Tuesday, July 9, 2024

నేపాల్ సైన్యంలో మావోయిస్టులు

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13వేల ప్రాణాలు బలికావడానికి కారణమైన వైరి పక్షాలు త్వరలో ఒకే సంస్థలో కదం కదం కలిపి దేశరక్షణ విధులను నిర్వర్తించబోతున్నాయి. యునిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎస్ఏ)కి చెందిన తొమ్మిది వేల మందికి పైగా గెరిల్లా సైనికులు ప్రభుత్వ సైన్యంలో భాగమయ్యే ప్రక్రియ ఇటీవల అక్కడ మొదలైంది.

ఇందుకోసం ఏర్పరచిన ఆర్మీ ఇంటిగ్రేషన్ స్పెషల్ కమిటీ మావోయిస్టు గెరిల్లాలకు మూడు ఆప్షన్లనిచ్చింది. ప్రభుత్వ సైన్యంలో చేరడం, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం, పునరావాస ప్యాకేజీ పొందడం.. మొత్తం 16వేల 982 మంది గెరిల్లాల్లో 9వేల 690 మంది సైన్యంలో చేరడానికి నిశ్చయించుకోగా, ఏడువేల 286 మంది పదవీ విరమణకు ఇష్టపడ్డారు. ఆరుగురు మాత్రం పునరావాస ప్యాకేజీ వైపు మొగ్గుచూపారు. పదవీ విరమణను ఎంచుకున్న వారికి చెక్కుల పంపిణీ కార్యక్రమం గత నెల 11న ముగియగా పునరావాస ప్యాకేజీని ఎంచుకున్న ఆరుగురికి కూడా జీవనోపాధి కల్పించారు. ప్రభుత్వ బలగాల్లో చేరడానికి నిర్ణయించుకున్న గెరిల్లాలకు పోస్టింగ్ ఇచ్చే క్రమం ప్రస్తుతం కొనసాగుతోంది.

గెరిల్లాల కోసం ప్రత్యేక విభాగం..

మావోయిస్టులకు అఖిల పక్షాలకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ గెరిల్లాల కోసం నేపాల్ సైన్యంలో ఒక ప్రత్యేక డైరెక్టరేట్ను ఏర్పరుస్తారు. పీఎల్ఎక్కు చెందిన వ్యక్తికి బ్రిగేడియర్ లేదా కల్నల్ హోదా కల్పించి ఈ డైరెక్టరేట్కు అధిపతిని చేస్తారు. వివిధ స్థాయిల్లో ఉన్న ఇతర కమాండర్లకు కూడా తగిన ర్యాంకులు కల్పిస్తారు. ప్రస్తుతానికి వీరిని అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవేక్షణకు, పరిశ్రమల భద్రతకు, అడవుల రక్షణకు ఉపయోగిస్తూ భవిష్యత్తులో పూర్తి స్థాయి సైనికులుగా ఉపయోగించుకుంటారు.

తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని భూస్వాములు, పెట్టుబడిదారులపై వర్గపోరు కొనసాగించిన మావోయిస్టులు బూర్జువా సైన్యంలో భాగమయ్యే క్రమానికి పెద్ద చరిత్రే ఉంది. మొన్నటి వరకు రాచరిక పాలనలో మగ్గిన నేపాల్లో 1940లలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. ఉద్యమ జోరుకు అప్పటి రాజు త్రిభువన్ తలొగ్గి ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది.

1959 – 89 వరకు పార్టీ రహిత పంచాయితీ పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ రాజ్యాంగబద్ధ రాచరిక పాలన కొనసాగింది. 1990లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి ఉద్యమం తీవ్రతరం కాగా త్రిభువన్ మనుమడు బీరేంద్ర రాజ్యాంగ సంస్కరణలకు అంగీకరించి బహుళ పక్ష పార్లమెంటరీ పద్ధతిలో పాలన సాగించడానికి ఒప్పుకున్నారు. అయితే, 1991-2008 వరకు 17 ఏళ్ల కాలంలో 13 ప్రభుత్వాలు మారి వరుస రాజకీయ సంక్షోభాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది.

ప్రజాయుద్ధం షురూ..

నేపాలీ ఫ్యూడల్ సమాజంలో నెలకొన్న దోపిడీ, అణచివేత, నిరంకుశత్వాలపై పోరాడే లక్ష్యంతో 1994లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) ఏర్పడింది. 1996 ఫిబ్రవరి 13 నుంచి నూతన ప్రజాస్వామిక విప్లవ కోసం దేశవ్యాప్తంగా ప్రజాయుద్ధాన్ని ప్రారంభించింది. రాజు నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించింది.

ప్రజాస్వామ్య ఉద్యమాల పేరిట పోరు సలుపుతూ అవకాశవాద పద్ధతుల్లో ప్రభుత్వాలనేర్పరుస్తున్న బూర్జువా పార్టీల డొల్లతనాన్ని బయటపెట్టింది. వరుస సంక్షోభాలకు కారణం ఈ పార్టీలేనని ప్రకటించి నిజమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రజాయుద్ధం ద్వారానే సాధ్యమని చాటిచెప్పింది. యువతను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పెద్దయెత్తున చేరి రాచరికాన్ని అంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది.

పట్టణాలు కూడా స్వాధీనంలో..

నేపాలీలు మావోయిస్టుల పిలుపునకు సానుకూలంగా స్పందించారు. 2004 కల్లా ఖాట్మండూ లాంటి నగరాలు, పెద్ద పట్టణాలు తప్ప మిగతా ప్రాంతాలన్నీ గెరిల్లా బలగాల వశమయ్యాయి. ఆరంభంలో రెండు మూడు ప్లాటూన్లుగా ఉండిన పీఎల్ఎ కంపెనీలుగా, బెటాలియన్లుగా అభివృద్ధి చెంది ప్రభుత్వ బలగాలను కంటోన్మెంట్లకే పరిమితం చేసే స్థాయికి ఎదిగింది. విప్లవ శక్తులను కట్టడి చేయడంలో నిస్సహాయుడైన రాజు జ్ఞానేంద్ర 2005 ఫిబ్రవరి 1న ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ప్రభుత్వాన్ని రద్దు చేసి అన్ని అధికారాలు తన చేతిలోకి తెచ్చుకున్నాడు.

ఫలితంగా మరోసారి ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమానికి తెరలేచింది. ఈ ఉద్యమాన్ని విప్లవోద్యమంతో మేళవించే ఎత్తుగడలను చేపట్టిన మావోయిస్టు పార్టీ చైర్మన్ ప్రచండ అలియాస్ పుష్పకుమార్ దహల్ తమ పంథాను మార్చుకుని సెప్టెంబర్ లో ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించారు. ఉద్యమంలో కల్సిరావాల్సిందిగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అటు మావోయిస్టుల సాయుధపోరు, ఇటు అఖిలపక్షాల చట్టబద్ధ ఉద్యమం కలిసి లోకాంత్రిక్ ఆందోళన్ ఉప్పెనలా ఎగిసింది. చివరకు, 2006 ఏప్రిల్ 24న జ్ఞానేంద్ర దిగివచ్చి తన సార్వభౌమాధికారాన్ని వదులుకుంటున్నట్లు, ప్రతినిధుల సభను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.

రాజ్యాంగసభ ఏర్పాటు..

ఈ పరిణామాన్ని నేపాల్ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావించవచ్చు. పునరుద్ధరించిన ప్రతినిధుల సభ ఆ వెంటనే రాజు అధికారాలకు కత్తెర వేస్తూ తీర్మానించింది. దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. జీ పీ కోయిరాలా నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కొత్త రాజ్యాంగాన్ని లిఖించడం కోసం కానిస్టిట్యూషనల్ అసెంబ్లీ (రాజ్యాంగ సభ) ఏర్పాటుచేసి వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. మరోవైపు 2006 సెప్టెంబర్ 21న కోయిరాలా ప్రభుత్వంతో సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన మావోయిస్టులు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావడానికి అంగీకరించారు.

పదేళ్ల అంతర్యుద్ధం ముగిసిందని, మావోయిస్టులు ఇక సాయుధపోరును విరమించి పార్లమెంటరీ బాటలో విప్లవ విజయానికి కృషి చేస్తారని ప్రచండ ప్రకటించారు. 17 వేల బలగాలున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఫార్మేషన్లను ఐక్యరాజ్యసమితి-నేపాల్ మిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంటోన్మెంట్లలో ఉంచడానికి, వారికి నెలవారీ భత్యాలను చెల్లించడానికి నిర్ణయమైంది. కోయిరాలా సర్కారులో మావోయిస్టు నేతలు మంత్రులుగా చేరారు.

అతిపెద్ద పార్టీగా మావోయిస్టులు..

తదనంతరం 2008 ఏప్రిల్ 10న రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 575 సీట్లకు గాను 220 సీట్లు సాధించి మావోయిస్టులు అతి పెద్ద పార్టీగా నిలిచారు. 601 మంది సభ్యులతో మేలో సమావేశమైన సభ కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు చేసింది. 597-4 మెజారిటీతో రాచరికానికి చరమగీతం పాడి దేశాన్ని ఫెడరల్ రిపబ్లిక్ గా ప్రకటించింది. రాజు స్థానంలో జూలై 23న నేపాలీ కాంగ్రెస్కు చెందిన రాంభరణ్ యాదవ్ను దేశాధ్యక్షునిగా ఎన్నుకుంది. మూడు నెలల పాటు అనిశ్చితి కొనసాగిన అనంతరం ఆగస్టు 15న మావోయిస్టు చైర్మన్ ప్రచండ ప్రధానిగా సీపీఎన్(యూఎంఎల్)తో కల్సి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.

అయితే, ఆర్మీ చీఫ్ తొలగింపు వివాదం నేపథ్యంలో ప్రచండ ప్రభుత్వం కేవలం తొమ్మిది నెలల్లోనే కుప్పకూలింది. తర్వాత పగ్గాలు చేపట్టిన మిగతా పార్టీల ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాయి. రెండేళ్లలో రెండు ప్రభుత్వాలు మారి శాంతి ప్రక్రియకు విఘాతమేర్పడే వాతావరణంలో చివరకు 2011 ఆగస్టు 28న మరోసారి రాజ్యాంగసభ మావోయిస్టులవైపే మొగ్గుచూపింది. మదేశీ పార్టీల కూటమి సహకారంతో యూసీపీఎన్ (ఎం) వైస్ చైర్మన్ బాబూరామ్ భట్టరాయ్ నేపాల్ 36వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత రెండు నెలలకు నవంబర్ 1న ప్రధాన పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్క్సిస్టు-లెనినిస్టు)లకు, మావోయిస్టులకు మధ్య చారిత్రాత్మక ఏడు సూత్రాల ఒప్పందం జరిగింది. మావోయిస్టు పీఎల్ఎ గెరిల్లాలను నేపాల్ సైన్యంలో చేర్చుకోవడం, వీలైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని లిఖించి, సార్వత్రిక ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఇందులోని ముఖ్యాంశాలు. ఈ ఒప్పందం వెలుగులోనే ప్రస్తుతం నేపాలీ రాజకీయాలు నడుస్తున్నాయి.

ఓ వర్గం వ్యతిరేకత..

మావోయిస్టుల పార్లమెంటరీ ప్రవేశాన్ని, విప్లవ గెరిల్లా యోధులకు బూర్జువా సైనిక పోస్టింగులను పలువురు వ్యతిరేకించారు. పార్టీ లోపల సైతం ప్రచండ పంథా ను వ్యతిరేకించే ఓ బలమైన వర్గం ఉంది. వైస్ చైర్మన్ మోహన్ వైద్య, ప్రధాన కార్యదర్శి రాంబహదూర్ థాపా సీసీ సమావేశాల్లో ప్రచండ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతర్యుద్ధకాలంలో మావోయిస్టుల నాయకత్వంలో ఆక్రమించిన భూ ములకు పట్టాలిచ్చే చట్టాన్ని ఆమోదించే విషయంలో రాజీ వైఖరి అవలంబిస్తున్నారంటూ ప్రచండపై, ప్రధాని బాబూరామ్ పై అతివాద వర్గం విరుచుకుపడింది. విప్లవ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి విలాస జీవితానికి అలవాటుపడ్డారని ఆరోపించింది.

వ్యతిరేకించిన భారత మావోయిస్టులు..

మావోయిజానికి నిజమైన వారసులమని చెప్పుకుంటున్న వివిధ దేశాల విప్లవ పార్టీలు నేపాలీ మావోయిస్టుల పంథాను వ్యతిరేకిస్తున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సైతం ప్రచండ పంథాను తూర్పారపట్టింది. గొప్ప విజయాలు సాధించిన నేపాలీ మావోయిస్టులు నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సామ్రాజ్యవాద శక్తులకు తాకట్టు పెట్టారని విమర్శించింది. విముక్తి ప్రాంతాలను వదిలేసి, ప్రజాసైన్యాన్ని నిరాయుధం చేసి ప్రభుత్వ బలగాల్లో కలిపేయడం అక్కడి ప్రజలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించింది. మితవాద అవకాశవాద రాజకీయాల ప్రచండ పంథాను నిర్ద్వంద్వంగా తిరస్కరించి పోరుబాటను కొనసాగించాల్సిందిగా నేపాల్ విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చింది.

విముక్తి ప్రాంతాలను వదిలి ప్రభుత్వ సైన్యంలో చేరడం ద్వారా సరికొత్త ప్రయోగానికి తెరతీసిన నేపాలీ మావోయిస్టు గెరిల్లాల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నూతన ప్రజాస్వామ్యాన్ని 21వ శతాబ్దపు బహుళ పార్టీ ప్రజాస్వామ్యంగా ప్రవచించడం ద్వారా ఎన్నికల్లో పాల్గొని అధికారం చేపట్టిన ప్రచండ పంథా నిజంగా కార్మికవర్గ విప్లవాన్నే తెచ్చిపెడుతుందో లేక మన దేశంలో సీపీఐ, సీపీఎంలలాగా రోజురోజుకు ప్రాభవం కోల్పోతూ ఓట్లకోసం, సీట్లకోసం ప్రాకులాడే పరిస్థితికి దారితీస్తుందో కాలమే సమాధానమివ్వగలదు.

  • డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News