Tuesday, July 9, 2024

అన్నల రాజ్యం-2: నాలుగు జిల్లాల్లో సమాంతర సర్కార్లు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ)

కటిక చీకట్లలో కడు పేదరికంతో కూడు, గూడు, గుడ్డ కరువైన దీనస్థితిలో బతుకుతున్న బస్తర్ ఆదివాసులకు 1980లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశించిన నక్సలైట్లు దేవుళ్లలా కనిపించారు. అభివృద్ధి పేరుతో అటవీ సంపదను, ఖనిజ వనరులను దోచుకెళుతున్న ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు చేస్తున్నదేమీ లేదని అన్నలు చెప్పిన మాటలను మొదట వాళ్లు నమ్మలేదు. అయితే కాలక్రమంలో పాలకుల పట్టించుకోనితనం, అటవీ సిబ్బంది అరాచకాలు, కాంట్రాక్టర్ల, షావుకార్ల దోపిడి వారిని మావోయిస్టులకు దగ్గర చేశాయి.

ఎక్కడి నుంచో వచ్చి తమ చుట్టూతా తిరుగుతూ తాము పెట్టింది తింటూ తమకు రాజకీయాలు నేర్పుతూ చివరకు తమ కళ్ల ముందే పోలీసు ఎన్‌కౌంటర్లలో బలికావడం వారిని కదిలించింది. మెల్లమెల్లగా ఉద్యమం వైపు అడుగులు వేశారు. సంగాల్లో సంఘటితమై తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. ఎన్ని పోరాటాలు చేసినా పాలకుల్లో కనీస స్పందన లేకపోగా పోలీసు బలగాలను ప్రయోగించి అణిచివేయడం విధానంగా మార్చుకున్నారు. ఫలితంగానే మావోయిస్టుల నాయకత్వంలో స్వయం పాలనకు శ్రీకారం చుట్టారు. ఊరూరా జనతన (ప్రజల) సర్కార్లను ఏర్పాటు చేసుకుని తమ అభివృద్ధికి తామే బాటలు వేసుకుంటున్నారు.

నాలుగు జిల్లాల్లో నక్సల్ రాజ్యం..

ప్రస్తుతం బస్తర్ లోని నాలుగు జిల్లాల్లో జనతన(ప్రజా) సర్కార్ల నిర్మాణం ఉంది. వాటిపై ఏరియా సర్కార్ల అజమాయిషీ కొనసాగుతోంది. రెండు జిల్లాల్లో జిల్లా స్థాయి సర్కారు సైతం పనిచేస్తోంది. మిగతా రెండు జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి నిర్మాణం చేపట్టి దండకారణ్య రాష్ట్ర సర్కారు ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఇందుకోసం జోన్ తయ్యారీ కమిటీ (జోన్ సన్నాహక కమిటీ) వేశామని ఆయన వెల్లడించారు. ఇక్కడి ప్రజలకు ప్రభుత్వమంటేనే తెలియదని, పోలీసులు, అటవీ సిబ్బంది మాత్రమే తెలుసునని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో స్వయం పాలనకు పూనుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. జనతన సర్కార్ల ఏర్పాటును వ్యతిరేకించే నైతిక హక్కు పాలకులకు లేదన్నారు. చేతనైతే ఆదివాసుల అభివృద్ధికై పాటు పడాలని హితవుపలికారు.

బోరుబావుల్లోనే ప్రభుత్వం..

సుక్మా, బీజాపూర్, దంతేవాడల్లోని అనేక గ్రామాల్లో పర్యటించిన తర్వాత ఆ నాయకుడు చెప్పిన మాటల్లో నిజముందనిపించింది. ఏ పల్లెలోనూ కరెంటు లేదు.. పక్కా ఇళ్లు లేవు.. పిల్లలు చదువుకోడానికి స్కూళ్లు లేవు.. జ్వరం వస్తే డాక్టర్ లేడు.. ధరించడానికి సరిపడ బట్టలు లేవు.. రోడ్లు రేవు.. ఎవరికీ రేషన్ కార్డులు కాని, ఓటరు గుర్తింపు కార్డులు కాని లేవు.. వ్యవసాయం వర్షాధారం.. ప్రాజెక్టులు, పథకాల ఊసే లేదు. బయటి ప్రపంచంలో ప్రతి ఇంట్లో కొలువైన టీవీ ఇక్కడ మచ్చుకైనా కానరాదు. తాగునీటి కోసం అక్కడక్కడా వేసిన బోర్ బావుల్లో మాత్రమే మనకు ప్రభుత్వం దర్శనమిస్తుంది.

జనతన సర్కార్ల స్వరూపం:

గ్రామ స్థాయి:
క్రాంతికారీ జనతన సర్కారు (విప్లవ ప్రజా సమితి-ఆర్పీసీ)

పరిధి- 500 నుంచి 9వేల మధ్య జనాభా కలిగిన 2,9 గ్రామాలు

కమిటీ- 7 నుంచి 11 మంది సభ్యులు

అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక: 18 సం.లు పైబడిన స్త్రీలు, పురుషులతో కూడిన గ్రామసభ..

ఎన్నిక కావడానికి కనీస వయసు: 20 సం.లు

విభాగాలు: అభివృద్ధి, ఆరోగ్యం, విద్య-సాంస్కృతికం, అటవీ పరిరక్షణ, ఉపాధి, న్యాయ, ప్రజాసంబంధాలు, ప్రజారక్షణ. ఒక్కో విభాగాన్ని జనతన సర్కారు కమిటీ సభ్యుడొకరు పర్యవేక్షిస్తాడు. ఆయన ఆధ్వర్యంలో 9-7 మందితో సబ్ కమిటీ పని చేస్తుంది.

 

సమావేశాలు: నెలకొకసారి. అత్యవసర పరిస్థితిలో ఎప్పుడైనా..

ఏరియా, డివిజన్ స్థాయిల్లోనూ నిర్మాణం ఇలాగే ఉంటుంది. వాటిని ఏరియా సర్కారు అనీ, డివిజన్ సర్కారు అనీ వ్యవహరిస్తున్నారు. ఏరియా సర్కార్లు గ్రామ సర్కార్ల, డివిజన్ సర్కార్లు ఏరియా సర్కార్ల బడ్జెటు పనుల తీరును, ఇతర కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి.

గ్రామ జనతన సర్కారు అధ్యక్షుడు బుద్రూ ఇంటర్వ్యూ:

ప్ర: ఇప్పటికే మనకు ఒక ప్రభుత్వం ఉంది కదా! దాన్ని కాదని జనతన సర్కారు ఎందుకు ఏర్పాటుచేశారు?

జ: తాతలు తండ్రుల నుంచి మా జనం అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ఇక్కడ ఏ సౌకర్యమూ లేదు. మమ్మల్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. అందుకే మా అభివృద్ధి మేమే చేసుకుందామని నిర్ణయించుకున్నాం. మాలో నుంచే సర్కారును ఎన్నుకున్నాం.

ప్ర: అలా చేయడం తప్పు కదా!

జ: తప్పెలా అవుతుంది? అభివృద్ధి వాళ్లు చేయరు. మమ్మల్ని చేసుకోనివ్యరా ! ఊరందరం కలిసి సమిష్టిగా పనులు చేపడుతున్నాం. మేమేమీ నేరం చేయడం లేదు.

ప్ర: ఏ ఏ పనులు చేస్తున్నారు ?

జ: అన్ని ఊళ్లలో చెరువులు, కుంటలను నిర్మిస్తున్నాం. ప్రతి కుటుంబానికీ కనీసం ఐదెకరాల భూమి ఉండేలా చూస్తున్నాం. సమిష్టిగా వ్యవసాయం చేసి వడ్లు, పజ్ఞాన్న, పెసలు, అలిసెంతలు, బబ్బెర్లు, పల్లీలు పండిస్తున్నాం. అందరం పనిచేస్తాం. వచ్చిన పంటను అందరం పంచుకుంటాం. ఇటీవల భూమి రెవెలింగ్ పనులను చేపట్టాం. మా ఊళ్లో స్కూలు పెట్టాం. డాక్టర్ కూడా మా పిలగాడు ఒకడు శిక్షణ పొందివచ్చాడు.

ప్ర: వీళ్లకు జీతం ఏమైనా ఇస్తారా ?

జ: అవును. భోజనం పెట్టి 500 రూ. ఇస్తున్నాం. మావాళ్లే కనుక ఆసక్తిగానే పనిచేస్తున్నారు.

ప్ర: మీ సర్కార్లలో మావోయిస్టుల పాత్ర ఏమిటి ?

జ: వాళ్లు మా పనిలో జోక్యం చేసుకోరు. ప్రారంభంలో మాకు గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు. పోలీసులు మమ్మల్ని వేధించినప్పుడు మాత్రం మాకు అండగా నిలబడతారు.

ప్ర: ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ?.

జ: మా దారిన మమ్మల్ని వదిలేయండి. జనతన సర్కార్లతో మేము ఎవరికీ నష్టం చేయడం లేదు. ఇన్నేళ్లు మమ్మల్లి పట్టించుకోలేదు. పట్టించుకోకండి. బలగాలను పంపి అమాయక ఆదివాసులను కష్ట పెట్టకండి.

(ఫిబ్రవరి 28, 2013) నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Latest News