Tuesday, July 9, 2024

అన్నలరాజ్యం-3: విముక్తి ప్రాంతాలు ఏర్పాటుచేస్తారా?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ)

ఎమర్జెన్సీ తదనంతరం కేంద్ర ఆర్గనైజర్ల రూపంలో రైతాంగాన్ని, యువతీ యువకులను ప్రజాసంగాల్లోకి సమీకరించిన నక్సలైట్లు ఆ తర్వాత క్రమంగా తమ నిర్మాణాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకున్నారు. భూస్వాముల, గూండాల దాడుల నుంచి రక్షణ కోసం ఒక ఆర్గనైజర్, ఇద్దరు సభ్యుల (1+2) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఆ సభ్యుల వద్ద తపంచాలు, నాటుబాంబులు ఉండేవి. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలపై సైతం దాడి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 1985 నుంచి ఐదుగురి నుంచి 11 మంది వరకు గల దళాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇదే చాలాకాలం కొనసాగింది.

పీఎల్జీఏ ఏర్పాటుతో కీలకమార్పులు..

కాగా, 2000 డిసెంబర్లో ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ-పీఎల్ఎ) ఏర్పాటును ప్రకటించిన తర్వాత నిర్మాణాల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది. పార్టీని, సైన్యాన్ని విడదీశారు. సైన్యం రక్షణలో పార్టీ కార్యకర్తలు, కమిటీలు తమ విధులను నిర్వర్తించడం ఆరంభించారు. డివిజన్ల వారీగా, స్పెషల్ జోన్ల వారీగా ప్లాటూన్లు, కంపెనీల రూపంలో మిలిటరీ నిర్మాణాలను ఏర్పరచారు. పార్టీ రక్షణ కోసం లోకల్ దళాలను ఆర్గనైజు చేశారు.

మూడు రకాల బలగాలు..

బస్తర్ లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ప్రస్తుతం మూడు రకాల బలగాలున్నాయి. గ్రామస్థాయిలో లోకల్ మిలీషియా పనిచేస్తోంది. ఇందులో భూంకాల్ మిలీషియా, గ్రామరక్షక దళం, మిలీషియా ప్లాటూను భాగంగా ఉంటాయి. వీరి వద్ద విల్లు- బాణాలు, గొడ్డళ్లు, బరిసెలు, కత్తులు, బర్మార్లు, నాటుతుపాకులు ఉంటాయి. భూంకాల్ మిలీషియా, గ్రామరక్షక దళం స్థానికంగా ఉంటూ ప్రజలకు రోజువారీ రక్షణను కల్పిస్తాయి. మిలీషియా ప్లాటూను మాత్రం ఆ ప్రాంతంలోకి పోలీసు బలగాలు రాకుండా నిరోధక చర్యలు చేపడుతుంది. రోడ్లపై కందకాలు తవ్వడం, బూబీట్రాప్స్ అమర్చడం, పోలీసులు వస్తే వారిని చికాకు పరచే చర్యలను చేస్తుంది. దాడులు కూడా చేస్తుంది.

ఈ ప్లాటూన్లకు మావోయిస్టులు త్రీనాట్‌త్రీ, ఎస్సెల్లార్, ఇన్సాస్ వంటి రైఫిళ్లను కూడా ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమైన విషయమేమిటంటే లోకల్ మిలీషియాలోని సభ్యులంతా మామూలుగా ఊళ్లోనే ఉంటారు. వ్యవసాయ పనులు చేస్తారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆయుధాలు పడతారు.

ద్వితీయ శ్రేణి బలగాలుగా లోకల్ గెరిల్లా దళాలు(ఎల్జీఎస్), లోకల్ ఆర్గనైజేషన్ దళాలు(ఎల్వోఎస్) పనిచేస్తున్నాయి. ఈ దళాలు పార్టీ కమిటీల వెంట ఉంటూ రక్షణ కల్పిస్తాయి. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసులపై దాడి చేస్తాయి. వీరి వద్ద అన్ని రకాల తుపాకులు ఉంటాయి.

గెరిల్లా కంపెనీల ఏర్పాటు..

ఇక ప్రధాన బలగాలైన పీఎల్డీఏ ప్రస్తుతం ప్లాటూన్లు (20-30 మంది), కంపెనీలు(రెండు నుంచి మూడు ప్లాటూన్లు)గా సంఘటితమై ఉంది. ఈ బలగాల ప్రధాన కర్తవ్యం ప్రభుత్వ బలగాలు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోకి చొచ్చుకురాకుండా చూడడం. చొచ్చుకువచ్చినప్పుడు గెరిల్లా పద్ధతుల్లో దాడులు చేయడం. నష్టాలు భరించయినా వాటి పురోగమనాన్ని నిరోధించడం. అవసరమైనప్పుడు రెండు లేదా మూడు కంపెనీలు కలిసి బెటాలియన్(రెండు నుంచి ఐదు కంపెనీలు) ఏర్పడి భారీ దాడికి పాల్పడే సామర్థ్యాన్ని ప్రస్తుతం మావోయిస్టులు కలిగివున్నారు.

మేం పర్యటించిన ప్రాంతాల్లో ఎక్కడా పోలీసు బలగాల జాడలు కనిపించలేదు. ఆవి బాసగూడెం, జేగురుగొండ, ఆవుపల్లి, కుంట, బీజాపూర్, దంతేవాడ, సుక్మా వంటి క్యాంపులకే పరిమితమయ్యాయని స్థానికులు తెలిపారు. గ్రామగ్రామాన మమ్మల్ని మిలీషియా సభ్యులు ఆపారు. మా వెంట ఉన్న స్థానికులను గుర్తు పట్టి పత్రకార్ లోకుర్ (విలేకరులు) వచ్చారంటూ షేక్ హ్యాండిచ్చి పక్కకు తప్పుకున్నారు. మేము ఇంటర్వ్యూ చేసిన ఇద్దరు ఏరియా కమిటీ కార్యదర్శుల వెంట తప్ప మాకు యూనిఫాంలో ఉన్న దళాలు కాని, పీఎల్జీఏ బలగాలు కాని ఎక్కడా తటస్థపడలేదు.

మొబైల్ యుద్ధతంత్రం వైపు అడుగులు..

ఇదే విషయాన్ని ఓ సీనియర్ నేత వద్ద ప్రస్తావించగా తమ పీఎల్జీఏ బలగాలు శత్రు క్యాంపుల చుట్టూరానే తచ్చాడుతాయని, అవకాశం దొరికినప్పుడల్లా వారిపై దాడి చేస్తాయని అన్నారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, కమిటీలు తమ పనులను యథావిధిగా కొనసాగిస్తుంటాయన్నారు. గెరిల్లా యుద్ధం నుంచి తాము సంచార(మొబైల్) యుద్ధతంత్రం వైపు అడుగులేస్తున్నామని చెప్పారు. మరోవైపు, పెద్ద ఫార్మేషన్లకు వెళ్లిన తర్వాత ఇరుపక్షాల వైపునా ప్రాణ నష్టాలు తగ్గాయని, వేయి దాటిన సంఖ్యలో బలగాలుంటే తప్ప శత్రువు తమ ప్రాంతాల్లో ఆడుగు పెట్టడం లేదని జేగురుగొండ ఏరియా కమిటీ కార్యదర్శి పాపారావు తెలిపారు.

కేంద్ర హోంశాఖ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని రుజువు పరుస్తున్నాయి. 2005లో మావోయిస్టుల దాడుల్లో 48మంది ప్రభుత్వ బలగాల జవాన్లు మరణించగా, 2008లో 55 మంది, 2007లో 182మంది, 2008లో 87మంది, 2009లో 121మంది, 2010లో 153మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అవి తమ కదలికల పద్ధతిని మార్చుకుని పెద్దసంఖ్యలో మాత్రమే వెళుతున్న ఫలితంగా నష్టాలు తగ్గాయి. 2011లో 87మంది, 2012లో 38మంది, 2013 ఫిబ్రవరి 24 వరకు ఒకరు బలయ్యారు. మరోవైపు మావోయిస్టుల వైపు నష్టాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2009 వరకు పెరిగిన నష్టాలు ఆ తర్వాత తగ్గాయి.

10వేల చ.కి.మీ.ల భూభాగం నక్సల్స్ చేతిలో?

ప్రస్తుతం సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్ జిల్లాలకు చెందిన సుమారు పది వేల చదరపు కిలోమీటర్ల భూభాగం మావోయిస్టులకు స్థావరంగా మారినట్లు ఛత్తీస్గఢ్ పోలీసువర్గాలు అంచనా వేస్తున్నాయి. తీవ్రవాదులు 100 నుంచి 200 మధ్య సంఖ్యలో సంచరిస్తున్నారని, గెరిల్లా తరహాలో ఆకస్మిక దాడులకు దిగుతున్నారని పేర్కొంటున్నాయి. ఈ ప్రాంతంలోని పెద్ద గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పోలీసు క్యాంపులకు సరుకుల సరఫరా సైతం హెలికాప్టర్ల ద్వారా : ‘ జరుగుతోందని, ఇటీవల మావోయిస్టులు హెలికాప్టర్లపైనా కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఇది కూడా కష్టంగా మారిందని ఆ వర్గాలు తెలిపాయి.

పామేడ్ ఏరియా కమిటీ కార్యదర్శి పాపారావుతో ఇంటర్వ్యూ:

ప్ర: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సల్వాజుడుం పరిస్థితి ఏమిటి?

జ: ఆ బలగాలను కోయ కమాండోలుగా మార్చి ప్రభుత్వ బలగాల్లో కలుపుకున్నారు. ఇప్పుడు వాళ్లు చట్టబద్ధంగానే పనిచేస్తున్నారు. వాళ్లు ఏర్పరిచిన నిర్బంధ శిబిరాలు దాదాపుగా ఖాళీ ఆయ్యాయి. మా ఏరియాలో ఒక్క జేగురుగొండలో మాత్రం కొనసాగుతోంది.

ప్ర: ఇక్కడ అంతా జనతన సర్కార్ల హవా కొనసాగుతున్నట్లుంది?

జ: 2007 నుంచి ఇక్కడి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఉద్యమంలో ఆదివాసుల భాగస్వామ్యం బాగా పెరిగింది. ఏదో ఒక నిర్మాణంలో లేని గ్రామస్తులు ఇప్పుడు దాదాపు లేరనే చెప్పవచ్చు.

ప్ర: పోలీసుల నిర్బంధం ఎలా ఉంది?

జ: గతంలో మాటిమాటికి గ్రామాలపై పడేవారు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గింది. 7, 8 కంపెనీలు (సుమారు వేయి) ఉంటేగాని రావడం లేదు. అలా వచ్చినప్పుడు దొరికిన వారిని దొరికినట్లు కొడుతున్నారు. చంపుతున్నారు. ఆరెస్టు చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. ఇళ్లను, జనతన సర్కారు స్కూళ్లను తగులబెడుతున్నారు. సామాను ధ్వంసం చేస్తున్నారు.

ప్ర: ఈ మధ్యకాలంలో మీలో కొందరు సభ్యులు సరెండర్ అయ్యారు కదా!

జ: అవును. గెలుపుపై నమ్మకం లేని కొందరు సభ్యులు పోలీసులకు సరెండర్ ఆవుతున్నారు. ఆయితే, మరోవైపు రిక్రూట్ అయ్యేవాళ్లు కూడా పెరుగుతున్నారు. ముఖ్యంగా యువతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ప్ర: మీ దళాలలో కొందరు మైనర్లుగా కనబడుతున్నారు. వాళ్లను తీసుకోవడం తప్పు కదా!

జ: మైనర్లను మేము తీసుకోం. మాకు స్పష్టమైన పాలసీ ఉంది. పీఎల్జీఏలో చేరడానికి కనీస వయసు 18. మిలీషియాలో చేరడానికి కనీస వయసు 18. ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల రీత్యా 18 పైబడిన కొందరు యువతీయువకులు తక్కువ వయసున్న వాళ్లలా ఆగుపిస్తారు. అంతే.

ప్ర: 30 సంవత్సరాల మీ ఉద్యమంలో ఏం సాధించారు?

జ: చాలా సాధించాం. ఆదివాసులను ఒక్కటి చేయగలిగాం. బయటి సమాజంలో వారికి గుర్తింపును తేగలిగాం. అడవులను పరిరక్షిస్తున్నాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాం. విద్య, వైద్యం మెరుగుపడింది. శుభ్రత పెరిగింది. ప్రజలు సంతోషంగా బతుకగలుగుతున్నారు.

(మార్చ్ 1, 2013) నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

 

Latest News