Tuesday, July 9, 2024

ఈశాన్యం భారతంలో మావోయిస్టులు

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగప్రవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయుధ ఉద్యమాలు నడిపిన అనేక సంస్థలు ఇటీవలికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని పోరాటాలను విరమించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రాల్లో ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘనమైన పోరాట చరిత్ర కలిగిన ఈశాన్య ప్రాంత ఆదివాసుల్లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసి వారిని విప్లవ పోరాటాల వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తన కార్యకలాపాలను ఉధృతం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆయా రాష్ట్రాల్లో జాతుల స్వయం నిర్ణయాధికారం కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న సంస్థలతో ఒకవైపు సన్నిహిత సంబంధాలు నెరుపుతూనే, కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ఉద్యమాలు నిర్వహించడానికి ఆ పార్టీ సమాయత్తమవుతోంది. ఈస్టర్న్ రీజనల్ బ్యూరో సారథ్యంలో అప్పర్ అస్సాం లీడింగ్ కమిటీ (యూఏఎల్సీ) ఈ కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో స్థానిక ఆదివాసులకు నిలువ నీడ లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, అనుసరిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు.

ప్రజాసంఘాల నిర్మాణం..

అస్సాంలో బృహత్ నదీబాంధ్ ప్రతిరోధ్ మంచ్(భారీతరహా డ్యాంల ప్రతిఘటన వేదిక)ను స్థాపించి పలు జిల్లాల్లో విప్లవ పోరాటాలకు బాటలు వేశారు. తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల్లోకి వెళ్లడమే కాకుండా విద్యార్థి యువకులను, గిరిజనులను ఆకర్షించడం కోసం ఈ రాష్ట్రంలో పలు ప్రజాసంఘాలను సైతం స్థాపించారని సమాచారం. తన నియోజకవర్గంలో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్న దృష్ట్యా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని లోహిట్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాష్ట్ర శాసనసభలో డిమాండ్ చేశారు.

అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయలో నెలకొల్పుతున్న 3000 మెగావాట్ల దిగువ సుబన్సిరి జల విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మావోయిస్టులు స్థానికులను సమీకరించి క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్)ని ఏర్పాటుచేశారు. సాయుధ తిరుగుబాట్లకు నెలవైన మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో సైతం పలు సాయుధ పోరాట గ్రూపులతో మావోయిస్టులు కలిసి పని చేస్తూనే.. స్వతంత్ర అస్తిత్వం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

కట్టడికి కసరత్తు..

ఇక వివిధ సంస్థలతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక సమావేశాలకు మిజోరం షెల్టర్ జోన్ గా ఉపయోగపడుతోంది. ఈ పరిణామాలన్నింటిని జాగ్రత్తగా గమనిస్తోన్న కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇటీవల ఈశాన్య రాష్ట్రాల పోలీసు, పారామిలిటరీ బలగాలను హెచ్చరించింది. గత డిసెంబర్ లో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మావోయిస్టుల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాల రచనకు కసరత్తు చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టిని కేంద్రీకరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి నిజమేనని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లంరాజు సైతం ఒప్పుకున్నారు.

1980లోనే ప్రస్తావన..

మావోయిస్టుల ఈశాన్య ప్రవేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పీపుల్స్వార్ సంస్థాపకుడు, నక్సలైట్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య 1980లో రూపొందించిన గెరిల్లా జోన్ డాక్యుమెంటులోనే ఈ ప్రస్తావన ఉంది. ఉత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలను రక్షించుకోవడానికి ఉద్యమం దండకారణ్యానికి విస్తరించాలని చెబుతూ.. భారత విప్లవానికి ఆదిలాబాద్ నుంచి ఈశాన్య భారతం దాకా విస్తరించిన దట్టమైన అడవులే కీలకమని ఆయన అందులో ప్రస్తావించారు. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమ విస్తరణ అంతా కొండపల్లి చూపిన బాటలోనే నడిచిందని చెప్పవచ్చు. బస్తర్, గడిచిరోలి జిల్లాలగుండా గోందియా, గావ్, దుర్గ్, బాలాఘాట్ జిల్లాలకు పీపుల్స్ వార్ దళాల కార్యకలాపాలు వేగంగా రాజనంద్ విస్తరించాయి.

సరిహద్దులే కీలకం..

1998లో సీపీఐ(ఎంఎల్) పార్టీ యూనిటీతో, 2004లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ)తో విలీనం జరిగి మావోయిస్టుపార్టీగా అవతరించిన తర్వాత, దండకారణ్యానికి ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో లింకు ఏర్పడింది. దండకారణ్యం (ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్), ఏఓబీ (ఆంధ్ర-ఒరిస్సా), జంగల్మహల్(జార్ఖండ్-ఒరిస్సా-బెంగాల్), బీడే (బీహార్-జార్ఖండ్ సరిహద్దులు గెరిల్లా విప్లవ కేంద్రాలుగా మారాయి.

దీంతో తెలంగాణ నుంచి బెంగాల్ అడవుల దాకా దళాలు సాయుధ ఫార్మేషన్లుగా చేరుకునే సౌలభ్యం ఏర్పడింది. ఇక మిగిలింది ఈశాన్యమే. అక్కడికి కూడా విస్తరించి ఎందరెందరో విప్లవకారులు కన్న కలలను సాకారం చేయడానికి, విశాలమైన ఎర్ర కారిడార్ను నిర్మించి భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే దిశలో ముందుకు సాగడానికి మావోయిస్టు పార్టీ పక్కా వ్యూహాన్ని రచించింది. ఆ దిశలో అడుగులు వేస్తోంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లుగా కూడా పిలిచే ఈశాన్య రాష్ట్రాల్లోకి మావోయిస్టుల విస్తరణ

ఇటీవల కేంద్ర బలగాల చేతిలో అసువులు బాసిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ ఆధ్వర్యంలోనే జరిగింది. కేంద్ర కమిటీకి చెందిన ఈస్టర్న్ రీజనల్ బ్యూరో చీఫ్ గా ఉంటూ ఆయన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉల్ఫా మొదలుకొని ఎన్ఎస్ఎసీఎన్ (ఐఎం) వరకు వివిధ పోరాట సంస్థలకు చెందిన కీలక నేతలను కలిశారు. పలు సంస్థలతో స్నేహపూర్వక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. ఈ క్రమంలోనే మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతానికి కట్టుబడివున్న శక్తులను కూడగట్టారు. మావోయిస్టు అప్పర్ అస్సాం లీడింగ్ కమిటీని ఏర్పరచారు.

స్థానిక సంస్థలతో సత్సంబంధాలు..

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం అస్సాంలో పరేశ్ బారువా నేతృత్వంలో పని చేస్తున్న ఉల్ఫా చర్చల వ్యతిరేక వర్గంతో, ఆదివాసీ పీపుల్స్ ఆర్మీ (ఏపీఏ)తో, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ)లోని ఒక వర్గంతో మావోయిస్టులు సత్సంబంధాలు నెలకొల్పుకున్నారు. ఈ సంస్థల నుంచి ఆయుధాలు, సైనిక శిక్షణ తదితర విషయాల్లో సహకారం తీసుకుంటూ వారికి బెంగాల్, జార్ఖండ్లోని అడవుల్లో ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. టీన్సూకియా, శివసాగర్, గోల్పారా, కోక్రఝార్, ధూబ్రి, కామ్హూప్, సోనిత్పూర్, దర్రాంగ్ జిల్లాల్లో యూఏఎల్సీ నాయకత్వంలో స్వయంగా కార్యకలాపాలు ప్రారంభించారు.

అస్సాం స్టూడెంట్స్ యూత్ ఆర్గనైజేషన్, అస్సాం చాహ్ జనజాతి సురక్ష సమితి, ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు వాస్తవానికి మావోయిస్టులకు కవర్ సంఘాలుగా పని చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోపిస్తున్నారు. భారత ప్రభుత్వ బలగాల దాడులను సంయుక్తంగా తిప్పికొట్టే లక్ష్యంతో మణిపూర్ లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎస్ఏ), పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ (ప్రిపాక్), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్)లతో, నాగాల పోరాట సంస్థ ఎన్ఎస్సీఎన్ (ఐఎం)తో మావోయిస్టులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

శాంతిచర్చలకు వ్యతిరేకత..

ఈశాన్యంలో మావోయిస్టులు నిలదొక్కుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. జాతుల స్వయంనిర్ణయాధికారం కోసం దశాబ్దాలుగా పోరాడిన పలు సంస్థలు భారత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని చేతులెత్తేయడంతో ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండానే పోరాట విరమణ చేయడాన్ని వ్యతిరేకించి మావోయిస్టుల వైపు ఆకర్షితులవుతున్నారు. పైగా ప్రతి సంస్థలోనూ శాంతి చర్చలను వ్యతిరేకించే వర్గమొకటి పుట్టుకొచ్చి పోరాట కొనసాగింపులో మావోయిస్టుల సాయాన్ని ఆర్జిస్తున్నది.

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నవి, పెద్దవి కలిసి వంద వరకు బ్యాంలు నిర్మిస్తున్నారు. ఈ డ్యాంల కారణంగా నిర్వాసితులైన ప్రజల పక్షాన పోరాడే నాథుడు కరువయ్యాడు. ఈ పరిస్థితులన్నీ మావోయిస్టులకు అనుకూలంగా మారాయి. మరోవైపు, ఇటీవల ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, బెంగాల్లో పోలీసు, పారా మిలిటరీ బలగాలపై చేసిన భారీ దాడులతో మావోయిస్టుల ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా పెరిగింది. ఫలితంగా రాజ్యంతో పోరాటానికి సిద్ధమైన ప్రతి ఒక్కరూ మావోయిస్టుల వైపు చూసే స్థితి ప్రస్తుతం దేశంలో నెలకొన్నది.

శాంతి నెలకొల్పాలి..

జాతుల ఆకాంక్షను, అస్తిత్వాన్ని, ప్రణుల మౌలిక సమస్యలను పట్టించుకోకుండా పాలకులు కుంభకోణాల్లో నిండా మునిగినంతకాలం మావోయిస్టు ఉద్యమం కొనసాగుతూనే వుంటుంది. ఒకచోట అణచివేయబడినా మరోచోట మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బలహీనపడిన కాలంలోనే.. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలలో విప్లవోద్యమం మరింత బలపడడానికి, బెంగాల్, ఈశాన్యాలకు విస్తరించడానికి కారణమిదేనని గుర్తించాలి. భారీ ఎన్ కౌంటర్లు, పోలీసు బలగాలపై దాడులు జరిగినప్పుడల్లా చర్చల మంత్రం వల్లించడం, యథాప్రకారం సైనిక పద్ధతుల్లో ఉద్యమ నిర్మూలనకు ప్రయత్నించడం ప్రభుత్వాలు ఇకనైనా ఆపేయాలి.

కిషన్జీ మరణించిన వారానికి మావోయిస్టులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన హోం మంత్రి చిదంబరం మొదట మధ్య భారతంలో కొనసాగుతున్న గ్రీన్హెంట్ను నిలిపివేయాలి. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న స్వామి అగ్నివేశ్ లాంటి సామాజిక కార్యకర్తలు, మేధావుల సహకారంతో దేశంలో ఏకైక అతిపెద్ద పోరాట సంస్థగా నిలిచిన సీపీఐ (మావోయిస్టు) పార్టీతో చిత్తశుద్ధితో శాంతి చర్చలకు చొరవ చూపాలి.

  • డి. మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News