Monday, July 8, 2024

రేవంత్ చికిత్స ఫలించేనా!

ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. అంతర్గత కుమ్ములాటలతో అధ్వానస్థితికి చేరిన రాష్ట్ర యూనిట్‌కు సారథ్యం వహించే బాధ్యతను ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి అప్పగించింది. అందరూ ఊహించిన విధంగానే పలువురు సీనియర్ నేతలు ఈ నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. గాంధీభవన్ మెట్లెక్కనని ఒకరు.. రాజీనామా చేస్తున్నానని మరొకరు.. కాంగ్రెస్ ఇక టీటీడీపీగా మారుతుందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రెండున్నరేళ్ల పాటు నిర్ణయాన్ని నాన్చిన హైకమాండ్ సడెన్‌గా రేవంత్‌ పేరును ప్రకటించడం వెనుక పెద్ద తతంగమే జరిగిందని సమాచారం. మరియమ్మ లాకప్ డెత్ విషయమై సీఎం కేసీఆర్‌ను జూన్ 25న భట్టి విక్రమార్క సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసారు. ఏడేళ్లుగా ఏనాడూ ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్ నుంచి అకస్మాత్తుగా ఆహ్వానం అందడం, ఆ వెంటనే వాళ్లు ప్రగతిభవన్ మెట్లెక్కడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పీసీసీ అధ్యక్షునికి కనీస సమాచారం ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని సోనియా, రాహుల్ సీరియస్‌గా తీసుకున్నారు. అంతే.. మరుసటి రోజు రాత్రికల్లా పీసీసీ పదవిపై నిర్ణయం వెలువడింది. ఒక్క జగ్గారెడ్డికి తప్ప మిగతా ముగ్గురిలో ఎవరికీ కార్యవర్గంలో ఇప్పటికైతే చోటు లభించలేదు. ఆ తర్వాతి రోజు కేసీఆర్ నిర్వహించిన దళిత ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా సీఎల్‌పీ నేత హోదాలో భట్టి హాజరుకావడంతో ఆయనను మొన్నటి గురువారం ఢిల్లీకి పిలిపించుకుని మొట్టికాయలు వేసారని సమాచారం.

 

కేడర్ నుంచి ఆదరణ

టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌కు కాంగ్రెస్ శ్రేణుల నుంచి మంచి ఆదరణే లభిస్తోంది. కేసీఆర్‌కు దీటైన నాయకుడిగా, మంచి వాగ్ధాటి ఉన్న వక్తగా, ప్రత్యర్థులపై వాడి విమర్శనాస్త్రాలు సంధించే ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా, టైగర్‌గా ఆయనకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్రతిరోజూ జిల్లాల నుంచి పలువురు నేతలు, వేలాది కార్యకర్తలు రాజధానికి తరలివచ్చి ఆయనను అభినందిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా వచ్చినవాళ్లతో ఆయన మంతనాలు సాగిస్తున్నారని రాజకీయవర్గాల భోగట్టా. మొదట కొంత కినుక వహించిన నాయకులు కూడా అధిష్టానం నుంచి అందిన సంకేతాలతో వైఖరి మార్చుకుంటున్నారని, రేవంత్‌తో కలిసి పనిచేయడానికి మానసికంగా సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. ఇక, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలలో ఉన్న పలువురు అసంతృప్త నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి రేవంత్‌తో సన్నిహితంగా మెలిగిన పలువురు లీడర్లు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు.

 

సవాళ్లు..సమస్యలు

అయితే, వచ్చే బుధవారం బాధ్యతలు చేపట్టే రేవంత్‌రెడ్డి ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ కకావికలం అయిపోయింది. పట్టిచుకునే నాథుడు లేక బూత్, గ్రామ, మండలస్థాయి నేతలు, కార్యకర్తలు చెదిరిపోయారు. చాలామంది గత్యంతరం లేని పరిస్థితులలో అధికార పార్టీలో చేరిపోయారు. నియోజకవర్గస్థాయి నాయకులు, చేయి గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ ఫిరాయించారు. కొంతమంది పార్టీలోనే ఉన్నా నిర్వీర్యమైపోయారు. వారందరినీ మళ్లీ ఒక్కతాటిపైకి తెచ్చి పనిచేయించడం నల్లేరుపై నడక కాబోదు. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచకుండా, కింది స్థాయికి వెళ్లి శ్రేణులలో స్ఫూర్తిని నింపకుండా వారిని తిరిగి సొంతగూటికి చేర్చడం సాధ్యం కాదు. అందుకు రేవంత్ చాలా ఓపికగా, ధైర్యంగా, చాకచక్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సివుంటుంది.

 

సక్సెస్ అవుతారా?

రేవంత్ ముందున్న మరో అతిపెద్ద సవాలు బీజేపీ. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుంటోంది. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న ఊపులో యువనేత బండి సంజయ్ నేతృత్వంలో ప్రజలలోకి దూసుకుపోతోంది. ఫిరాయింపులతో, గ్రూపుల తగాదాలతో కాంగ్రెస్ బలహీనపడిన పరిస్థితిని చక్కగా ఉపయోగించుకుంటోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో, జీహెచ్ఎంసీ ఎన్నికలలో మంచి ప్రజాదరణ పొంది ఇక రాష్ట్రంలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమన్న రీతిలో వ్యవహరిస్తున్నది. మాజీ మంత్రి ఈటల చేరిక కూడా ఆ పార్టీకి లాభించనుంది. ఈ పరిస్థితిని రేవంత్ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరమైన విషయమే. ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై ముఖాముఖి దాడిని కొనసాగిస్తూనే మరోవైపు కమలనాథుల దూకుడు ఎత్తుగడలను ఆయన ఎదుర్కోవాల్సివుంటుంది. ఇప్పటికే కాషాయ’బండి’ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉందని ఆరోపిస్తున్న రేవంత్.. బీజేపీ-టీఆర్ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న అంశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

 

కత్తిమీద సామే

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను తయారుచేసుకోవడం, జిల్లా, రాష్ట్రస్థాయిలలో నాయకత్వ టీంలను ఏర్పరచి సమష్టిగా ప్రజలలోకి వెళ్లడం రేవంత్ ముందున్న ఇంకో సవాలు. ప్రస్తుతం చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి పేరున్న మంచి అభ్యర్థులు లేరు. డీసీసీ అధ్యక్షులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారన్నది కీలకమే. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌కు నగదు ఇస్తూ దొరికిపోయిన కేసులో నిందితునిగా ఉండడం రేవంత్‌ను ఇరకాటంలో పెట్టే అంశం. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యర్థులు ఆయనను ఈ విషయంపై ఆత్మరక్షణలోకి నెట్టడానికి ప్రయత్నిస్తారు. చంద్రబాబుకు చెంచా అన్న విమర్శలనూ తను ఎదుర్కోకతప్పదు. వీటిని తిప్పికొడుతూనే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయడం ఆయనకు కత్తి మీద సాముగానే ఉంటుంది.

 

సహకారం ఉంటుందా?

నియామక ప్రకటన వచ్చిన తర్వాత రేవంత్ మీడియాతో చెప్పిన విషయాలలో ముఖ్యమైనది తను ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చేయబోయే పాదయాత్ర గురించి. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజాభిమానాన్ని చూరగొన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో అధికారం సాధించారు. రేవంత్ కూడా అదే దారిలో నడవాలని బహుశా నిర్ణయించుకునివుంటారు. అయితే, అప్పుడు వైఎస్‌కు బాగా కలిసివచ్చిన అంశం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్‌పై ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉండింది. ఆయన నిర్ణయాలను ప్రశ్నించే పరిస్థితి ఎవరికీ లేకుండింది. సోనియాగాంధీ ఆశీస్సులతో, అంగబలం, అర్ధబలం దన్నుతో, సమర్థవంతమైన ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌తో విజయం సాధించగలిగారు. రేవంత్‌రెడ్డికి ఆ స్థాయిలో సపోర్టు, సహకారం లభిస్తాయా? అన్నది కీలకమైన అంశం.

 

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయముంది. ఈలోగా రేవంత్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలి. అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలకు నయానో భయానో ముకుతాడు వేయాలి. వచ్చే ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడమనే ఏకైక ఎజెండాతో అందరితో ఐక్యత సాధించాలి. పాదయాత్ర సందర్భంగా ఆయా జిల్లాల్లో జనంతో మమేకం కావాలి. స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుని సరైన పరిష్కారం సూచించాలి. టీఆర్ఎస్ పాలనపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను నినాదస్థాయికి తీసుకెళ్లాలి. ఆందోళనా కార్యక్రమాలపై శ్రేణులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేయాలి. ఓటర్లను ఆకర్షించగలిగే సమగ్ర ఎన్నికల ప్రణాళికను రూపొందించాలి. ఈ అన్ని అంశాలపై కేంద్రీకరిస్తే తెలంగాణ కాంగ్రెస్ తప్పకుండా దారిలో పడుతుంది. ఓ ఏడాది కాలంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమన్న టాక్ తెచ్చుకోగలిగితే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకే అధికారం దక్కే చాన్స్ ఉంటుంది. వైఎస్‌లా సక్సెస్ అవుతారా? లేక ఉత్తమ్‌లా ఉత్తగానే మిగిలిపోతారా? అన్నది సమీప భవిష్యత్తులో రేవంత్ అనుసరించే ఎత్తుగడలపై, చేపట్టే కార్యాచరణపై ఆధారపడివుంటుంది.

 

-డి మార్కండేయ

(దిశ సౌజన్యంతో..)

Latest News