Friday, July 5, 2024

అన్నల రాజ్యం-5: ఇళ్ల దహనాలు ఇక్కడ కామన్..

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ)

శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్లు ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. కూలీ రేట్లు పెంచాలని, కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు అరికట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు సభలు పెట్టినా, ర్యాలీలు తీసినా, బంద్లు నిర్వహించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. విసిగి వేసారి చివరకు మావోయిస్టుల గైడెన్స్లో స్వయంపాలనకు పూనుకుంటే మాత్రం వెంటనే బలగాలను దించి భయపెట్టే, బలప్రయోగం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు.

జనతన సర్కార్ల ఆధ్వర్యంలో లోకల్ మిలీషియా బలపడడం, పీఎల్ జీఏ పెద్ద ఫార్మేషన్లకు వెళ్లడం మూలంగా పోలీసులు తరచూ రావడం తగ్గింది కాని అప్పుడప్పుడు వేయికి మించిన బలగాలతో అభియాన్(ఆపరేషన్) లు చేపట్టి గ్రామాలపై పడి బీభత్సం సృష్టించడం జరుగుతోంది.

ఇళ్లను కాల్చడం, కూల్చడం, సామగ్రిని చిందరవందర చేయడం, జనతన సర్కార్లకు చెందిన బళ్లను, వ్యవసాయ క్షేత్రాలను ధ్వంసం చేయడం, దొరికినవారినల్లా కొట్టడం, అరెస్టు చేసి జైళ్లలో పెట్టడం సాధారణమైపోయిందని మేము పర్యటించిన పలు గ్రామాల ప్రజలు వివరించారు. బస్తర్ నుంచి బలగాలు వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. రేంగం, సింగం, పీడియా, తుమ్నారు తదితర గ్రామాల ప్రజలతో మేము మాట్లాడాం.

వాళ్లు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.
  • జనవరి 21న వివిధ దిశల నుంచి వచ్చిన వందలాది బలగాలు బీజాపూర్ జిల్లాలోని తుమ్నారు ఆశ్రమ పాఠశాలపై దాడి చేశారు. ముందే సమాచారం అందిన విద్యార్థులు గ్రామస్తుల ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. టీచర్లు కూడా పారిపోవడంతో ఆగ్రహించిన పోలీసులు తరగతి గదులను, యూనిఫాంలను, దుప్పట్లను, వంట సామగ్రిని కాల్చివేశారు.
  • వంట గదిని, స్టాఫూంను, జనతన సర్కారు జెండా గద్దెను కూల్చివేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బోర్డులు విరగ్గొట్టారు. సల్వాజుడుం బలగాల దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 40 మంది ఈ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నారు.
  • బస్తర్ మొత్తంలో ఇలాంటివి మరో మూడు ఆశ్రమ పాఠశాలలుండగా వాటిని గతంలోనే కూల్చివేశారని టీచర్ సునీల్ మాకు వివరించారు. పీడియాలోని కొందరు సంగ సభ్యుల ఇళ్లను కూడా ఇదేవిధంగా కాలబెట్టి ధాన్యం వగైరా పారబోశారు. ఆ గ్రామంలో ఉన్న అమరుల స్తూపాన్ని రాకెట్ లాంఛర్ కూల్చివేశారు.

  • ఫిబ్రవరి 4న వూసూరు బ్లాక్ రేంగం గ్రామంలో ఆంధ్ర గ్రేహౌండ్స్-ఛత్తీస్గఢ్ పోలీసు సంయుక్త బలగాలకు, మావోయిస్టు గెరిల్లాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఆ గ్రామంపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ గ్రామంలో బంధువు చావుకు వచ్చిన పలువురు మహిళలను పోలీసులు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. మీరు నక్సలైట్లేనంటూ బట్టలు విప్పి అవమానించారు.
  • రేంగంకు చెందిన మడ్కాం బీమె అనే గర్భవతిని కొడితే అబార్షన్ అయింది. సింగంకు చెందిన సోడి బీమెను కట్టుకున్న చీర ఎక్కడిదంటూ కొట్టారు. మడ్కాం సోమ్రిని లోదుస్తులు వేసుకున్నావు కనుక నువ్ మావోయిస్టువేనని కొట్టి లుంగీతో ఉరివేసి చంప ప్రయత్నించారు.
  • కుంజం మూయె, మడాం మంగ్లి, దేవె, బూద్రిల బట్టలు విప్పి అవమానించారు. తుమిడంకు చెందిన మాడ్చి పోసి అనే మహిళ నీళ్ల కోసం వెళితే పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఇప్పటికీ ఆమె నిలబడలేకపోతోంది.
  • మడ్కాం నంది అనే యువతి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తనకు చిన్న పాప ఉందని అబద్ధమాడితే పాలు పిండి చూపించమన్నారు. సింగంకు చెందిన మాడ్వి కోసను టీ షర్టు వేసుకున్నందుకు చితకబాదారు. ఈ మూడు గ్రామాల్లోని పలు ఇళ్లపై దాడి చేసి వేలాది రూపాయల నగదును, కోళ్లను, మేకలను ఎత్తుకెళ్లారు. కొందరు పురుషులను పట్టుకెళ్లి జైళ్లో పెట్టారు.

  • ఫిబ్రవరి 9న బయంపెల్లిని చుట్టుముట్టి ఒకరిని అరెస్టు చేసి తీసుకెళ్లగా గ్రామస్తులంతా వెళ్లి జేగురుగొండ క్యాంపు దిగ్బందించారు. విడిచిపెడతాం.. సర్పంచిని వదిలివెళ్లలండంటూ సముదాయించి, ఆ తర్వాత సర్పంచును కూడా లో అవుట్ పల్లి, కొర్సగూడెంలపై దాడి చేసి చాలా మందిని అరెస్టు చేశారు. కోళ్లను, అరెస్టు చేశారు.
  • డిసెంబర్ కోడిగుడ్లను, మేకలను, నగదును ఎత్తుకెళ్లారు. నవంబర్లో కొరుగూడెం పైబడి కటికెం మున్నీ అనే యువతిని కొట్టి చంపారు. మడ్కాం పొజ్ఞాల్ను చెట్టుకు వేలాడదీసి కొట్టారు.
  • ఇదే నెలలో పువ్వర్తి గ్రామంలో ఉన్న జనతన సర్కారు స్కూలుపై దాడి చేయగా విద్యార్థులు పారిపోయి వరిపొలంలో దాక్కున్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు ఉపాధ్యాయులు రిట్రీట్ పాఠాలు చెప్పడం విశేషం. గంగులూరు, సర్కిన్ పోలీసు క్యాంపులకు సమీపంలో ఉన్న గ్రామాలపై తరచూ మోర్టార్లతో షెల్స్ (బాంబులు) వేయడం జరుగుతోందని ఆ గ్రామాలకు చెందిన ప్రజలు చెప్పారు.
  • క్యాంపు నుంచి 9. 4 కి.మీ.ల దూరం ప్రయాణించి నేలపై పడి పేలే ఈ బాంబులు ఎక్కడ పడతాయో తెలియదన్నారు. ఈ బాంబుల భయంతో తాము పంట పొలాల్లో పనులు చేసుకునే పరిస్థితి లేదని వాపోయారు.

మమ్మల్ని అవమానిస్తున్నారు: మంగ్లి, రేంగం

మా బంధువు చనిపోతే రేంగం వెళ్లాం. అక్కడ పోలీసులు పట్టుకుని నక్సలైటువంటూ కొట్టారు. నాకు పెళ్లయిందని చెప్పినా వినిపించుకోలేదు. బట్టలు విప్పి చెక్ చేశారు. బ్రా ఉంది కనుక నువ్ మావోయిస్టువన్నారు. ఎంత మొత్తుకున్నా వినలేదు.

సైన్యం వెనక్కి వెళ్లాలి: సుక్కు, పీడియా

ఎక్కడో ఉండాల్సిన భారత సైన్యం ఇక్కడకు ఎందుకు రావాలి. పొలం పనులు చేస్తుంటే బాంబులు వేస్తున్నారు. ఈ దేశంలో ఆదివాసులు బతక్కూడదా! మేం ఏ నేరం చేశాం. మా వికాస్ మేము చేసుకోవడం తప్పా. భారత ఫౌజ్ వెంటనే వెనక్కి వెళ్లాలని మీరు వెళ్లి చెప్పండి..

పామేడ్ ఏరియా కమిటీ కార్యదర్శి సోని ఇంటర్వ్యూ:

ప్ర: జనతన సర్కార్లు ఇంత బలంగా ఉన్నా పోలీసులు దాడి ఎలా చేయగలుగుతున్నారు?

జ: గతంలో మా నిర్మాణాల్లో పనిచేసి లొంగిపోయిన వారి సాయంతో దాడి చేస్తున్నారు. అలాగే మేమంటే పడని కొందరు వ్యక్తులు సంతలకు వెళ్లినప్పుడు సమాచారం ఇస్తున్నారు. అయినా దాడులు ఎప్పుడంటే అప్పుడు జరగడం లేదు. కేవలం వేయికి పైబడిన బలగాలుంటే మాత్రమే వస్తున్నారు. చాలాసార్లు ముందే ప్రజలకు సమాచారం అందుతుంది. వారంతా ఇళ్లను వదిలి అడవిలోకి వెళతారు. అయితే కొన్నిసార్లు పోలీసులు రహస్యమార్గంలో అడవులు, గుట్టల గుండా వచ్చినప్పుడు జనం బలవుతున్నారు.

ప్ర: పోలీసులు జనాలనే ఎందుకు వేధిస్తున్నారు?

జ: జనతన సర్కార్లు ఏర్పాటు చేసుకుని తమ అభివృద్ధి తామే చేసుకుంటుండడం ప్రభుత్వాలకు కంటగింపుగా మారింది. అందుకే ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారు. వాళ్లను భయపెట్టడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని వారి ఉద్దేశం.

ప్ర: మహిళలపై పోలీసుల వేధింపులపై మీ అభిప్రాయం?

జ: ఢిల్లీ అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించిన సభ్యసమాజం ఇక్కడ బస్తర్ లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటికైనా మహిళా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఇక్కడికి వచ్చి నిజానిజాలు పరిశీలించాలి. బయటి ప్రపంచానికి తెలియజెప్పాలి. ఈ మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగానైనా ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా

ప్ర: మీ పార్టీలోనూ మహిళలపై వివక్ష ఉందనే ప్రచారం ఉంది..

జ: అది నిజం కాదు. అందుకు నేనే సాక్ష్యం. నేను చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఎప్పుడూ వివక్ష ఎదుర్కోలేదు. మహిళా సమస్యలపై మా పార్టీ వైఖరి స్పష్టంగా ఉంది కనుకనే వాళ్లే అధికంగా రిక్రూట్ అవుతున్నారు.

ప్ర: దళాల్లో వంట పని మహిళలే చేస్తారా?

జ: అలా ఏం లేదు. అందరికీ డ్యూటీలు ఉంటాయి. పురుషులైనా, మహిళలైనా అన్ని పనులు చేయాల్సిందే. మహిళలు పైస్థాయి కమిటీల్లో కూడా ఉన్నారు. భారీదాడుల్లో పాల్గొంటున్నారు. కమాండర్లుగా నేతృత్వం వహిస్తున్నారు. మిలిటరీ ట్రెయినింగ్ ఇస్తున్నారు. అదంతా దుష్ప్రచారం.

(మార్స్ 3, 2013) నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Latest News