Monday, July 8, 2024

అన్నల రాజ్యంలో ఆరు రోజులు: బస్తర్‌లో మావోయిస్టు సర్కారు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ)

మధ్యభారత అడవుల్లో ఓ కొత్త వ్యవస్థ పురుడు పోసుకుంటోంది. దేశ వనరులను బహుళజాతి సంస్థలకు దఖలు పరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై అక్కడి ఆదివాసీలు తిరగబడుతున్నారు. మావ నాటె మావ రాజ్ (మా ఊళ్లో మా ప్రభుత్వం) అనే నినాదంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీ అండతో ఊరూరా క్రాంతికారీ జనతన సర్కార్ల (విప్లవ ప్రజా సమితి)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమిస్తున్నారు. మానవజాతి మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు కీలకమైన అడవులు, ఖనిజాల పరిరక్షణలో తమతో కలిసి రావాల్సిందిగా నాగరిక సమాజానికి పిలుపునిస్తున్నారు.

నాలుగు జిల్లాల్లో సొంత ప్రభుత్వాలు

ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దంతేవాడ, బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాల్లో మూడంచెల పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసుకుని దండకారణ్య రాష్ట్ర స్థాయి సర్కారు ఏర్పాటు దిశలో పురోగమిస్తున్నారు. సామ్రాజ్యవాదుల ప్రోద్బలంతో వరుస ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు ప్రత్యామ్నాయంగా ఒక నూతన అభివృద్ధి నమూనాను దేశ ప్రజల ముందుంచుతున్నారు. స్వాతంత్య్రానంతరం ఆదివాసీల బాగోగులను ఏనాడూ పట్టించుకోని పాలకులు ఇప్పుడు తమ పాలన తామే చేసుకుంటామని సంఘటితమైతే ఉక్కుపాదంతో అణచివేయజూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

స్కూళ్లు, హాస్పిటళ్లు కూడా..

సమిష్టి వ్యవసాయ క్షేత్రాల సాగుకోసం చెరువులు నిర్మిస్తుంటే, పలు రకాల ధాన్యాలను, పప్పుదినుసులను పండిస్తుంటే, నిరక్షర పక్షులుగా మిగిలిన గోండు బిడ్డలకు చదువు నేర్పడానికి పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటే, రోగాల నుంచి ముక్తికి సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసుకుంటుంటే వాటిపై దాడిచేసి కాల్చి కూల్చివేస్తున్నారని వాపోతున్నారు. ఆదివాసీల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించకపోవడం వల్లే తాము ఉద్యమించాల్సి వస్తోందని స్పష్టం చేస్తున్నారు. తమ జనతన సర్కార్లను నాశనం చేయడానికి బదులు ఉద్యమ నాయకత్వంతో శాంతి చర్చలు జరిపి దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని ప్రపంచానికి చాటాలని డిమాండ్ చేస్తున్నారు.

(ఫిబ్రవరి 27, 2013), నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Latest News