Monday, July 8, 2024

నక్సల్స్ ఓటు బ్యాంకు ఎటువైపు?

రాష్ట్రం లో ఎన్నికల వాతావ రణం వేడెక్కింది. అన్ని పార్టీ లూ తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటించాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, దళిత, బలహీన, మైనారిటీ వర్గాల్లో పట్టు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుండగా, వైఎస్ సర్కారు అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తుల సమీకరణ తమను తప్పక విజయ పథాన నడిపిస్తుందని తెలుగు దేశం భావిస్తోంది. సేవే లక్ష్యం.. ప్రేమే మార్గమంటూ పార్టీ స్థాపించిన మెగా స్టార్ చిరంజీవి సామాజిక న్యాయ మంత్రం జపిస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ ‘ప్రత్యేక’ సెంటిమెంటు పైనే నమ్మకాలు పెట్టుకున్నది. అయితే, రాష్ట్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎప్పటి నుంచో అలవాటు పడిపోయింది.

చీలిన ఓటర్లు..

ఓటర్లు వివిధ వర్గాలుగా చీలిపోయి తమ వర్గ ప్రయోజనాలను నెరవేరుస్తాయని భావించిన పార్టీలకే ఓటు వేస్తున్నారు. దళితులు, బలహీనవర్గాలు, కుల సంఘాలు, మైనారిటీలు, మహిళలు, ఉద్యోగులు, వామపక్ష సానుభూతిపరులు ఇలా ఎన్నో సామాజిక వర్గాలు గెలుపులో కీలక పాత్ర వహిస్తున్నాయి. 1983 ఎన్నికల నుంచి మరో వర్గం ఇందులో వచ్చి చేరింది. అదే నక్సల్ ఓటు బ్యాంకు. 1977 ఎన్నికల్లో కేంద్రంలో జనతా కూటమి అధికారంలోకి వచ్చి, ఎమర్జెన్సీ చీకటి పాలన అంతమైన తర్వాత మన రాష్ట్రంలో నక్సలైట్ల నాయకత్వంలో ప్రధానంగా పల్లెల్లో రైతాంగ ఉద్యమం బలపడింది. ఆ తర్వాతి కాలంలో అన్ని జిల్లాలకూ విస్తరించి పట్టణాలకూ ఎగబాకింది. 1982లో ఎన్ టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించే నాటికి పేద, బలహీనవర్గాల ప్రజల్లో మంచి పట్టు సంపాదించింది.

నక్సలైట్లు దేశభక్తులన్న ఎన్టీయార్..

ఈ వర్గాల మద్దతును కూడగట్టే లక్ష్యంతోనే పార్టీ పెట్టిన ఎన్‌టీఆర్ నక్సల్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకుంటే గాని ముఫ్పై ఏళ్ల కాంగ్రెస్ పాలనను కూలదోయలేమని గ్రహించారు. అందుకే తన ఎన్నికల కేంపెయిన్లో నక్సలైట్లను దేశభక్తులుగా కొనియాడారు. తన భావజాలం, నక్సలైట్ల భావజాలం ఒకటేనని చెప్పుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లను బూటకమైనవిగా వర్ణించారు. తాను అధికారంలోకి వస్తే ఎన్‌కౌంటర్లు ఉండవని, సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరిస్తామని ప్రకటించారు.

అన్ని అంశాలూ కలిసివచ్చిన కారణంగా తెలుగుదేశం పార్టీ 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగింది. ఈ విజయంలో నక్సల్ ఓటు బ్యాంకు పాత్ర తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలూ గుర్తించాయి. అంతే.. ఇక అప్పటి నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలు ఈ ఓటు బ్యాంకుపై కన్నేస్తూ వస్తున్నాయి. ఎన్నికలు రాగానే నక్సల్లైటకు అనుకూలంగా మాట్లాడడం, నక్సల్ సమస్యను సామాజిక, ఆర్థిక సమస్యగా ప్రకటించడం, ఆ తర్వాత అధికారం చేజిక్కగానే ఆ వాగ్దానాలను తుంగలో తొక్కడం, శాంతి భద్రతల సమస్యగా తీసుకుని ఎన్‌కౌంటర్లకు పూనుకోవడం సర్వసాధారణమై పోయింది.

ఆ పార్టీలే గెలిచాయి..

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నక్సల్స్ అండ కోసం పాకులాడడం, అధికారంలో ఉన్న పార్టీ తాను కొనసాగిస్తున్న విధానాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించడం ప్రతి ఎన్నికల్లోనూ చర్విత చరణంగా జరుగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, 1983 తదనంతర కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ నక్సలైటు సమస్యపై సానుకూలంగా మాట్లాడిన పార్టీలే గెలుస్తూ వచ్చాయి. అధికారంలో ఉండి నిర్బంధాన్ని ప్రయోగించి ఎన్‌కౌంటర్లకు పూనుకున్న పార్టీలు ఓటమిని చవిచూశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి, ఎన్టీఆర్ ప్రభుత్వ బర్తరఫ్‌కూ నిరసనగా కొనసాగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం నేపథ్యంగా జరిగిన 1985 ఎన్నికల్లో నక్సల్స్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించగా, ఆ పార్టీ ఘన విజయం సొంతం చేసుకున్నది.

అయితే, తర్వాత తన గత హామీలను మరచిన ఎన్టీఆర్ నక్సల్ ఉద్యమంపై విరుచుకుపడ్డారు. నక్సల్స్ అణిచివేతే లక్ష్యంగా గ్రేహౌండ్స్ బలగాలను ఏర్పరచారు. వారిపై అప్రకటిత నిషేధం కొనసాగించారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న చెన్నారెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో నక్సలైట్లతో రాజీ కుదుర్చుకున్నది. తాము అధికారంలోకి వస్తే నక్సల్స్ బహిరంగంగా తమ రాజకీయాలను ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తామని, టీడీపీ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లు, వ్యక్తుల అదృశ్యంపై విచారణ జరిపిస్తామని, సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకుంది.

సీఎంలను మార్చినా..

కాగా, చెన్నారెడ్డి తదనంతరం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో ఐఎస్ఎఫ్ బలగాలను దించి నక్సల్స్ ఉద్యమంపై పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించిన కాంగ్రెస్ చివరకు సిఎంను మార్చినా 1994 ఎన్నికల్లో ఓడిపోక తప్పలేదు. ఆఎన్నికల్లో పీపుల్స్ వార్ సంస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తామని, అధికారంలోకి వస్తే చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి రాగలిగారు.

తాను చేపట్టిన అభివృద్ధి, సంస్కరణలు, పారదర్శక పాలనపై ఎంతో నమ్మకమున్న చంద్రబాబునాయుడు కూడా 1999 ఎన్నికలకు ముందు నక్సల్ ఓటు బ్యాంకు మద్దతు పొందే ప్రయత్నంలో వారి పట్ల సానుకూలంగా మాట్లాడారు. వారి సమస్య సామాజిక ఆర్థిక సమస్యేనని ఒప్పుకున్నారు. అయితే, ఆ తర్వాతి కాలంలో ఆయన కూడా నక్సల్స్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులని ప్రకటించారు. అగ్రనేతలు ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నరేష్ సహా పలువురు నక్సలైట్లు ఈ కాలంలో ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఈ పరిణామాలు సహజంగానే నక్సలైట్లకు ఆగ్రహం కలిగించాయి. చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడికి పురికొల్పాయి.

అధికారంలోకి వస్తే చర్చలు..

తనపై దాడి జరగడంతో దిగ్భ్రాం తికి గురైన టీడీపీ అధినేత నక్సల్స్ సమస్య ఎజెండాగా ప్రజల్లోకి వెళతానని ప్రకటించి శాసన సభను రద్దు చేశారు. నక్సలిజంపై యుద్ధం ప్రకటించారు. కాంగ్రెస్ తీవ్రవాదంతో చేతులు కలుపుతోందని ఆరోపించారు. మరోవైపు, తాము అధికారంలోకి వస్తే నక్సలైటు పార్టీలతో శాంతి చర్చలు జరుపుతామని, వారి ఉద్యమానికి కారణమైన పేదరికాన్ని నిర్మూలిస్తామని, రైతాంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. అలా నక్సల్ సమస్య ప్రధానాంశంగా 2004 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనూహ్య రీతిలో అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.

అనగా గత పాతికేళ్ల చరిత్రను గమనిస్తే, మనకు స్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని సామాజిక వర్గాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న నక్సలైటు పార్టీల సానుభూతిపరులు, అభిమానులు ప్రతి ఎన్నికల్లోనూ కీలక పాత్ర వహిస్తుండడం. అధికారికంగా చూస్తే, ప్రతీసారి నక్సలైట్లు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తున్నప్పటికీ, పలు కారణాల రీత్యా అది అమలు కావడం లేదు.

ప్రతిపక్షాలకే నక్సల్ ఓట్లు..

అధికారంలో ఉన్న పార్టీపై నిప్పులు కక్కుతూ ఆ పార్టీ నేతలను పల్లెల్లోకి రానివ్వకూడదన్న నక్సల్స్ నినాదాన్ని దిగువ స్థాయి శ్రేణులు మరోరకంగా అర్థం చేసుకుంటున్నాయి. ఫలితంగా, అనివార్యంగా నక్సల్ సానుభూతిపరుల, అభిమానుల ఓట్లు ప్రతిపక్షాలకు వెళుతున్నాయి. మరోవైపు, నక్సలైట్లు కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలతో రహస్యంగా లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకుని వాటికి మద్దతు నిచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈసారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా విప్లవోద్యమం దెబ్బమీద దెబ్బతింటూ రాష్ట్రంలో బాగా బలహీన పడింది. శాంతి చర్చల తదనంతర కాలంలో నక్సల్స్ కీలక నేతల్లో చాలా మంది, ఎన్‌కౌంటర్లలో మరణించారు. కొందరు అరెస్టు కాగా, మరికొందరు లొంగిపోయారు. పోలీసులతో జరిగిన పోరులో అనేక దళాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. జనశక్తి, ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన వంటి గ్రూపులు దాదాపుగా అంతర్థానమై పోయాయి. మావోయిస్టులుగా మారిన పీపుల్స్ వార్ నక్సల్స్ కూడా మైదాన ప్రాంతాల్లో కార్యకలాపాలకు స్వస్తి చెప్పారు. అటవీ ప్రాంతాల్లో కదలికలు బాగా తగ్గిపోయాయి. గత ఎన్నికలకు ముందు ప్రతిరోజూ ఏదో ఒక చర్యతో వార్తల్లోకెక్కిన నక్సల్స్ ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలకూ పూనుకోలేదు.

నక్సల్ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఉంది..

అయితే, నక్సలైటు ఉద్యమం బలహీన పడిందంటే నక్సల్ ఓటు బ్యాంకు క్షీణించిందని అర్థం చేసుకోరాదు. గత ముప్పై ఏళ్లలో పల్లె ప్రజానీకంపై, పట్టణ మధ్యతరగతిపై, మేధావి వర్గంపై నక్సల్ రాజకీ యాలు వేసిన ముద్ర అంత త్వరగా చెరిగిపోతుందని చెప్పలేం. నక్సల్స్ భౌతికంగా లేకపోయినంత మాత్రాన వారు బోధించిన సిద్ధాంతం, రాజకీయాలు లేకుండా పోవు. ముఖ్యంగా ఇటు ఉత్తర, దక్షిణ తెలంగాణలో, అటు నల్లమల, తూర్పు కనుమల ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న విప్లవాభిమానులు అనునిత్యం వివిధ సమస్యలపై నక్సల్స్ వైఖరి తెలుసుకోవడానికి ఉబలాట పడుతుండడం కద్దు.

సానుకూలంగా ప్రజారాజ్యం..

ప్రస్తుత ఎన్నిల్లో కూడా వీరు వివిధ పార్టీల పట్ల నక్సలైట్ల వైఖరి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. శాంతి చర్చల పేరిట నక్సల్స్ ను పిలిచి మోసం చేసిన వైఎస్.. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా వ్యవహరించారని పేరుపడిన చంద్రబాబు.. కొత్తగా పార్టీ పెట్టిన చిరంజీవి.. ప్రత్యేక తెలంగాణ పేరుతో పవర్ పాలి’ ట్రిక్స్’కు పాల్పడుతున్న కేసీఆర్.. వీరిలో ఎవరి హామీలను నమ్మాలో తేల్చుకోలేక పోతున్నారు. పైగా, తెలంగాణకు మొదటినుంచీ మద్దతునిస్తున్నప్పటికీ టీఆర్ఎస్ మహాకూటమిలో చేరడాన్ని జైలులో ఉన్న కొందరు మావోయిస్టులు విమర్శించడంతో పార్టీ వైఖరి అర్థం కాక ఏం చేయాలో తోచక సతమతమవు తున్నారు.

మరోవైపు, ఈసారి కేవలం ప్రజారాజ్యం పార్టీ మినహా మిగతా ప్రధాన పార్టీలేవీ నక్సల్స్ ప్రస్తావన తీసుకురావడం లేదు. కావాలనే వైఎస్, చంద్రబాబులు ఈ సమస్యను దాటవేస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లుండవని గతంలోనే ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంలో మౌనమే సమాధానమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాగా, నక్సల్ సమస్యను సామాజిక ఆర్థిక సమస్యగా గుర్తించి పరిష్కరిస్తామని చిరంజీవి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో నక్సల్స్ ఓటు బ్యాంకు ఎటు వైపు మొగ్గు చూపనున్నదీ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలోనైనా నక్సల్స్ ఎన్నికలపై, వివిధ పార్టీలపై తమ వైఖరిని ప్రకటించి విప్లవాభిమానులకు దారి చూపుతారా ? లేక గత కొంతకాలంగా పాటిస్తున్న మౌనాన్ని కొనసాగిస్తారా? కొద్ది రోజులోనే తేలిపోనుంది.

  • డి మార్కండేయ

(ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ సౌజన్యంతో)

Latest News