Friday, July 5, 2024

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు..?

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోందని, రహస్యంగా అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తూ అంతర్జాతీయ అణు ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్పై సైనిక దాడికి సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరానికి ముందు అధ్యక్షుడు ఒబామా ఇరాన్ సెంట్రల్ బ్యాంకుపై ఆర్థిక ఆంక్షలు విధించే ఆదేశాలపై సంతకాలు చేశారు. ఆ దేశ కరెన్సీ రియాల్ విలువ 12 శాతం పడిపోయేలా చర్యలు చేపట్టారు. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేశాయి. ఇరాన్ సంస్థలతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడాన్ని నిషేధించాయి. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశాయి.

యూరోపులో ఉన్న 180 మంది ఇరాన్ రాయబార కార్యాలయాల అధికారులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించాయి. కాగా, సైనికేతర అవసరాల కోసం మాత్రమే తాము అణు కార్యక్రమాన్ని చేబట్టామని, పొరుగు దేశాలను రెచ్చగొట్టే చర్యలకు తాము పూనుకోలేదని, తన స్వప్రయోజనాల కోసమే అమెరికా ఈ ఆరోపణలు చేస్తోందని ఇరాన్ వాదిస్తోంది. ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని తప్పు పడుతూ తాటాకు చప్పుళ్లకు తాము బెదరబోమని, దాడి చేస్తే దీటుగా జవాబు చెబుతామని హెచ్చరించింది. హార్మజ్ జలసంధిని మూసివేసి గల్ఫ్ నుంచి యూరప్కు చమురు రవాణాను స్తంభింపజేస్తామని హెచ్చరించింది.

అణు శాస్త్రవేత్త హత్య..

సైనిక దాడికి పశ్చిమమిత్రులను ఒప్పించే పనిలో అమెరికా ఉంటే, మూడవ ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ చేస్తున్నారు. ఇరాన్ అణుశాస్త్రవేత్త ముస్తఫా అహ్మదీ రోషన్ను కొంతమంది ఆగంతకులు జనవరి 11న పట్టపగలు టెహరాన్లో హత్యచేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇప్పటికి నలుగురు శాస్త్రవేత్తలను ఈ విధంగా చంపారని ఇరాన్ ఆరోపించింది. దీంతో ప్రస్తుతం గల్ఫ్ యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి.

ఇరాన్-అమెరికాల వైరం ఈనాటిది కాదు. 1979లో బద్దలైన ఇరాన్ విప్లవంలో అప్పటి వరకు అధికారంలో ఉన్న రాజు షా మహ్మద్ రెజా పహ్లవిని పదవీచ్యుతుని చేసి మత నాయకుడు ఆయతుల్లా ఖొమేని నాయకత్వంలో ఇస్లామిక్ విప్లవకారులు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటి నుంచీ రెండు దేశాల మధ్య శతృత్వం కొనసాగుతోంది. విప్లవ తదనంతర కాలంలో రాజును తమ దేశానికి అప్పగించాలని విప్లవ ప్రభుత్వం అమెరికాను కోరగా, అందుకు అగ్రరాజ్యం నిరాకరించి, షాకు ఆశ్రయం కల్పించడంతో వైరానికి తెరలేచింది.

అదే సంవత్సరం నవంబర్ 4న విప్లవ విద్యార్థులు కొందరు టెహరాన్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించి అందులోని 52 మంది అధికారులను నిర్బంధించారు. 1980 ఏప్రిల్ 7న ఇరాన్తో తన రాయబార సంబంధాలను అమెరికా తెంచుకుంది. 24వ తేదీన బందీలను విడిపించడానికి అమెరికన్ సైన్యం విఫలయత్నం చేసి 8మంది సైనికులను కోల్పోయింది. చివరకు, అల్జీరియా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం 1981 జనవరి 20న బందీలను ఇరాన్ విడుదల చేసింది.

అమెరికా ఏకపక్ష సాయం..

1980లో మొదలై ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అమెరికా ఏకపక్షంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. ఇరాక్తో రాయబార సంబంధాలు లేనప్పటికీ ఆ దేశానికి సైనిక సహాయం చేసిందని, ఆంత్రాక్స్, బుబోనిక్ ప్లేగ్ వంటి రసాయనిక, జీవ ఆయుధాలను సైతం సమకూర్చిందని ఇరాన్ ఆరోపించింది.

మరోవైపు వివిధ దేశాల్లో అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు చేసి విధ్వంసం సృష్టించిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ కారణంతో 1987-88మధ్యలో రెండు సార్లు ఇరాన్ నావికాస్థావరాలు, చమురు క్షేత్రాలపై దాడులు చేసింది. క్లింటన్ అధికారంలోకి వచ్చాక 1995లో ఇరాన్పై పూర్తి స్థాయి ఆర్థిక ఆంక్షలు విధించారు. I

జూనియర్ బుష్ కాలం(2001-08)లో ఇరాన్తో శతృత్వం మరింత పెరిగింది. ఉత్తర కొరియా, ఇరాక్లతో కలిపి ఇరాన్ను ఆయన దుష్టత్రయంగా వర్ణించారు. ఇరాక్పై దాడి నేపథ్యంలో ఇరాన్తో సంబంధాలు మెరుగుపడవచ్చన్న పరిశీలకుల అంచనాలకు భిన్నంగా అమెరికా ఆ దేశంతో శత్రుపూరిత వైఖరిని కొనసాగించింది. ఇరాక్ భూభాగం నుంచి మానవ రహిత విమానాలను పంపి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడం, ప్రభుత్వ వ్యతిరేక సంస్థలను చేరదీసి వారితో బాంబు దాడులు చేయించడం, ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి అమెరికా దళాలు తూర్పు ఇరాన్లోకి చొచ్చుకురావడం వంటి ఘటనలు ఈ కాలంలో జరిగాయి.

ఇరాన్ అధ్యక్షుడిగా నెజాద్..

2005 మార్చ్ లో అణ్వాయుధ రహిత దేశాలు ఆ ఆయుధాలను సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలను నివారించేందుకు లేదా అడ్డుకునేందుకు అవసరమైతే అణ్వాయుధాలను సైతం ప్రయోగించేలా అమెరికా తన విధానాన్ని సవరించుకుంది. ఆగస్టులో సంప్రదాయవాదీ, అమెరికా ఆధిపత్యవాదానికి బద్ధవ్యతిరేకీ అయిన ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ పగ్గాలు చేబట్టారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. 2006 లో ఇంటెలిజెన్స్ సమాచార సేకరణకు ప్రత్యేక ఇరానియన్ డైరెక్టరేట్ను పెంటగాన్ ఏర్పాటు చేసింది.

రెండు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించే దిశలో కొన్ని ప్రతిపాదనలతో నెజాద్ బుష్క లేఖ రాయగా దానిని అమెరికా తిరస్కరించింది. పైగా, యురేనియం శుద్ధి ప్రక్రియను చేబడుతున్నందుకు ఇరాన్పై చర్య తప్పదని బుష్ హెచ్చరించారు. ఇదేకాలంలో ఇరాన్ భూభాగంలో అమెరికా ప్రత్యక్ష పరోక్ష దాడులు క్రమంగా పెరిగాయి. అధ్యక్షుని ఆమోదంతోనే సీఐఏ, జాయింట్ ఫోర్సెస్ కమాండ్ల సారథ్యంలో దక్షిణ ఇరాక్ స్థావరంగా ఇరాన్ సరిహద్దుల్లోకి పలుమార్లు అమెరికన్ బలగాలు చొచ్చుకెళ్లాయి. ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పై దాడి చేసి ఐదుగురు రాయబార సిబ్బందిని బంధించి కీలక పత్రాలు ఎత్తుకెళ్లాయి.

శాస్త్రవేత్త కిడ్నాప్..

2009లో ఒబామా పగ్గాలు చేబట్టాక ఇరాన్-అమెరికా సంబంధాల్లో గణనీయ మార్పు వస్తుందని ఆశించిన పరిశీలకులు మరోసారి భంగపడ్డారు. ప్రారంభంలో ఇరుపక్షాలనుంచీ సానుకూల సంకేతాలు వెలువడ్డా అది మూణ్నాళ్ల ముచ్చటే అయిం ది. 2009 మేలో ఇరాన్ర్కు చెందిన అణుశాస్త్రవేత్త షహ్రామ్ అమీరీని అమెరికా బలగాలు ఎత్తుకెళ్లడంతో రెండు దేశాల మధ్య మరోసారి పగ రగిలింది. ప్రతీకార చర్యగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాను నిషేధిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

మరోవైపు, మధ్యధరా ప్రాంతంలో బలీయమైన శక్తిగా ఎదగడం కోసం ఇరాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య పోటీ తీవ్రమైంది. అమెరికా అండదండలు దండిగా ఉన్న సౌదీ అరేబియా ఇరాన్కు వ్యతిరేకంగా పొరుగు దేశాలను కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నది.

ఇరాన్తో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వుతూ అమెరికాను రంగంలోకి దించడానికి తహతహలాడుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సంక్షోభానికి తెరలేచింది. ఫోడ్రో యురేనియం శుద్ధి కర్మాగారం త్వరలో తన పనిని ప్రారంభించబోతున్నదని ఇరాన్ అణుశక్తి సంస్థ అధినేత ఫెరిడూన్ అబ్బాసీ -దవానీ ప్రకటించడంతో ఉద్రిక్తతలకు తెరలేచింది.

అమెరికా విధానాలు అన్యాయం..

అయితే, ఈ కర్మాగారంలో తయారయ్యే యురేనియం న్యూక్లియార్ వార్డ్లకు ఉపయోగపడదని, విద్యుత్, సైనికేతర అవసరాలకు ఉపయోగపడే 3.5 శాతం, 4 శాతం, 20 శాతం రకాల యురేనియంను మాత్రమే తాము తయారుచేయ తలపెట్టామని ఆయన స్పష్టం చేశారు. ఈ వాదనలను అమెరికా తిరస్కరిస్తోంది. శాంతియుత అవసరాలకు మాత్రమే అణుశక్తిని ఉపయోగించేటట్టయితే అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణను ఇరాన్ ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నిస్తోంది.

కుక్కను పిచ్చి కుక్కగా ప్రచారం చేసి న్యాయబద్ధంగా, చట్టబద్దంగా చంపడమన్నది అమెరికా పాలకులు అనుసరిస్తున్న పద్ధతి. కొరియా నుంచి ఇరాక్ వరకు, నొరీగా నుంచి గఢాఫీ వరకు జరిగిందిదే. ఇదే విధానాన్ని ప్రస్తుతం ఇరాన్ విషయంలోనూ అనుసరిస్తోంది. అమెరికా ఏకపక్ష ధోరణిని, ఇరాన్పై తలపెట్టిన దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. శాంతియుత అవసరాలకు అణుశక్తిని వాడుకునే హక్కు ప్రతి దేశానికీ ఉందన్న ఇరాన్ వాదనకు మద్దతునివ్వాలి. ప్రపంచ శాంతిని కాపాడాలి.

  • డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News