళుల నిర్మూలన..

శతాబ్దాలుగా స్వతంత్ర అస్తిత్వాన్ని కలిగివున్న ఓ జాతి ఆకాంక్షలను సైనికంగా అణచివేయడం సాధ్యం కాదని ఇప్పటికైనా సింహళ పాలకవర్గాలు గుర్తించాలి. పాతికేళ్ల పాటు సాయుధంగా పోరాడి తమిళులు సాధించుకున్న సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. సుదీర్ఘ యుద్ధంలో టైగర్లు సహా ఇప్పటికే సుమారు లక్ష మంది తమిళుల నిర్మూలన, మరో 8 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లిన నేపథ్యంలో సింహళ జాత్యహంకారుల చేతుల్లో తమిళ జాతి నాశనం జరుగకుండా, తమిళ ఈలం మరో పాలస్తీనా కాకుండా చూడాల్సిన బాధ్యత శ్రీలంక పాలకులపై ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా వెంటనే జోక్యం చేసుకుని తమిళ జాతి సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవాలి. వలసీకరణను, మానవహక్కుల ఉల్లంఘనలను, మిలిటరీ వేధింపులను ఆపేలా శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. తమిళజాతిని రక్షించుకోవాలి.

 

 

  • డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News